ఆమె తొలి ట్రాన్స్ ఉమెన్ డాక్టర్.. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారంటే..

ABN , First Publish Date - 2022-03-14T17:09:26+05:30 IST

21వ శతాబ్దపు భారతదేశంలో లింగమార్పిడి చేయించుకున్నవారు..

ఆమె తొలి ట్రాన్స్ ఉమెన్ డాక్టర్.. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారంటే..

21వ శతాబ్దపు భారతదేశంలో లింగమార్పిడి చేయించుకున్నవారు ఇప్పటికీ సంప్రదాయవాద దృక్కోణం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. వారికి కుటుంబం నుండి మద్దతు లేకపోవడంతో చాలా దీన స్థితికి చేరుకుంటున్నారు. అయితే దీనికి భిన్నంగా ఇలాంటి వారు సమాజం మద్దతు పొంది, ఇతరుల మాదిరిగా జీవితంలో సమాన అవకాశాలు పొందినట్లయితే ఎలా ఉంటుంది? దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కేరళలోని తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్ విఎస్ ప్రియ. కేరళలోని త్రిసూర్‌కు చెందిన డాక్టర్ ప్రియా సీతారామ్ ఆయుర్వేద ఆసుపత్రిలో కన్సల్టెంట్ ఫిజీషియన్. దాదాపు 30 ఏళ్లపాటు తన గుర్తింపును ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టి 2018లో ఆమె ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రియా.. హార్మోన్ థెరపీ, శస్త్రచికిత్స సహాయంతో తన లింగ మార్పిడి ప్రక్రియను చేయించుకున్నారు.


ఇక్కడ గొప్ప విషయమేమిటంటే.. ఆమె తల్లిదండ్రులే కాదు, సహచరులు, రోగులు కూడా ఆమెకు మద్దతు పలికారు. త్రిస్సూర్‌లో జన్మించిన డాక్టర్ ప్రియ పేరు జిను శశిధరన్. ఈ పేరుతో నిజమైన గుర్తింపు ఆమెకు చాలా కష్టమైంది. ప్రియ మీడియాతో మాట్లాడుతూ.. “చిన్నప్పుడు మనం లోపల ఏం ఫీలవుతామో బయటకు వెళ్లగక్కుతాం.. ఇది జీవితంలో అత్యంత అమాయకమైన కాలం.. ఆడపిల్లలా జీవించాలని ఉందని తల్లిదండ్రులకు చెప్పేదానిని.. కానీ వాళ్లు.. చిన్నతనంలో ఏదో చెబుతోంది.. కాలక్రమేణా మారుతానని అనుకున్నారు. చదువుకునే రోజుల్లో తనతో కలిసి చదువుకునే పిల్లలు తనను వేధించేవారని ప్రియ చెప్పింది. నడవడిక నుంచి ఆడుకునే తీరు వరకు ప్రతిదానికీ వేళాకోళం చేసేవారని తెలిపింది. తాను ఎప్పుడూ అమ్మాయిలతో స్నేహంగా ఉండేదానినని, వారితో ఆడుకోవడం, మాట్లాడటం తనకు సౌకర్యంగా అనిపించేదని తెలిపింది. మగపిల్లలు తనను తాకినప్పుడు, వారికి దూరంగా ఉండమని చెప్పేదానిని, తాను ఒక అమ్మాయినని తనకు మనసులో అనిపించేదని తెలిపింది. ఈ విధంగా బయటి ప్రపంచంతో నిరంతరం పోరాడేదాన్నని తెలిపారు. 




ప్రియా తెలిపిన వివరాల ప్రకారం టీనేజ్ ఆమె జీవితంలో అత్యంత కష్టతరమైన దశగా మారింది. ఈ సమయంలో, శరీరంలో సంభవించే మార్పుల కారణంగా తనను తాను అసహ్యించుకునేది. ఎవరితోనూ ఏమీ చెప్పుకోలేక డైరీలో తన భావాలను రాసుకునేది. ఆ డైరీ తన తల్లిదండ్రుల చేతిలో పడటంతో వారు ఆమెను సైకాలజిస్ట్ వద్దకు తీసుకువెళ్లారు, కానీ ప్రియకు మానసిక అనారోగ్యం లేదని డాక్టర్ తెలిపారు. కొంతకాలం తరువాత ప్రియ త్రిసూర్‌లోని వైద్యరత్నం ఆయుర్వేదిక్ కాలేజ్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద, మెడిసిన్ అండ్ సర్జరీ (BAMS) చేసింది. దీని తర్వాత. డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (MD) కూడా చేసింది. ఈ సమయంలో తన గుర్తింపును బయటకు రానివ్వలేదు. కేవలం చదువుపై దృష్టి కేంద్రీకరించింది. డాక్టర్ ప్రియ 2012లో ప్రాక్టీస్  ప్రారంభించింది. 2014లో సీతారాం ఆయుర్వేదిక్ హాస్పిటల్‌లో చేరిన తర్వాత తన జీవితంలో సంతోషంగా లేడని గ్రహించింది. ఇలా తన జీవితాన్ని ఇలా వృథా చేసుకోకూడదని ప్రియ నిశ్చయించుకుంది. లింగ మార్పు అనే అంశంపై పరిశోధన ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె దాని గురించి తల్లిదండ్రులతో మాట్లాడింది. మొదట్లో వ్యతిరేకించినా ఆ తర్వాత వారు సంతోషంగా అంగీకరించారు. వారి సమ్మతితో లింగమార్పిడి చేయించుకున్నానని తెలిపారు. ఈ విషమయై హాస్పిటల్‌లోని సహోద్యోగులందరితో కూడా మాట్లాడారు. ట్రాన్స్‌జెండర్, జెండర్ ఐడెంటిటీపై వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఆమెకు తన సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు లభించింది. సమాజంలో మంచి మార్పు తీసుకురావాలంటే చిన్నతనం నుంచే జెండర్, సెక్స్ గురించి అవగాహన కల్పించాలని డాక్టర్ ప్రియా అన్నారు.

Updated Date - 2022-03-14T17:09:26+05:30 IST