ఖరీఫ్‌కు సన్నద్ధం

ABN , First Publish Date - 2021-04-13T06:04:26+05:30 IST

రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడానికి వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతున్నది.

ఖరీఫ్‌కు సన్నద్ధం

విత్తనాలు, ఎరువుల సరఫరాకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు

55,500 టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచాలని నిర్ణయం

అత్యధికంగా 30 వేల టన్నుల యూరియా

38,085 క్వింటాళ్ల వరి విత్తనాలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడానికి వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతున్నది. గత ఏడాది సరఫరాలో ఏర్పడిన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, ఈసారి ముందుగానే ప్రతిపాదనలు ఆయా సంస్థలకు పంపింది. ఖరీఫ్‌ సీజన్‌కు అన్ని రకాలు కలిపి 55,500 టన్నుల ఎరువుల సరఫరాకు ప్రతిపాదించారు. గత ఏడాది 47,699 టన్నుల ఎరువులు సరఫరా చేశారు. అయితే ఆగస్టులో యూరియా కొరత ఏర్పడడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. దీంతో ఈ ఏడాది యూరియా కోటా పెంచారు. గత ఖరీఫ్‌లో 28,383 టన్నుల యూరియా సరఫరా చేయగా, ఈసారి 30 వేల టన్నులకు పెంచారు. యూరియా తరువాత ఎక్కువగా వినియోగించే డీఏపీ గత ఏడాది 6,854 టన్నులు సరఫరా చేయగా ఈసారి 8,750 టన్నులు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం జిల్లాలో ఆగ్రోస్‌, రైతుభరోసా కేంద్రాలు, వ్యాపారుల వద్ద వివిధ రకాల ఎరువులు ఎనిమిది వేల టన్నులు ఉన్నాయి. గత ఏడాది రైతుభరోసా కేంద్రాల వద్ద ఎరువుల సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయి. ఈ పర్యాయం సచివాలయాల వద్ద డబ్బులు చెల్లించి రశీదు తీసుకుని రైతుభరోసా కేంద్రానికి వెళ్లి ఎరువులు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఎరువుల సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాల కులు జేఎస్‌ఎన్‌ఎస్‌. లీలావతి పేర్కొన్నారు. యూరియా వాడకాన్ని తగ్గించాలని ప్రభుత్వం, శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాన్ని రైతులకు సూచిస్తున్నామని తెలిపారు. గత ఖరీఫ్‌లో 47,699 టన్నులు, రబీలో 22,818 టన్నులు కలిపి మొత్తం 70,517 టన్నుల ఎరువులు వినియోగించారన్నారు. 39 వేల క్వింటాళ్ల విత్తనాలుజిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 39 వేల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. వీటిలో వరి విత్తనాలు 38,085 క్వింటాళ్లు ఉన్నాయి. ఆర్‌జీఎల్‌ 2537 రకం 20,370 క్వింటాళ్లు, బీపీటీ 5204 రకం 4,140 క్వింటాళ్లు, బీపీటీ 3291 రకం 4,702 క్వింటాళ్లు, ఇంకా మరికొన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచనున్నారు. మిగిలిన సుమారు వెయ్యి క్వింటాళ్లలో మినుము, పెసర, కంది, వేరుశనగ, నువ్వు, రాగి, సామ, కొర్ర తదితర పంటలు ఉన్నాయి. గత ఏడాది కొన్నిచోట్ల విత్తనాల కొరత, మొలకెత్తకపోవడం వంటి సమస్యలు వచ్చాయని, ఈసారి అటువంటివి తలెత్తకుండా చూస్తామని ఏపీ సీడ్స్‌ కార్పొరేషన్‌ జిల్లా మేనేజరు శ్రీనివాసరావు తెలిపారు. ఆయా రకాల విత్తనాలు జిల్లాలోని పలు గోదాముల్లో వున్నాయని, రైతు భరోసా కేంద్రాల నుంచి ఇండెంట్‌ వచ్చిన వెంటనే వాటికి పంపుతామని ఆయన చెప్పారు.

Updated Date - 2021-04-13T06:04:26+05:30 IST