‘స్మార్ట్’గా మేసేశారు.. కాకినాడ కార్పొరేషన్లో భారీ కుంభకోణం.. ఎమ్మెల్యే, మంత్రి కోసమే!
ABN , First Publish Date - 2021-08-10T06:41:35+05:30 IST
కాకినాడ నగరపాలక సంస్థలో ల్యాప్‌టాప్‌ల కుంభకోణం చోటుచేసుకుంది. నియోజకవర్గ ముఖ్య నేత కనుసన్నల్లో జరిగిన ఈ వ్యవహారంలో రూ.12 లక్షలకు పైనే అవినీతి చోటు చేసుకున్నట్టు సమాచారం. కార్పొరేటర్లు, అధికారులకు ల్యాప్ టాప్‌లు ఇవ్వాలనే ప్రతిపాదనల్లో భాగంగా మూడో కంటికి తెలియకుండానే టెండర్లు పిలిచినట్టు రికార్డులు సృష్టించారు. తీరా నిబంధనలకు విరుద్ధంగా తమకు కావలసిన కాంట్రాక్టర్‌కు ఆర్డరు కట్టబెట్టేశారు. డెల్ కంపెనీ ఒక్కో ల్యాప్‌టాప్‌కు రూ.74,450 చొప్పున మొత్తం రూ.45 లక్షలు చెల్లించడానికి నిర్ణయించారు. అయితే ఇలా చేస్తే తనకు మిగిలేదేముంది అనుకున్న సదరు కాంట్రాక్టరు అక్కడే అసలు కథ నడిపాడు. ఎవరికీ అనుమానం రాకుండా తక్కువ సామర్థ్యం ఉన్న డెల్ కంపెనీ ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసి అందరికీ పంచేశారు. తీరా అవిప్పుడు సరిగ్గా పనిచేయకపోవడంతో కార్పొరేటర్లు, అధికారులు గుర్రుగా ఉన్నారు. తిరిగి వెనక్కు ఇచ్చేస్తే విషయం బయటపడి కీలక నేత పరువు పోతుందని వెనకడుగు వేస్తున్నారు.
- కాకినాడ కార్పొరేషన్లో ల్యాప్‌టాప్‌ల కుంభకోణం
- కార్పొరేటర్లు, అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి కోసం కొనుగోలు
- టెండర్లు పిలిచామనే ముసుగులో కావలసిన ఓ వ్యాపారికి ఆర్డర్
- ఒక్కోటి రూ.74,450 చొప్పున రూ.45 లక్షల బడ్జెట్ కేటాయించిన నగరపాలక సంస్థ
- తక్కువ ధర ల్యాప్‌టాప్‌లు కొని అంటగట్టిన కాంట్రాక్టర్
- రూ.12 లక్షలకు పైనే నిధుల మేత.. ముఖ్య నేత కనుసన్నల్లో మొత్తం వ్యవహారం
- నాసిరకం ల్యాప్‌టాప్‌లంటూ వైసీపీ కార్పొరేటర్ల గుర్రు.. త్వరలో వెనక్కు ఇచ్చే యోచన
కాకినాడ నగరపాలక సంస్థలో ల్యాప్‌టాప్‌ల కుంభకోణం చోటుచేసుకుంది. నియోజకవర్గ ముఖ్య నేత కనుసన్నల్లో జరిగిన ఈ వ్యవహారంలో రూ.12 లక్షలకు పైనే అవినీతి చోటు చేసుకున్నట్టు సమాచారం. కార్పొరేటర్లు, అధికారులకు ల్యాప్ టాప్‌లు ఇవ్వాలనే ప్రతిపాదనల్లో భాగంగా మూడో కంటికి తెలియకుండానే టెండర్లు పిలిచినట్టు రికార్డులు సృష్టించారు. తీరా నిబంధనలకు విరుద్ధంగా తమకు కావలసిన కాంట్రాక్టర్‌కు ఆర్డరు కట్టబెట్టేశారు. డెల్ కంపెనీ ఒక్కో ల్యాప్‌టాప్‌కు రూ.74,450 చొప్పున మొత్తం రూ.45 లక్షలు చెల్లించడానికి నిర్ణయించారు. అయితే ఇలా చేస్తే తనకు మిగిలేదేముంది అనుకున్న సదరు కాంట్రాక్టరు అక్కడే అసలు కథ నడిపాడు. ఎవరికీ అనుమానం రాకుండా తక్కువ సామర్థ్యం ఉన్న డెల్ కంపెనీ ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసి అందరికీ పంచేశారు. తీరా అవిప్పుడు సరిగ్గా పనిచేయకపోవడంతో కార్పొరేటర్లు, అధికారులు గుర్రుగా ఉన్నారు. తిరిగి వెనక్కు ఇచ్చేస్తే విషయం బయటపడి కీలక నేత పరువు పోతుందని వెనకడుగు వేస్తున్నారు.
