బినామీలకు.. బాస్‌!

ABN , First Publish Date - 2022-07-14T04:55:59+05:30 IST

కేజీబీవీలకు పంపిణీ చేసే సరుకుల కాంట్రాక్టు, అద్దె కార్ల పంపిణీ కోసం సమగ్రశిక్ష అభియాన్‌లో ఓ కీలక అధికారి తన బినామీలను రంగంలోకి దింపినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

బినామీలకు.. బాస్‌!
సమగ్రశిక్ష అభియాన్‌ కార్యాలయం

కేజీబీవీలకు సరుకులు పంపిణీ కాంట్రాక్టు కోసం బినామీ అవతారం

అద్దె కార్ల కాంట్రాక్టు కైవసం చేసుకునేందుకు ప్రణాళిక

ఇందుకోసం ఏకంగా షెడ్డు నిర్మాణం

కాంట్రాక్టులపై కన్నేసిన ఓ కీలక అధికారి


గుంటూరు(విద్య), జూలై13: కేజీబీవీలకు పంపిణీ చేసే సరుకుల కాంట్రాక్టు, అద్దె కార్ల పంపిణీ కోసం సమగ్రశిక్ష అభియాన్‌లో ఓ కీలక అధికారి తన బినామీలను రంగంలోకి దింపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొద్దిరోజుల్లో ఖారారు కానున్న కొత్త కాంట్రాక్టు తన బినామీలకు వచ్చేలా పావులు కదుపుతున్నారు. దీనిపై సమగ్రశిక్షలో విస్తృత ప్రచారం సాగుతోంది.  గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో 27 కస్తూర్బాగాంధీ విద్యాలయాలు ఉన్నాయి. ఆయా విద్యాలయాలకు నిత్యావసర వస్తువులు, విద్యార్థినులకు అవసరం అయ్యే కాస్మోటిక్స్‌ పంపిణీ కోసం ఏటా కాంట్రాక్టు సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తారు. ఇందుకోసం సమగ్రశిక్ష అభియాన్‌ ప్రత్యేకంగా రూపొందించిన నియమావళి పాటించాల్సి ఉంటుంది. సరుకులు పంపిణీచేసే కాంట్రాక్టు సంస్థలపై ఎటువంటి ఆరోపణలు ఉండకూడదు. నాణ్యమైన మొదటిరకం సరుకులు పంపిణీ చేసేలా ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉండాలి. ఇవేమీ లేకుండా తమ బినామీగా వ్యవహరించే ఓ మహిళకు ఈ కాంట్రాక్టు అప్పగించాలని కీలక అధికారి పావులు కదుపుతున్నాడు. మొత్తం 27 కేజీబీవీల్లో దాదాపు సగం వాటికి తన బినామీల ద్వారానే సరుకులు పంపిణీ చేయాలనే ఆలోచన చేస్తూ మిగతా కాంట్రాక్టు సంస్థలు టెండర్స్‌లో పాల్గొనకుండా చేయడంతోపాటు వారిని అనర్హుల జాబితాలో చేర్చేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఒక్కో కేజీబీవీకి ఏటా లక్షల్లో సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. మార్కెట్‌లో రెండు, లేదా మూడో రకం వస్తువులు కొనుగోలు  చేసి పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇదిలా ఉంటే గతంలో ఈ అధికారి ఆధ్వర్యంలో పనిచేసే మహిళకు చెందిన బినామీ సంస్థపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఉన్నతాధికారులు ఆ సంస్థకు కాంట్రాక్టు ఇవ్వకుండా మొండిచేయి చూపారు. దీంతో మరో మార్గంలో సదరు మహిళ కాంట్రాక్టు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

కార్ల టెండర్లపై కన్ను షెడ్డునిర్మాణం..

మరోవైపు సమగ్రశిక్ష వివిధ హోదాల్లో పనిచేసే అధికారులకు వాహనాలు కేటాయిస్తారు. ఇంజనీరింగ్‌, ఫీల్డ్‌ సిబ్బంది హోదాల్లో పనిచేసేవారికి కారు సౌకర్యం ఉంది. ఈ కార్ల పంపిణీ ఏటా టెండర్లు ఆహ్వానిస్తారు. బండి కండీషన్‌, ఏ సంవత్సరం కొనుగోలు చేశారు. ధ్రువీకరణ పత్రాలు సరైనవే ఉన్నాయా? యాజమాని ఎవరు తదితర అనేక విషయాలు పరిశీలించిన మీదట కాంట్రాక్టు ఇస్తారు. సమగ్రశిక్షలో పనిచేసే ఓ కీలక అధికారి వద్ద దాదాపు డజను వరకు  వేర్వేరు రిజిస్టర్‌ నంబర్లతో కార్లు ఉన్నాయి. వీటిని కాంట్రాక్టు పద్ధతిలో సమగ్రశిక్షలో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆటోనగర్‌ సమీపంలో ప్రత్యేకంగా ఓ షెడ్డు నిర్మించి అక్కడ ఎస్‌ఎస్‌ఏలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి చేత పనులు చేయిస్తున్నాడు. షెడ్డుకు అవసరమైన సిమెంట్‌, ఇతర మెటీరియల్‌ నాడు నేడు పనులకు పంపిణీ చేసే సంస్థల నుంచి తెప్పిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Updated Date - 2022-07-14T04:55:59+05:30 IST