Vismaya case: భర్తకు పదేళ్ల జైలు శిక్ష

ABN , First Publish Date - 2022-05-24T19:32:28+05:30 IST

మెడికల్ విద్యార్థిని విస్మయను పెళ్లి చేసుకున్న కిరణ్ ఆమెను వరకట్నం కోసం తీవ్రంగా వేధించినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఆమె ఆత్మహత్య చేసుకునే విధంగా ఆయన ప్రేరేపించినట్లు తెలిపింది. ఆమె 2021 జూన్‌లో తన అత్తవారింట్లో ఆత్మహత్య..

Vismaya case: భర్తకు పదేళ్ల జైలు శిక్ష

తిరువనంతపురం: ఆత్మహత్య చేసుకునేవిధంగా భార్యను ప్రేరేపించినందుకు భర్తకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు కేరళలోని కొల్లాం అడిషనల్ సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. వరకట్న నిరోధక చట్టం కిందన దోషి ఎస్.కిరణ్‌ కుమార్(31)కు ఈ శిక్ష విధిస్తున్నట్లు జస్టిస్ కేఎన్ సుజిత్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. వాస్తవానికి రెండు వేరు వేరు సెక్షన్ల ప్రకారం.. ఒకటి ఆరేళ్లు, మరొకటి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు కాగా.. మొత్తంగా పదేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. కాగా, విస్మయ(24) ఆత్మహత్య కేసులో కుమార్‌ను దోషిగా సోమవారం కోర్టు నిర్ధారించింది.


మెడికల్ విద్యార్థిని విస్మయను పెళ్లి చేసుకున్న కిరణ్ ఆమెను వరకట్నం కోసం తీవ్రంగా వేధించినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఆమె ఆత్మహత్య చేసుకునే విధంగా ఆయన ప్రేరేపించినట్లు తెలిపింది. ఆమె 2021 జూన్‌లో తన అత్తవారింట్లో ఆత్మహత్య చేసుకున్నారు. కిరణ్ తన భార్యను వరకట్నం కోసం వేధించినట్లు, ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించినట్లు కొల్లం అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి-1 సుజిత్ కేఎన్ సోమవారం తీర్పు చెప్పారు. భారత శిక్షా స్మృతి (IPC), వరకట్న నిషేధ చట్టం (Dowry Prohibition Act) ప్రకారం నేరాలు రుజువైనట్లు తెలిపారు.


విస్మయ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, 100 సవరల బంగారం, ఒక ఎకరా విస్తీర్ణంగల భూమి వరకట్నంగా కిరణ్‌కు ఇచ్చారు. వీటితోపాటు రూ.10 లక్షల విలువైన ఓ కారును కూడా ఇచ్చారు. అయితే ఆ కారును కిరణ్ ఇష్టపడలేదు. దానికి బదులుగా నగదు ఇవ్వాలని కోరాడు. అందుకు విస్మయ కుటుంబీకులు తిరస్కరించారు. దీంతో విస్మయను కిరణ్ నిరంతరం వేధించేవారు. కిరణ్ అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. తాజా తీర్పుతో ఆయనను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విస్మయ తండ్రి మాట్లాడుతూ, తన కుమార్తెకు న్యాయం జరిగిందన్నారు. ప్రాసిక్యూషన్, ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎంతో గొప్పగా కృషి చేసిందని, వారికి కృతజ్ఞతలు చెప్తున్నానని తెలిపారు. కృతజ్ఞతలు వ్యక్తం చేయడానికి మాటలు లేవని ఆయన అన్నారు.

Updated Date - 2022-05-24T19:32:28+05:30 IST