Niloufer వద్ద చిన్నారి కిడ్నాప్‌.. గంట వ్యవధిలో కేసును ఛేదించిన పోలీసులు

ABN , First Publish Date - 2022-03-03T12:11:45+05:30 IST

నిలోఫర్‌ ఆస్పత్రి వద్ద చిన్నారిని ఓ మహిళ కిడ్నాప్‌ చేసింది. వెంటనే రంగంలోకి దిగిన

Niloufer వద్ద చిన్నారి కిడ్నాప్‌.. గంట వ్యవధిలో కేసును ఛేదించిన పోలీసులు

  • తల్లిదండ్రులకు అప్పగింత


హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్‌ : నిలోఫర్‌ ఆస్పత్రి వద్ద చిన్నారిని ఓ మహిళ కిడ్నాప్‌ చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గంట వ్యవధిలో కేసును ఛేదించి చిన్నారిని తల్లి ఒడికి చేర్చారు. నిందితురాలిని అరెస్ట్‌ చేశారు. బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండల కేందానికి చెందిన మాధవి గర్భవతి.  బుధవారం తన చిన్న కూతురు ఇవిక(18నెలలు)ను తీసుకొని సోదరి, బంధువులతో కలిసి నిలోఫర్‌ ఆస్పత్రికి ఉదయం 8గంటల సమయంలో వచ్చింది. ఓపీ చికిత్సల అనంతరం రిపోర్టులు తీసుకునే హడావిడిలో చిన్నారిని ఆమె గమనించలేదు. ఇదే సమయంలో నారాయణపేట జిల్లా మక్తల్‌కు చెందిన శ్రీదేవి (35) ఆస్పత్రి వద్ద తచ్చాడుతోంది. అదే సమయంలో మణికొండ చెందిన రాజు, ఐలమ్మలు తమ బాబును వైద్యులకు చూపించేందుకు నిలోఫర్‌కు వచ్చారు. కల్లుకు బానిసైన శ్రీదేవి ఆ బాబును కిడ్నాప్‌ చేసేందుకు పథకం పన్నింది. ఆమె ప్రవర్తను గమనించిన రాజు నిలదీయడంతో అతడి పక్కనే కొద్దిసేపు కూర్చొంది.


ఈ క్రమంలో రాజు జేబులోని రూ.3 వేలను తస్కరించింది. అక్కడి నుంచి వెళుతుండగా ఇవిక కనిపించడం తో పాపను తీసుకుని ఆస్పత్రి గేటు వద్ద ఆటో ఎక్కింది. మార్గమధ్యలో ఆటో డ్రైవర్‌ డబ్బులు అడగడంతో లేవంది. దీంతో వారిని నైస్‌ఆస్పత్రి వద్ద దింపేసి ఆటో డ్రైవర్‌ తిరిగి నిలోఫర్‌ వద్దకు వచ్చాడు. కొద్దిసేపటి తరువాత మాధవి అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది, శానిటేషన్‌ సూపర్‌వైజర్‌ శ్రీకాంత్‌తో కలిసి పాప కోసం ఆటో డ్రైవర్ల వద్ద ఆరా తీసింది. ఓ మహిళ పాపతో తన ఆటోలో ఎక్కడంతో నైస్‌ ఆస్పత్రి వద్ద వదిలిపెట్టినట్లు ఆటోడ్రైవర్‌ చెప్పాడు. 


దీంతో బాధితులు వెంటనే నాంపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఇన్‌స్పెక్టర్‌ ఖలీల్‌ పాషా కేసు నమోదు చేసుకొని నాలుగు బృందాలను రంగంలోకి దింపారు. హబీబ్‌నగర్‌ పరిధిలోని కోమటికుంట కల్లుకాంపౌండ్లో శ్రీదేవి ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి ఇవికను రక్షించి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విచారించగా పాప ను అమ్మేందుకు తీసుకువెళ్లినట్లు శ్రీదేవి తెలిపిందని పోలీసులు పేర్కొన్నారు. గంట వ్యవధిలోనే  సీసీ టీవి ఫుటేజీల ఆధారంగా నిందితురాలిని పట్టుకొని, పాపను రక్షించిన నాంపల్లి పోలీసులను ఏసీపీ వేణుగోపాల్‌తోపాటు ఉన్నతాధికారులు అభినందించారు.

Updated Date - 2022-03-03T12:11:45+05:30 IST