సహకార.. 'వంద'నం.. ఖమ్మం డీసీసీబీకి వందేళ్లు

ABN , First Publish Date - 2020-12-24T05:02:34+05:30 IST

రైతులకు ఆర్థికంగా అండగా నిలుస్తూ.. అడుగడుగునా సహకారం అందిస్తూ ఇంతితై వటుడింతై అన్న చందంగా ఎదిగి శతవసంతానికి చేరుకుంది ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ).

సహకార.. 'వంద'నం.. ఖమ్మం డీసీసీబీకి వందేళ్లు

రూ.2200కోట్ల టర్నోవర్‌తో రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు

మెరుగైన సేవలతో రైతులకు మరింత చేరువగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు

ఖమ్మం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : రైతులకు ఆర్థికంగా అండగా నిలుస్తూ.. అడుగడుగునా సహకారం అందిస్తూ ఇంతితై వటుడింతై అన్న చందంగా ఎదిగి శతవసంతానికి చేరుకుంది ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ). వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా జీవించే రైతులకు అప్పులు ఇచ్చి.. చేయూత నందించాలని రైతు నాయకుడిగా పేరున్న రామనారాయణ భావించారు. అనుకున్నదే తడవుగా నిజాం కాలమైన 1920 డిసెంబరు 24న ఖమ్మం డీసీసీబీని స్థాపించిన ఆయన తొలి చైర్మన్‌గా ఎన్నికై 1921 వరకు పనిచేశారు. తొలుత అంజుమన్‌ బ్యాంక్‌గా పిలిచే ఈ పరపతి బ్యాంక్‌.. ఆ తర్వాత సహకార బ్యాంక్‌గా మారి.. తదనంతరం సింగిల్‌ విండోగా బలోపేతమైంది. ప్రారంభం నాటి నుంచి ఇప్పటివరకు ఖమ్మం డీసీసీబీకి 16మంది చైర్మన్లుగా వ్యవహరించారు. ప్రస్తుతం 16వ చైర్మన్‌గా కూరాకుల నాగభూషయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రైతుల అవసరాల కోసం కోపరేటివ్‌ బ్యాంకు వ్యవస్థను ప్రారంభించగా అది దశలవారీగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 50 శాఖలుగా విస్తరించింది. నిజాం కాలంలో మొదలైన రైతు సహకార బ్యాంకును 1987 వరకు వ్యవసాయ స్వల్పకాలిక రుణాల కోసం కోపరేటివ్‌ బ్యాంకు పద్ధతి, దీర్ఘకాలిక రుణాల కోసం ల్యాండ్‌ మార్టిగేజ్‌ బ్యాంకు పద్ధతి ఉండేది. 1987లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఎల్‌ఎంబీ ని కూడా కోపరేటివ్‌ బ్యాంకుల్లో విలీనం చేశారు. ప్రస్తుతం ఖమ్మం డీసీసీబీ రూ.2200కోట్ల టర్నోవర్‌తో ఆర్థిక లావాదేవీలు సాగిస్తోంది. ఇందులో రూ.1,300 కోట్లు వ్యవసాయ రుణాలు కాగా.. రూ.900కోట్లు డిపాజిట్లు కలిగి ఉన్నాయి. ఇందులో 1.75లక్షల మంది సభ్యులతో 99 వ్యవసాయ సహకార సంఘాలు 200 వ్యవసాయేతర సంఘాలు 284మంది ఉద్యోగులతో ఖమ్మం డీసీసీబీ నడుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, రాష్ట్ర ఆవిర్భావం అనంతరం వ్యాపారంలో, రైతుసేవలో ముందు నిలిచింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల్లో సహకార సంఘాలు కలిగి ఉండి.. స్వల్ప, దీర్ఘకాలిక, వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలను సైతం అందిస్తోంది. గతంలో రైతుల ఇళ్ల వద్దకే సొసైటీ కార్యదర్శులు, గుమస్తాలు వెళ్లి అప్పులు ఇవ్వటం, వసూళ్లు చేయటం, అప్పులు చెల్లించని వారి ఇళ్లను జప్తులు చేయటం లాంటి పద్ధతులు ఉండేవి. ఆ తరువాత ప్రభుత్వం, పాలక వర్గాలు తీసుకున్న నిక్ణయాలతో సహకార బ్యాంకులు, సొసైటీల నిర్వహణలో మార్పులు జరిగాయి. ప్రస్తుతం డీసీసీబీ ఆధ్వర్యంలో రైతులకు అప్పులు, ఎరువులు, ధాన్యం, విత్తనాల వ్యాపారం, కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు, ఏటీఎం కార్డులతో వినూత్నసేవలు అందుతున్నాయి.

