పాతవారికే.. పందేరం!

ABN , First Publish Date - 2022-08-02T05:16:04+05:30 IST

వారు పంపిణీ చేసే సరుకుల్లో నాణ్యత లేదని ఓ వైపు కేజీబీవీ ప్రిన్సిపాల్స్‌ నివేదికలు ఇచ్చినా వాటిని కనీసం పరిశీలించకుండా పాతవారికే ఈ విద్యాసంవత్సరం కాంట్రాక్టులు కేటాయించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పాతవారికే.. పందేరం!
కస్తూర్బాగాందీ విద్యాలయం

కేజీబీవీల్లో సరుకుల పంపిణీ క్రాంటాక్టు మళ్లీ వారికే..

సరుకుల్లో నాణ్యతలేదని గతంలో ప్రిన్సిపాల్స్‌ నివేదికలు

అయినా పట్టించుకునేవారేరీ?

కాంట్రాక్టులు అప్పగింతలో సమగ్రశిక్షలో కొత్త పోకడ

 


గుంటూరు(విద్య), ఆగస్టు 1: వారు పంపిణీ చేసే సరుకుల్లో నాణ్యత లేదని ఓ వైపు కేజీబీవీ ప్రిన్సిపాల్స్‌ నివేదికలు ఇచ్చినా వాటిని కనీసం పరిశీలించకుండా పాతవారికే ఈ విద్యాసంవత్సరం కాంట్రాక్టులు కేటాయించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేటాయింపుల్లో భారీ మొత్తం చేతులు మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. కొత్తవారిని రానీయకుండా విద్యాశాఖలో ఓ అధికారి కాంట్రాక్టర్‌కు బినామీగా వ్యవహరించడం వల్లే పాతవారికి కాంట్రాక్టు అప్పనంగా కట్టబెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి.


ఉమ్మడి జిల్లా పరిధిలోని పల్నాడు ప్రాంతాల్లో దాదాపు 24 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఉన్నాయి. ఆయా విద్యాలయాలకు కూరగాయలు, గుడ్లు, పాలు, మాంసం ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడానికి గుర్తింపు పొందిన అర్హత ఉన్న కాంట్రాక్టర్ల నుంచి ఏటా టెండర్లు ఆహ్వానిస్తారు. వారిలో ఎవరైతే తక్కువ ధరకు నాణ్యమైన వస్తులు సరఫరా చేస్తారో వారికే కాంట్రాక్టులు జేసీ స్థాయిలో పుడ్‌ కమిటీ అప్పగిస్తుంది. ఒక్కో కేజీబీవీలో రూ.15లక్షల నుంచి రూ.20లక్షలు వరకు ఈ కాంట్రాక్టులు ఉంటాయని సమాచారం. మొత్తం కేజీబీవీల సరుకుల కాంట్రాక్టులు రూ.2.50కోట్లు నుంచి  రూ.3కోట్ల  వరకు ఉంటుందని గతంలో కాంట్రాక్టు ద్వారా సరుకులు ఇచ్చిన వారు చెబుతున్నారు. 


సరుకుల నాణ్యతపై ప్రిన్సిపాల్స్‌ అసంతృప్తి 

జిల్లాలో కేజీబీవీలకు ప్రస్తుతం పంపిణీ చేస్తున్న సరుకుల నాణ్యతపై ప్రిన్సిపాల్స్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. సరుకులు పంపిణీ చేసే కాంట్రాక్టర్ల ఫెర్మామెన్స్‌పై ఏటా వీరు నివేదికలు ఇవ్వాలి. ఈ ఏడాది జూన్‌ నెలలో  ఇందులో ఓ కాంట్రాక్టు సంస్థ పంపిణీ చేసిన పాలు నాసిరకంగా(పూర్‌) ఉన్నాయని ఓ ప్రిన్సిపాల్‌ నివేదిక ఇచ్చారు. మరో ప్రిన్సిపాల్‌ కూరగాయల్లో నాణ్యత యావరేజ్‌ అంటూ నివేదిక ఇవ్వగా మరో ప్రిన్సిపాల్‌ గుడ్లు బాగాలేవని, ఇంకో ప్రిన్సిపాల్‌ మాంసం నాణ్యత లేదంటే లేదంటూ ఫెర్మామెన్స్‌ రిపోర్టులు అందజేశారు. అయినా ఇవేవీ పట్టించుకోకుండా పేద విద్యార్థినుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతూ పాతవారికే కాంట్రాక్టు ఇవ్వడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఈ కాంట్రాక్టులు ముట్టచెప్పడంలో విద్యాశాఖలో కీలకంగా వ్యవహరించే అధికారికి రూ.లక్షల్లో ముడుపులు అందినట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు ఆధికారే తన బినామీలకు ఈ కాంట్రాక్టులు దక్కేలా చూడడానికి ఇలా ప్రత్యేక అనుమతి ఇప్పించినట్లు ప్రచారం సాగుతోంది.


పరిశీలించి చర్యలు తీసుకుంటాం..: జేసీ రాజకుమారి

జిల్లాలో ఏటా టెండర్‌ ద్వారా సరుకుల సరఫరా కాంట్రాక్టులు అప్పగిస్తామని జేసీ రాజకుమారి వెల్లడించారు. కేజీబీవీల్లో ఈ ఏడాది  పాతవారికే ప్రొసీడింగ్స్‌ ద్వారా కాంట్రాక్టులు కేటాయించిన విషయం జేసీ రాజకుమారి వద్ద ఆంధ్రజ్యోతి ప్రస్తావించగా.. ఈ కాంట్రాక్టుల కేటాయింపునకు ఉన్నతాధికారుల ప్రత్యేక ఉత్తర్వులు,  అనుమతి ఏమైౖనా ఉన్నాయా అనే విషయాలు సంబంధిత అధికారుల నుంచి నివేదిక తెప్పించి పరిశీలిస్తామని తెలిపారు. 

Updated Date - 2022-08-02T05:16:04+05:30 IST