కిస్సా కుర్చీకా!

ABN , First Publish Date - 2022-06-13T05:30:00+05:30 IST

కిస్సా కుర్చీకా!

కిస్సా కుర్చీకా!


  • వికారాబాద్‌ మునిసిపాలిటీలో ముసలం 
  • చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవులపై రచ్చ
  • సమస్య పరిష్కరించే బాధ్యత ఎమ్మెల్యేకు అప్పగించిన అధిష్టానం?

వికారాబాద్‌, జూన్‌13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : వికారాబాద్‌ మునిసిపల్‌ పాలకవర్గంలో చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌, మెజార్టీ కౌన్సిలర్లు అధికార టీఆర్‌ఎ్‌సకు చెందిన వారే. అయినా చైర్‌పర్సన్‌, వైస్‌చైర్‌పర్సన్‌ పద వుల కోసం రోడ్డెక్కారు. కొన్ని రోజులుగా అధికార పార్టీ కౌన్సిలర్లలో అంతర్గతంగా కొనసాగుతూ వచ్చిన విబేధాలు ఆదివారం రచ్చకెక్కాయి. రెండున్నరేళ్ల పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం కొనసాగుతున్న చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌లు తమ పదవుల నుంచి తప్పుకోవాలంటూ టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు బహిరంగంగా ఆల్టిమేటం జారీ చేయడంతో మునిసిపల్‌ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెకి ్కంది. ఈ విషయమై టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు సోమవారం మరోసారి మీడియాకెక్కారు. కాగా, చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పదవుల కోసం రెండు రోజులుగా వికారాబాద్‌ మునిసిపాలిటీలో కొనసాగుతున్న రచ్చ... పార్టీ అధిష్టానం దృష్టికి చేరింది. ఈ విషయాన్ని సీరియ్‌సగా తీసుకున్న టీఆర్‌ఎస్‌ అధిష్టానం సమస్య పరిష్కరించే బాధ్యతను పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌పై ఉంచినట్లు తెలుస్తోంది. వివాదం మరింత ముదరక ముందే పరిష్కారమార్గం అనే ్వషించాలని సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, వైస్‌ చైర్మన్‌ పదవి తమకు రావడానికి అప్పట్లో సహకరించిన హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీని శంషాద్‌బేగం భర్త, మాజీ జడ్పీటీసీ ముత్తహార్‌ షరీఫ్‌ సోమవారం కలిశారు. ఈ సందర్భంగా తమ పదవికి పొంచి ఉన్న గండం గురించి ఆయనకు వివరించిన ముత్తహార్‌ తమకు పదవీ గండం లేకుండా చూడాలని కోరినట్లు సమాచారం. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం వికారాబాద్‌ మునిసిపల్‌చైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజుల, వైస్‌ చైర్‌పర్సన్‌ శంషాద్‌బేగంలు వెంటనే తమ పదవుల నుంచి తప్పుకోవాలంటూ అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఓ వైపు బహిరంగంగా డిమాండ్‌ చేస్తుండగా, తమ మధ్య పదవులపై కాలపరిమితి ఒప్పందం అంటూ ఏమీ లేదని చైర్‌పర్సన్‌ మంజుల స్పష్టం చేస్తున్నారు. అంతే కాకుండా తాను పదవి నుంచి తప్పుకునేది లేదంటూ ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మునిసిపల్‌ కొత్త పాలక వర్గం కొలువుదీరే సమయంలో చైర్‌పర్సన్‌ పదవికి చిగుళ్లపల్లి మంజుల, లంక పుష్పలతారెడ్డి, వైస్‌ చైర్‌పర్సన్‌ పదవికి శంషాద్‌బేగం, అనంతరెడ్డిలు పోటీపడ్డారు. వీరి మధ్య ఓ అవగాహన ఏర్పడి మొదటి రెండున్నరేళ్ల పదవీ కాలం చైర్‌పర్సన్‌ పదవి మంజుల, వైస్‌ చైర్‌పర్సన్‌ పదవి శంషాద్‌బేగం కొనసాగుతారని, ఆ తరువాత రెండున్నరేళ్లు చైర్‌పర్సన్‌గా లంక పుష్పలతారెడ్డి, వైస్‌ చైర్మన్‌గా అనంతరెడ్డి కొనసాగేలా వారు ఓ అవగాహనకు వచ్చి ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారంలోఉంది. ఈ విషయం అధికార పార్టీ నాయకులకే కాకుండా ప్రతిపక్ష పార్టీల నాయకుల దృష్టిలో కూడా ఉంది. మొదటి రెండున్నరేళ్లు పూర్తి కావస్తుండడంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మంజుల, శంషాద్‌బేగంలు తమ పదవుల నుంచి తప్పుకుని... పోటీలో ఉన్న వారికి అవకాశం కల్పించాలని అధికార పార్టీ కౌన్సిలర్లు డిమాండ్‌ చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ల మధ్య పదవుల కోసం పంచాయతీ నెలకొనడం, బహిరంగంగా సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకునే స్థాయికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.   స్థానికంగా పరిష్కరించుకోలేకపోతే సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారమయ్యేలా ప్రయత్నించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం ఆ పార్టీ అభిమానుల్లో  వ్యక్తమవుతోంది. అయితే ఒకటి, రెండు రోజుల్లో ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2022-06-13T05:30:00+05:30 IST