కేశినేని భవన్‌లో రతన్‌ టాటా ఫొటో

ABN , First Publish Date - 2021-10-19T06:33:19+05:30 IST

కేశినేని భవన్‌లో రతన్‌ టాటా ఫొటో

కేశినేని భవన్‌లో రతన్‌ టాటా ఫొటో
కేశినేని భవన్‌ చుట్టూ చంద్రబాబు ఫ్లెక్సీలు

ఎంపీ కేశినేని పార్టీ మారుతున్నారంటూ ప్రచారం 

 ఖండించిన కేశినేని భవన్‌ వర్గాలు 

విజయవాడ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌(నాని) కార్యాలయమైన కేశినేని భవన్‌లో టాటా గ్రూపు సంస్థల అధినేత రతన్‌ టాటా ఫొటోను ఏర్పాటు చేయడం రాజకీయ దుమారానికి తెరతీసింది. రతన్‌ టాటా ఫొటో ఏర్పాటు చేయడంతో ఎంపీ కేశినేని నాని పార్టీ మారుతున్నారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం సాగుతోంది. కేశినేని భవన్‌లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫొటోలను తొలగించి టాటా గ్రూపు సంస్థల అధినేత రతన్‌ టాటా ఫొటోలను ఏర్పాటు చేయడంతో ఎంపీ కేశినేని బీజేపీలో చేరబోతున్నారని, ఆ పార్టీ పెద్దలను కలిసి చర్చలు జరిపేందుకే ఢిల్లీ వెళ్లారంటూ కొందరు సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. ఎంపీ కేశినేని ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతున్నారంటూ సోషల్‌ మీడియాలో సాగుతున్న ప్రచారానికి బలం చేకూరుతుండటంతో.. దీనిని కేశినేని భవన్‌ వర్గాలు సోమవారం త్రీవంగా ఖండించాయి. రతన్‌ టాటా ట్రస్టుతో కలిసి కేశినేని ట్రస్టు చేస్తున్న సేవలను మరింత విస్తృతం చేస్తున్నారని, ఈ రెండు ట్రస్టుల ఆధ్వర్యంలో క్యాన్సర్‌ రోగులకు ఉచిత వైద్యసేవలందించేందుకు విజయవాడ సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కేశినేని భవన్‌లో ఒక చోట రతన్‌ టాటా, కేశినేని నాని కలిసి ఉన్న ఫొటోను ఏర్పాటు చేశారని, అంతే తప్ప చంద్రబాబు ఫొటోలను తొలగించలేదని, నాలుగు అంతస్థుల కేశినేని భవన్‌ చుట్టూ.. లోపల అన్ని చాంబర్లలోనూ చంద్రబాబు, ఎన్టీఆర్‌ల ఫొటోలు, ఫ్లెక్సీలు అలాగే ఉన్నాయని టీడీపీ మైనారిటీ నాయకుడు ఫతావుల్లా తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీ కేశినేని నానిపై కొందరు కావాలనే పార్టీ మారుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిగిపోయే పడవలోకి ఎవరైనా వెళ్తారా? అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎంపీ కేశినేని నాని పార్లమెంటు కమిటీ సమావేశంలో పాల్గొనేందుకే ఢిల్లీ వెళ్లారని ఆయన చెప్పారు. కేశినేని భవన్‌ చుట్టూ ఉన్న చంద్రబాబు, టీడీపీ నాయకులతో కూడిన ఫ్లెక్సీల బొమ్మలను మీడియాకు విడుదల చేశారు. 



Updated Date - 2021-10-19T06:33:19+05:30 IST