రూ.50 వేలు కాదట! రూ.5 వేలేనట!!
ABN , First Publish Date - 2021-08-29T04:59:46+05:30 IST
అక్రమ నిర్మాణాల యజమానుల వద్ద వసూలు చేసిన సొమ్మును పంచాయతీ కార్యాలయంలోనే పంచుకోవడంపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేట పంచాయతీ కార్యాలయంలో అవినీతి సొమ్మును సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు సొమ్మును పంచుకుంటుండగా సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. ఓ వార్డు సభ్యుడు ఈ దృశ్యాలను బయటపెట్టడంతో అవినీతి బాగోతం చర్చనీయాంశంగా మారింది.
తన భూమిని అమ్మి వార్డు సభ్యులను ఆదుకున్నానన్న సర్పంచ్
విచారణ అధికారులకు పిట్టకథలు చెప్పిన ప్రజాప్రతినిధి
వీడియోల్లో డబ్బు కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నా బుకాయింపు
పంచాయతీ కార్యాలయంలో పంపకాలపై కిష్టారెడ్డిపేటలో పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విచారణ
పటాన్‌చెరు, ఆగస్టు 28: అక్రమ నిర్మాణాల యజమానుల వద్ద వసూలు చేసిన సొమ్మును పంచాయతీ కార్యాలయంలోనే పంచుకోవడంపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేట పంచాయతీ కార్యాలయంలో అవినీతి సొమ్మును సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు సొమ్మును పంచుకుంటుండగా సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. ఓ వార్డు సభ్యుడు ఈ దృశ్యాలను బయటపెట్టడంతో అవినీతి బాగోతం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ శివారు పంచాయతీల్లో అక్రమాలను ప్రోత్సహిస్తూ పెద్దఎత్తున దండుకుంటున్న వ్యవహారంపై లోతైన విచారణ జరిపించాలని ప్రభుత్వ పెద్దల నుంచి కూడా ఆదేశాలు జారీ అయినట్టు తెలిసింది. నిజాలను నిగ్గుతేల్చడం కోసం పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు శనివారం రంగంలోకి దిగారు. పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రామారావు నేతృత్వంలో జిల్లా పంచాయతీ అధికారి రవిమోహన్, డీఎల్‌పీవో సతీ్‌షరెడ్డి, ఎంపీవో సంతోష్ పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. సీసీటీవీ దృశ్యాలను బయటపెట్టిన రెండోవార్డు సభ్యుడు దొంతి అశోక్ నుంచి వాంగ్మూలం సేకరించారు. అనంతరం సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను విచారించారు. పంచాయతీ రికార్డులను తనిఖీచేసి, నిర్మాణాలకు అనుమతులు, ఇంటిపన్ను పద్దుల వివరాలను పరిశీలించారు. రికార్డులను సీజ్‌చేసి సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి తరలించారు. అనంతరం పలు అక్రమ కట్టడాలను పరిశీలించి, ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు.
విచారణ అధికారికి కట్టుకథలు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా సృష్టించిన కిష్టారెడ్డిపేట పంచాయతీ కార్యాలయంలో పాలకవర్గం పంపకాలపై విచారణ జరుపుతున్న అధికారులు సర్పంచ్ చెప్పిన పిట్టకథలు విని అవాక్కయ్యారు. వార్డు సభ్యులు కష్టాల్లో ఉండటంతో ఆదుకునేందుకు తన సొంత భూమిని అమ్మి పండుగ ఖర్చుల నిమిత్తం రూ. ఐదువేల చొప్పున ఇచ్చానని విచారణలో సర్పంచ్ చెప్పడం విశేషం. వీడియోలో మాత్రం డబ్బు కట్టలు స్పష్టంగా కనిపించాయి. సర్పంచ్, వార్డు సభ్యుల సంభాషణల్లో సైతం ప్రతిఒక్కరికి రూ. 50 వేలు ప్రస్తుతానికి ఇస్తున్నట్టు స్పష్టంగా వినిపిస్తున్నది. వార్డు సభ్యులందరూ కష్టాల్లో ఉండటం.. సర్పంచ్ దయతలచి సొంత భూమి అమ్మి డబ్బు ఇచ్చానని చెప్పడం నమ్మశక్యంగా లేదు. భూమి అమ్మిన వ్యక్తి కేవలం ఐదువేలే ఇచ్చానని చెప్పడం మరీ ఛోద్యంగా ఉన్నది. విచారణకు హాజరైన ఉపసర్పంచ్, వార్డు సభ్యులు సైతం కేవలం రూ. ఐదువేలు మాత్రమే తీసుకున్నామని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడం మరో విశేషం. పాలకమండలి అవినీతిపై ఆరోపణలు చేసిన రెండోవార్డు సభ్యుడు దొంతి అశోక్ మాట్లాడుతూ వీడియోల్లో కట్టకలు కనిపిస్తున్నా.. ఐదువేలు మాత్రమే ఇచ్చానని సర్పంచ్ బుకాయించడం దారుణమన్నారు. ఏ ఉద్దేశ్యంతో సర్పంచ్ వార్డు సభ్యులకు సొంత ఆస్తులు అమ్మి నగదు ఇచ్చారని ప్రశ్నించారు. అవినీతి బాగోతం బయటపడటంతో పాలకమండలి సభ్యులు తేలు కుట్టిన దొంగల్లా ఉలిక్కి పడుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారులు పకడ్బందీగా విచారణ చేపట్టి వాస్తవాలను నిగ్గుతేల్చాలని కోరారు. అనంతరం విచారణ చేపట్టిన పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రామారావు విలేకరులతో మాట్లాడుతూ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డుసభ్యుల స్టేట్‌మెంట్లను రికార్డు చేశామని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు. సీజ్ చేసిన రికార్డులను నిశితంగా పరిశీలించి నివేదికను పంచాయతీరాజ్ కమిషనర్‌కు అందజేస్తామని వెల్లడించారు.