16మంది చైర్మన్లు..

ఖమ్మం డీసీసీబీ ఏర్పడిన తరువాత ఈ వందేళ్లలో 16పాలక వర్గాలు ఎన్నికయ్యాయి. ఖమ్మం డీసీసీబీలో కాంగ్రెస్‌, వామపక్షాలు, తరువాత టీడీపీ నేతలు ప్రాతినిధ్యం వహించగా.. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ నుంచి కూరాకుల నాగభూషయ్య వ్యవహరిస్తున్నారు. గతంలో డీసీసీబీ చైర్మన్‌గా పనిచేసిన జలగం ప్రసాదరావు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా వ్యవహరించారు. కొండబాల కోటేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచారు. బాలసాని లక్ష్మీనారాయణ ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు. 16మంది చైర్మన్లలో 9ఏళ్లపాటు చైర్మన్‌గా పనిచేసిన ఘనత బాలసానికే దక్కింది. గత చైర్మన్‌ మువ్వా విజయబాబు రాజీనామా చేసిన అనంతరం ప్రస్తుత కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ పూర్తిస్థాయి చైర్మన్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత ఎన్నికలు జరిగి.. కూరాకుల కొత్తచైర్మన్‌గా ఎన్నికయ్యారు. 

నాటి నుంచి నేటి వరకు చైర్మన్లు..

1. రామనారాయణ 1920 డిసెంబరు 24 నుంచి 1921 వరకు 

2. రామకిషోర్‌ 1950 నుంచి 1954 జనవరి 15 వరకు 

3. రాయల వీరయ్య 1954 జనవరి 16నుంచి 1959 ఫిబ్రవరి 18 వరకు 

4. ఎ.పురుషోత్తం 1959 ఫిబ్రవరి 19 నుంచి 1960 జూన్‌ 30 వరకు 

5. వెల్లంపల్లి రామచంద్రయ్య 1963అక్టోబరు 1నుంచి 1966 ఆగస్టు 31వరకు 

6. దుగ్గినేని వెంకయ్య 1967 డిసెంబరు 27 నుంచి 1970 డిసెంబరు 26 వరకు

7. ఉడతనేని సత్యం 1975 ఆగస్టు 15 నుంచి 1978 మార్చి 15 వరకు 

8. జలగం ప్రసాదరావు 1982 మార్చి 16 నుంచి 1985 మార్చి 16వరకు, ఆ తరువాత మళ్లీ 1985 ఏప్రిల్‌ 6 నుంచి అదే ఏడాది ఏప్రిల్‌ 25 వరకు పనిచేశారు. 

9. పోట్ల మధుసూధనరావు 1989 జూలై 19నుంచి 1992 జూన్‌ 30 వరకు 

10. కొండబాల కోటేశ్వరరావు 1992 నుంచి 1995 వరకు 

11. బాలసాని లక్ష్మీనారాయణ 1995 ఆగస్టు 10నుంచి 2004 మే 12 వరకు 

12. టీఎస్‌.ప్రసాద్‌ 2005 సెప్టెంబరు 18 నుంచి 2010 ఆగస్టు 1 వరకు 

13. యలమంచిలి రవికుమార్‌ 2011 జనవరి 29 నుంచి 2013 ఫిబ్రవరి 13వరకు 

14. మువ్వా విజయ్‌బాబు 2013 ఫిబ్రవరి 20 నుంచి 2018 ఫిబ్రవరి 27 వరకు 

15. కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ 2018 డిసెంబరు 28 నుంచి 2020 ఫిబ్రవరి 28 వరకు 

16. కూరాకుల నాగభూషయ్య ఈ ఏడాది ఫిబ్రవరి 29న ఎన్నికై కొనసాగుతున్నారు. 

జనవరిలో ఘనంగా శతాబ్ది ఉత్సవాలు 

కూరాకుల నాగభూషయ్య, డీసీసీబీ చైర్మన్‌ 

ఖమ్మం డీసీసీబీ స్థాపించి 100 ఏళ్లు పూర్తవుతుండటం ఆనందకరం. ఈ నేపథ్యంలో జనవరిలో ఘనంగా శతాబ్ది ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. తొలుత ఈ నెల 27న నిర్వహించాలనుకున్నాం. కానీ అనివార్య కారణాలతో వాయిదా వేసి.. జనవరిలో ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం. రైతులకు అన్నివేళలా అండగా ఉంటూ ఖమ్మం డీసీసీబీని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ఎంతో కృషి చేస్తున్నాం. 

Updated Date - 2020-12-24T05:02:34+05:30 IST