కరోనా పరీక్షకు ఆస్పత్రిలో కియోస్క్‌

ABN , First Publish Date - 2020-04-08T07:09:43+05:30 IST

రళ ప్రభుత్వం ఎర్నాకుళంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో, దక్షిణ కొరియా స్ఫూర్తితో కరోనా రోగుల నమూనాలను సేకరించేందుకు వినూత్నమైన కియోస్క్‌లను ఆస్పత్రుల వద్ద ఏర్పాటు చేసింది.

కరోనా పరీక్షకు ఆస్పత్రిలో కియోస్క్‌

కేరళ, జార్ఖండ్‌లో కొరియా తరహా కేంద్రం

కొచి, ఏప్రిల్‌ 7: కేరళ ప్రభుత్వం ఎర్నాకుళంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో, దక్షిణ కొరియా స్ఫూర్తితో కరోనా రోగుల నమూనాలను సేకరించేందుకు వినూత్నమైన కియోస్క్‌లను ఆస్పత్రుల వద్ద ఏర్పాటు చేసింది. పాత టెలిఫోన్‌ బూత్‌లా రూపొందించిన ఈ కియోస్క్‌కు ‘కోవిడ్‌ విస్క్‌(వాకిన్‌ శాంపిల్‌ కియోస్క్‌)’ అని పేరు పెట్టింది. చిన్న క్యాబిన్‌ మాదిరిగా ఉండే ఈ కియోస్క్‌లో వైద్య సిబ్బంది మాత్రమే ఉంటారు. ఈ విస్క్‌ అన్ని వైపులా మూసి ఉంటుంది. ఒకవైపున రెండు రంధ్రాలతో కూడిన అద్దం ఉంటుంది. ఆ రంధ్రాలకు వాడి పారేసే రబ్బరు గ్లోవ్స్‌ ఉంటాయి. కరోనా లక్షణాలున్న వారి స్వాబ్‌ శాంపిల్‌ను ఆ గ్లోవ్స్‌ ద్వారా సిబ్బంది తీసుకుంటారు. తద్వారా దీనివల్ల వైరస్‌ సోకిన వ్యక్తి నుంచి వైద్య సిబ్బందికి కరోనా వ్యాపించే అవకాశం ఉందడు. వీటివల్ల ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయవచ్చు. ఒక్కో కియోస్క్‌ తయారీకి కేవలం రూ. 40వేలు మాత్రమే అవుతుందని, భారత్‌లోని వైద్య సిబ్బందికి ఇది పూర్తి రక్షణనిస్తుందని ఇక్కడి వైద్యులు చెబుతున్నారు.  దక్షిణ కొరియాలో వీటిని బాగా ఉపయోగించారు. కొచిలో ఇలాంటి కేంద్రం ఒకటి పనిచేస్తుంది.


జార్ఖండ్‌లోని ఓ ఆస్పత్రి కూడా ఇలాంటి కియోస్క్‌ ఏర్పాటు చేసింది. ఈ కియోస్క్‌లలో గ్లోవ్స్‌, మ్యాగ్నెటిక్‌ డోర్లు, అలా్ట్రవయొలెట్‌ లైట్లు, ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ ఉంటాయి. క్యాబిన్‌ను పూర్తిగా స్టెరిలైజ్‌ చేస్తారు. వీటి వల్ల వైద్య సిబ్బందికి పీపీఈ(పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌) అవసరం కూడా ఉండదు. ప్రస్తుతం కరోనా పరీక్షలు, చికిత్స సమయాల్లో పీపీఈలు తప్పనిసరిగా వాడుతున్నారు. దీంతో ఈ రక్షణ సామగ్రికి చాలా కొరత ఏర్పడింది. వాకిన్‌ కియోస్క్‌ల వల్ల ఈ సమస్య కొంతవరకు తగ్గవచ్చు.

Updated Date - 2020-04-08T07:09:43+05:30 IST