నీరజకే పట్టం.. ఖమ్మం తొలి మహిళా మేయర్‌గా ఎన్నిక

ABN , First Publish Date - 2021-05-08T06:06:07+05:30 IST

నీరజకే పట్టం.. ఖమ్మం తొలి మహిళా మేయర్‌గా ఎన్నిక

నీరజకే పట్టం.. ఖమ్మం తొలి మహిళా మేయర్‌గా ఎన్నిక
బాధ్యతలు స్వీకరించాక మేయర్‌ పునుకొల్లు నీరజ అభివాదం, నీరజతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న ఎన్నికల అధికారి,

మైనారిటీకి డిప్యూటీ మేయర్‌ 

ఫాతిమా జోహారాకు అవకాశం

రెండు పదవులూ మహిళలకే..

ఖమ్మం, మే 7 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఖమ్మం నగర పాలన పగ్గాలు మహిళలకు దక్కాయి. ఖమ్మం మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పీఠాలను మహిళలే అధిరోహించారు. రాజకీయ అనుభవం, సామాజిక సమీకరణలు, నేతలతో ఉన్న సత్సంబంధాలు, వివాద రహితురాలుగా ఉన్న గుర్తింపుతో ఖమ్మం తొలి మహిళా మేయర్‌గా పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్‌గా ఫాతిమా జోహారా ఎన్నికయ్యారు. మేయర్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కావడంతో డిప్యూటీ మేయర్‌ పదవి పురుషులకు కేటాయిస్తారని అందరూ భావించారు. కానీ ఆ అంచనాలకు భిన్నంగా మైనారిటీ వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ఫాతిమా జోహారాకు అవకాశమిచ్చారు. ఫాతిమా భర్త  ముక్తార్‌ షేక్‌ టీఆర్‌ఎస్‌ మైనారిటీ నేతగా పనిచేస్తుండగా.. డిప్యూటీ మేయర్‌ పదవి ఆ వర్గానికి కేటాయించటంతో మైనారిటీల్లో హర్షం వ్యక్తమవుతోంది. 


ఉత్కంఠకు తెర..

కొద్ది రోజులుగా ఉన్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్టాడి చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాగా ఎంపిక చేసిన నీరజ, ఫాతిమా పేర్లను ఖరారు చేసి.. ఆ సీల్డ్‌ కవర్‌ను రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంతిరెడి,్డ టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి ద్వారా ఖమ్మం పంపించారు. దీంతో శుక్రవారం టీఆర్‌ఎస్‌లో గెలుపొందిన కార్పొరేటర్లతో ఒక ప్రైవేట్‌ హోటల్‌లో సమావేశమయ్యాక.. పార్టీ అధిష్ఠానం సీల్డ్‌ కవర్‌ ద్వారా పంపిన జాబితాలోని పేర్లను ప్రకటించారు. అనంతరం ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు గెలుపొందిన కార్పొరేటర్లు ప్రత్యేక బస్సులో మధ్యాహ్నం 3గంటలకు ఖమ్మం కార్పొరేషన్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మధుసూధన్‌రావు, పరిశీలకులు నదీం అహమ్మద్‌ సమక్షంలో సమావేశం నిర్వహించి కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే మేయర్‌, డిప్యూటీ పదవులకు నీరజ, ఫాతిమా పేర్లు టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఏ, బీ ఫారాల ద్వారా పంపింది. ఈ క్రమంలో ఇతర పార్టీల నుంచి నామినేషన్లు రాకపోవడంతో వారి ఎన్నిక లాంఛనమైంది. 


ఎన్నిక జరిగింది ఇలా..

టీఆర్‌ఎస్‌ తప్ప ఇతర పార్టీలనుంచి మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులకు సంబంధించి ఏ, బీ ఫారాలు రాలేదని ఎన్నికల అధికారి ప్రకటించగానే, మేయర్‌గా పునుకొల్లు నీరజను 58వ డివిజన్‌ కార్పొరేటర్‌ దోరేపల్లి శ్వేత ప్రతిపాదించారు. సదరు ప్రతిపాదనను 24వ డివిజన్‌ కార్పొరేటర్‌ కమర్తపు మురళి బలపరిచారు. ఇక డిప్యూటీ మేయర్‌గా ఫాతిమా జోహారా పేరును 22వ డివిజన్‌ కార్పొరేటర్‌ పల్లా రోస్‌లీనా ప్రతిపాదించగా, 40వ డివిజన్‌ కార్పొరేటర్‌ దాదె అమృతమ్మ బలపరిచారు. ఎవరి నుంచి అభ్యంతరాలు రాకవపోవటంతో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించి.. వారిని వారి స్థానాల్లో కూర్చోబెట్టారున ఈ సందర్భంగా మేయర్‌, డిప్యూటీ మేయర్‌ మాట్లాడుతూ తమను ఎన్నుకున కార్పొరేటర్లకు, తమను ఎంపిక చేసిన సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర నాయకులకు కృతజ్ఙతలు తెలిపారు.