(కాకినాడ (ఆంధ్రజ్యోతి)/కార్పొరేషన్:
కాకినాడ నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశాలు ఈ ఏడాది మార్చి 27న జరిగాయి. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లతో సహా అధికారులందరికీ కొత్త ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేయాలని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అధికారులను ఆదేశించారు. అయితే ఇందుకు అవసరమైన నిధుల కోసం అప్పటికప్పుడు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సమావేశమైంది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు 65 మందికి కొత్త ల్యాప్‌టాప్‌లు కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. డెల్ కంపెనీకి చెందిన ల్యాప్టాప్లైతే సభ్యులందరికీ బాగుంటుందని తీర్మానానికి వచ్చారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించి ఎక్కువ సామర్థ్యంతో పనిచేసేలా ఉండడం కోసం ఒక్కో కంప్యూటర్ను రూ.74,450 చొప్పున కొనుగోలు చేయడానికి అను మతించారు. ఇందుకోసం రూ.45 లక్షల దాకా ఖర్చవుతుందని అంచనా వేసి బడ్జెట్ కేటాయింపులు చేశారు. అయితే ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు సంబంధించి ఎవరు సరఫరా చేస్తారనేదానిపై అధికారులు టెం డర్లు పిలవాలి. అందరికీ తెలిసేలా ప్రకటన జారీ చేయాలి. కానీ నియోజకవర్గ కీలకనేత ఆదేశాల మేరకు టెండర్ల విషయం రహస్యంగా ఉంచారు. కేవలం తమకు కావలసిన వ్యక్తి ద్వారా టెండర్ వేయించారు. ఈయన ఒక్కరే ముందుకు వచ్చారనే సాకు చూపించి సదరు కంపెనీకి ఆర్డరు కట్టబెట్టేశారు. దీనివెనుక నియోజకవర్గ కీలకనేతతోపాటు పేరుకు టీడీపీలో ఉంటూ వైసీపీ నాయకుడిగా చలామణి అవుతున్న ఓ చోటా నేత కలిసి తతంగం నడిపారు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది.
రూ.45 లక్షల బడ్జెట్ మొత్తం కంప్యూటర్ల కొనుగోలుకు వెచ్చిస్తే తమకు మిగిలేది ఏదీ ఉండ దని సదరు వర్కు ఆర్డరు పొందిన కాంట్రాక్టరు, చోటా నేత కలిసి స్కెచ్ వేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా పథకం పన్నారు. డెల్ కంపెనీ ల్యాప్‌టాప్‌లే ఇవ్వాల్సి ఉన్నందున కంపెనీని మార్చడానికి వీల్లేదు కాబట్టి అదే కంపెనీ పేరుతోనే తక్కువ సామర్థ్యం కలిగిన వాటిని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా 61 ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేశారు. అయితే కార్పొరేషన్ మంజూరుచేసిన రూ.74,450కు బదులు రూ.50వేలలోపు విలువైన వాటినే కొనుగోలు చేశారు. వాస్తవానికి రూ.74,450 చొప్పున కొనుగోలు చేసే ల్యాప్‌టాప్‌ల్లో ర్యామ్ సామర్థ్యం, వర్షన్ బాగుంటాయి. కానీ తెలివిగా అదే కంపెనీవి కొన్నా లోబడ్జెట్ మోడళ్లు కొనుగోలు చేశారు. తద్వారా అన్ని ల్యాప్‌టాప్‌లకు కలిపి రూ.12 లక్షలకు పైనే నిధులు మిగుల్చుకున్నారు. వీటిని తలాకొంత పంచేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. అయితే కొనుగోలు చేసిన ల్యాప్‌టాప్‌లను ఈనెల 4న జరిగిన రెండో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా అందరికీ పంపిణీ చేశారు.
కార్పొరేటర్లందరికి 45, అయిదుగురు కోఆప్షన్ సభ్యులకు, ఎమ్మెల్యే ద్వారంపూడి, ఎంపీ గీత, మంత్రి కన్నబాబుకు చెరొకటి, కార్పొరేషన్ కమిషనర్, ఏడీసీ, ఎగ్జామినర్, డీసీ, ఎంహెచ్వో, ఏసీపీ1, ఏసీపీ 2, అకౌంటెంట్ ఒక్కోటి చొప్పున అందించారు. వీటిని తీసుకున్న సదరు నేతలు, అధికారులు వాడడానికి ప్రయత్నించి కంగుతిన్నారు. సరిగ్గా పనిచేయకపోవడం, హ్యాంగ్ అవడం తరచుగా జరుగుతుండడంతో గుర్రుగా ఉన్నారు. కొందరైతే ల్యాప్‌టాప్ మోడల్ ఆధారంగా బయట దుకాణాలు, ఆన్లైన్లో ధరలు పరిశీలించి చూస్తే కేవలం రూ.50 వేలలోపు మాత్రమే చూపుతుండడంతో నిధులు మింగేశారని నిర్ధారించుకున్నారు. సాధారణంగా ఎంఆర్పీ ధరలు లాప్‌టాప్‌లపై అధికంగా ఉంటాయి. కానీ అమ్మకం ధర తక్కువ ఉంటుంది. ఇప్పుడీ వ్యవహారం కార్పొరేషన్ సర్కిళ్లలో చర్చనీయాంశంగా మారింది. అధికారులు తమనే మోసం చేశారని ఇప్పుడు వారంతా మండిపడుతున్నారు.

ముఖ్యంగా వైసీపీకి చెందిన కార్పొరేటర్లు అయితే నాసిరకంగా ల్యాప్‌టాప్‌లు అంటగడతారా? అంటూ నిప్పులు కక్కుతున్నారు. త్వరలో వీటిని వెనక్కు ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి ఆర్థికంగా ఇబ్బందుల్లో సమయంలో ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు అసలు కమిషనర్ స్వప్నిల్ దినకర్ ఎలా అనుమతి ఇచ్చారనేదానిపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుమతి ఇచ్చినా టెండర్లు పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షించాలి. అదేదీ జరగలేదు. త్వరలో సదరు బిల్లు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. దీనిపై ఏ అభ్యంతరాలు లేకుండా బిల్లు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్లిపోయాయి. దీనిపై కార్పొరేషన్ అధి కారులను వివరణ కోరితే కంప్యూటర్లు కొన్న మాట వాస్తవమే నని, వాటి సమాచారం తెలియదని తప్పించుకోవడం విశేషం.
