టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గానికి యువసేనాని

ABN , First Publish Date - 2020-09-28T21:10:15+05:30 IST

చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కిమిడి నాగార్జునకు పార్టీ ..

టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గానికి యువసేనాని

కిమిడి నాగార్జునకు విజయనగరం బాధ్యతలు

సమన్వయంతో సాగితే మంచి ఫలితాలొస్తాయంటున్న విశ్లేషకులు


(విజయనగరం- ఆంధ్రజ్యోతి): చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కిమిడి నాగార్జునకు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. విజయ నగరం పార్లమెంటు నియోజకవర్గ పార్టీ అధ్యక్షునిగా నియమించింది. పార్టీకి పూర్వపు జవసత్వాలు కల్పించాలంటే యువరక్తాన్ని ఎక్కించా లన్న ఉద్దేశంతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాగార్జున నియామకంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నాయకులు, శ్రేణులను సమన్వయం చేసుకుంటూ నాగార్జున ముందుకు సాగితే మంచి ఫలితాలొస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఇదే సమయంలో కేవలం 32 సంవత్సరాల యువ నాయకుడు, స్వల్ప అనుభవం ఉన్న నాగార్జునకు ఏకంగా పార్ల మెంట్‌ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంపై పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ నియోజకవర్గ పరిధిలో విజయనగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, బొబ్బిలి, గజపతినగరంతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల, రాజాం అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో చాలా సీనియర్‌ నాయకులు ఉన్నారు. వారిని కాదని యువకుడిని ఎంపిక చేయడంపై కొందరు కినుక వహించారు. ఎక్కువ మంది అధినేత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.


2019లో జరిగిన ఎన్నికల్లో పార్టీకి ఓటమి ఎదురైన తర్వాత టీడీపీ కేడర్‌ కొంత నైరాశ్యంలో ఉంది. దాదాపు ఏడాదిన్నరగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలు స్తబ్దుగా ఉన్నారు. కరోనా వచ్చాక ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఏదైనాగాని పార్టీ పటిష్టానికి కేడర్‌లో కదలిక తేవాల్సి ఉంది. వారికి భరోసాగా నిలవ్వాల్సిన అవసరం ఉంది. సమస్యలపై పోరాటానికైనా.. కష్టమొస్తే ఆసరాగా ఉండాలన్నా యువ నాయకుడు అవసరమని అధినేత తలచారు. దీంతో బాటు కొన్ని నియోజకవర్గాల్లో వర్గపోరును పరిష్కరించాల్సి ఉంది. ఇదిలా ఉండగా జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కీలక నాయకులే ఉన్నారు.


విజయనగరంలో అశోక్‌ కుమార్తె అదితి గజపతిరాజు, నెల్లిమర్లలో మాజీ మంత్రి.. సీనియర్‌ నాయకుడు పతివాడ నారాయణస్వామినాయుడు, బొబ్బిలిలో మాజీ మంత్రి సుజయ్‌కృష్ణరంగారావు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బేబీనాయన, యువనాయకుడు తెంటు లక్ష్మునా యుడు, చీపురుపల్లిలో సీనియర్‌ నాయకుడు కుచ్చర్లపాటి త్రిమూర్తులరాజు వంటి సీనియర్లు ఉన్నారు. అటు శీకాకుళం జిల్లాలోని రాజాం, ఎచ్చెర్లలో మాజీ అసెంబ్లీ స్పీకర్‌ ప్రతిభాభారతి, మాజీ మంత్రి కోండ్రు మురళీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు వంటి అనుభవజ్ఞులు ఉన్నారు. వీరందరినీ కలుపుకొని నాగార్జున ముందుకు వెళ్తారన్న అభిప్రాయాన్ని సీనియర్‌ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. 2024 నాటి ఎన్నికలకు పార్టీలోని అన్ని వర్గాలను ముఖ్యంగా యువతను ఆకర్షించడానికి యువ రక్తం కావాలని ఎప్పటినుంచో కార్యకర్తలు అభిప్రాయ పడు తున్న నేపథ్యంలో చంద్రబాబు నిర్ణయం పార్టీ కేడర్‌కు ఆనందాన్నిచ్చింది.


సమన్వయకర్తగా కేఏ నాయుడు

మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ సీనియర్‌ నాయకుడు కొండపల్లి అప్పలనాయుడు (కేఏ నాయుడు)ను రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాల సమన్వయకర్తగా పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. మచిలీపట్నం, గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. రాజకీయ అనుభవం ఉన్న నేతగా ఆ రెండు నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టానికి కృషి చేయగలరని అధినేత భావించారు. కేఏ నాయుడు తన తండ్రి కొండపల్లి పైడితల్లి నాయుడు నుంచి రాజకీయ వారసత్వం పుచ్చుకున్నారు. పైడితల్లి నాయుడు బొబ్బిలి (విజయనగరం) లోక్‌ సభ సభ్యునిగా 1996 నుంచి 1999వరకు రెండు పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2004 ఎన్నికల్లో బొబ్బిలి ఎంపీగా గెలుపొందారు.


పైడితల్లినాయుడు మరణం తరువాత రెండో కుమారుడు డాక్టర్‌ కేఏ నాయుడు రాజకీయ ఆరంగేట్రం చేశారు. 2014 ఎన్నికల్లో గజపతినగరం నియోజకవర్గానికి టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై పోటీచేసి ఓటమి చెందారు. తాజాగా పార్టీ పదువుల పందేరంలో కేఏ నాయుడుకు గుంటూరు, మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గాలకు పార్టీ సమన్వయ కర్తగా నియమిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.


పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు ఇంజినీర్‌ నుంచి రాజకీయాల్లోకి..

యువ నాయకుడు కిమిడి నాగార్జున ప్రస్తుతం చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. 32 ఏళ్ల నాగార్జున 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున బరిలో నిలిచారు. అంతకుముందు నుంచే నియోజకవర్గంలో పర్యటించేవారు. కార్యకర్తలతో మమేకమై పార్టీ కోసం శ్రమించారు. రాజకీయాల్లోకి రాకముందు యుఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా కొద్దికాలం పనిచేశారు. తండ్రి కిమిడి గణపతిరావు గతంలో ఉణుకూరు శాసన సభ్యునిగా, తల్లి మృణాళిని అప్పట్లో శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. అంతే కాకుండా 2014లో చీపురుపల్లి నుంచి గెలిచిన మృణాళిని చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. నాగార్జునకు ఉన్నత పదవిపై పార్టీ చీపురుపల్లి కార్యాలయంలో మండల అధ్యక్షుడు రౌతు కామునాయుడు, పైల బలరాం నేతృత్వంలో కార్యకర్తలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.


సమన్వయంతో ముందుకెళ్తా

పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ప్రతి కార్యకర్త, నాయకులను సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తాను. అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు, సీనియర్‌ నాయకులు అశోక్‌గజపతిరాజు, ఇతర పెద్దలకు ధన్యవాదాలు.

-నాగార్జున, విజయనగరం


Updated Date - 2020-09-28T21:10:15+05:30 IST