అనుభవానికి దక్కిన అవకాశం

ఖమ్మం తొలి మేయర్‌గా ఎన్నికైన పునుకొల్లు  నీరజ తొలుత టీడీపీలో మహిళానేతగా పనిచేశారు. ఖమ్మం మున్సిపాలిటీగా ఉన్నప్పుడు టీడీపీ తరపున కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.  ఆ తరువాత పరిణామాలతో టీఆర్‌ఎస్‌లో చేరి, గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలిచిన ఆమె.. ఈసారి కూడా 26వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రెండోసారి విజయం సాధించారు. డిగ్రీ వరకు చదువుకున్న నీరజకు వివాద రహితురాలిగా పేరుంది. భర్త పునుకొల్లు  రామబ్రహ్మం కూడా గతంలో టీడీపీ నాయకుడిగా పనిచేసి .. ఆ తరువాత టీఆర్‌ఎస్‌లో చేరి... ముఖ్య నాయకుడిగా, ఖమ్మం డీసీసీబీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. నీరజ మేయర్‌గా ఎన్నికయ్యేందుకు రాజకీయ నేపథ్యం, అనుభవం కలిసొచ్చాయి. అలాగే మంత్రి పవ్వాడతో నీరజ కుటుంబానికి ఉన్న సత్సంబంధాలతో పాటు జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కావటంతో మేయర్‌ పీఠంపై కూర్చొనే అదృష్టం ఆమెను వరించింది. మేయర్‌ పదవిని పలువురు మహిళా కార్పొరేటర్లు ఆశించినా.. పలు సమీకరణల నేపథ్యంలో ఆ అవకాశం నీరజకు వచ్చింది. ఇక ఖమ్మంలో మైనారిటీ ఓటు బ్యాంక్‌ను దృష్టిలో ఉంచుకొని డిప్యూటీ మేయర్‌గా ఫాతిమా జోహారాను పార్టీ ఎంపిక చేసింది. ఆమె భర్త ముక్తార్‌ టీఆర్‌ఎస్‌ మైనారిటీ సెల్‌ నగర అధ్యక్షుడిగా పనిచేయటంతో రాజకీయ కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫాతిమాకు డిప్యూటీ మేయర్‌గా అవకాశమిచ్చారు. 

నగర అభివృద్ధికి కృషి చేస్తా : నీరజ

మేయర్‌గా ఖమ్మం నగర అభివృద్ధికి కృషి చేస్తానని మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన పునుకొల్లు నీరజ పేర్కొనార. బాధ్యతలు స్వీకిరించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. మంత్రి పువ్వాడ అజ్యయ్‌కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు సహకారంతో అభివృద్ధికి కృషి  చేస్తానని, నగరాన్ని సందర నగరంగా, తీర్చిదిద్దే ప్రక్రియలో తన వంతు పాత్ర పోషిస్తానని, కార్పోరేటర్లు, అధికారుల సహకారంతో, సమష్టి కృషితో ఖమ్మాన్ని మోడల్‌ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. 

మేయర్‌ బయోడేటా

ఫూర్తిపేరు : పునుకొల్లు నీరజ, భర్తపేరు : పునుకొల్లు రామబ్రహ్మం, డీసీసీబీ డైరెక్టర్‌, పిల్లలు: పృధ్వీ, మౌని, పుట్టిన తేదీ: 29-1-1967

విద్యార్హత: బీఏ, రాజకీయ అనుభవం: 2005లో టీడీపీ తరపున కౌన్సిలర్‌గా ఎన్నిక, 2016, 2021 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి కార్పొరేటర్‌గా రెండు సార్లు ఎన్నిక.

డిప్యూటీ మేయర్‌ గురించి..

పూర్తిపేరు: ఫాతిమా జోహారా, భర్తపేరు: ముక్తార్‌ షేక్‌, సుడా సలహాకమిటీ సభ్యుడు, పిల్లలు: రిజ్వాన్‌, రోహన్‌, పుట్టినతేది: 10-5-1984, విద్యార్హత:  ఎం.కాం

మేయర్‌, డిప్యూటీ మేయర్లకు మంత్రి అజయ్‌ అభినందనలు

ఖమ్మం నూతన మేయర్‌ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్‌ ఫాతిమా జోహారాకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమ క్షంలో నీరజ, ఫాతిమా పేర్లు ఖరారు పట్ల మంత్రి పువ్వాడ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఖమ్మం నగరాభివృద్ధికి తమ వంతు కర్తవ్యం నిర్వహించి, సీఎం అంచనాలకు మించి, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. నూతనంగా ఎన్నికైన మేయర్‌, డిప్యూటీ మేయర్‌తో పాటు, డివిజన్ల నుంచి గెలుపొందిన కార్పొరేటర్లకు మంత్రి అభినందనలు తెలిపారు. 

Updated Date - 2021-05-08T06:06:07+05:30 IST