కేంద్రం నిధులు దారిమళ్లింపు!

ABN , First Publish Date - 2022-08-11T06:50:49+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం దారిమళ్లిస్తున్నది.

కేంద్రం నిధులు దారిమళ్లింపు!
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

ఎన్‌హెచ్‌ఆర్‌ఎం కింద గ్రామీణ ఆస్పత్రుల నిర్వహణకు ఏటా నిధులు

వైద్యశాల స్థాయినిబట్టి మంజూరు

రాష్ట్రాలకు కేటాయింపు

ఆస్పత్రుల ఖాతాలకు జమ చేయని వైసీపీ ప్రభుత్వం 

జిల్లాలో గత ఏడాది రూ.1.17 కోట్లు పక్కదారి

ఈ ఏడాది నాలుగు నెలలు అయినా నిధులు ఇవ్వని వైనం

ఆస్పత్రుల నిర్వహణకు వైద్యాధికారుల ఇక్కట్లు


(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం దారిమళ్లిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రి నిర్వహణ కోసం రూ.1.2 కోట్ల వరకు నిధులు విడుదలకాగా, రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆస్పత్రుల నిర్వహణ నిధుల కోసం గత మార్చిలోనే వైద్యాధికారులు ప్రతిపాదనలు పంపారు. నాలుగు నెలలు దాటినా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా వైద్యాధికారులు ఖాతాలకు జమకాలేదు. ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అవసరాలకు మళ్లిస్తుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌ఎం) ద్వారా  ఏటా రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో అందుబాటులో లేని అత్యవసర మందులతోపాటు విద్యుత్‌ పరికరాలు, ఇతర సామగ్రి కొనుగోలు, మరుగుదొడ్ల నిర్వహణ, ఆస్పత్రిలో చిన్నాచితకా మరమ్మతు పనులు, వైద్య శిబిరాలు, సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల నిర్వహణ కోసం ఈ నిధులు వినియోగించాలి. ఆస్పత్రి అభివృద్ధి నిధులు (హెచ్‌డీఎఫ్‌)గా పిలిచే వీటిని కేంద్ర ప్రభుత్వం ఏటా రాష్ట్రాలకు విడుదల చేస్తుంది. ఆయా ప్రభుత్వాలు ఈ నిధులను సంబంధిత ఆస్పత్రుల వైద్యాధికారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయాలి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్‌హెచ్‌ఆర్‌ఎం నిధులను ఆస్పత్రులకు ఇవ్వకుండా దారిమళ్లిస్తున్నది. అనకాపల్లి జిల్ల్లాలో 45 పీహెచ్‌సీలు, ఆరు సీహెచ్‌సీలు, ఒక ఏరియా ఆస్పత్రి (నర్సీపట్నం), ఒక జిల్లా ఆస్పత్రి (అనకాపల్లి) వున్నాయి. వీటికి గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.1.17 కోట్లు విడుదల చేసింది.  కానీ రాష్ట్రం ప్రభుత్వం ఈ నిధులను ఆస్పత్రులకు ఇవ్వకుండా ఇతర పథకాలకు మళ్లించింది.  

ఈ ఏడాదీ అంతేనా!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎన్‌హెచ్‌ఆర్‌ఎం ద్వారా నిధుల కేటాయింపు కోసం గత మార్చి నెలలో ఆస్పత్రుల వైద్యాధికారులు ప్రతిపాదనలు పంపారు. ఒక్కో పీహెచ్‌సీకి రూ.1.8 లక్షల చొప్పున 45 పీహెచ్‌సీలకు రూ.81 లక్షలు, ఆరు సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రికి రూ.4 లక్షల చొప్పున రూ.28 లక్షలు, అనకాపల్లిలోని జిల్లా ఆస్పత్రికి రూ.8 లక్షలు.. వెరసి రూ.1.17 కోట్లు మంజూరు చేయాలని గత మార్చి నెలాఖరునాటికే ఎన్‌హెచ్‌ఆర్‌ఎం అధికారులు ప్రతిపాదనలు పంపారు. వాస్తవానికి ఆస్పత్రి అభివృద్ధి నిధులు ఏప్రిల్‌, మే నెలల్లో ఆయా వైద్యాధికారుల ఖాతాలకు జమ అవుతుంటాయి. ఈ నెలల్లోనే వైరల్‌ ఫీవర్స్‌, అంటువ్యాధులు వ్యాపిస్తుంటాయి. ఆస్పత్రిలో అందుబాటులో లేని మందులను బయట కొనుగోలు చేసి రోగులకు ఇవ్వాలి. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగు నెలలు గడిచిపోయి ఐదో నెలలో ప్రవేశించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఆర్‌ఎం నిధులు ఇవ్వలేదు. ప్రభుత్వం ఈ ఏడాదైనా నిధులు ఇస్తుందా? లేకపోతే గత ఏడాది మాదిరిగా ప్రభుత్వం తన సొంత అవసరాలకు మళ్లిస్తుందా? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. 

కాగా జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ నిధులు ఈ ఏడాది ఇంతవరకు రాకపోవడంపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి హేమంత్‌ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి ప్రస్తావించగా, నిధుల కోసం కలెక్టరు ద్వారా ప్రభుత్వానికి లేక రాశామని, త్వరలోనే మంజూరవుతాయని చెప్పారు. నిధులు విడుదల కాగానే అన్ని ఆస్పత్రుల వైద్యాధికారులు ఖాతాలకు జమ చేస్తామని ఆయన తెలిపారు.


Updated Date - 2022-08-11T06:50:49+05:30 IST