ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా

ABN , First Publish Date - 2022-08-16T05:30:00+05:30 IST

తెలంగాణ వస్తే వికారాబాద్‌ జిల్లా చేస్తామని మాట ఇచ్చి

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా
మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌, సభకు హాజరైన జనం

  • పాలమూరు - రంగారెడ్డి బాకీ ఉన్నా..
  • జిల్లాకు కృష్ణా నీళ్లు తీసుకు వచ్చే బాధ్యత నాదే
  • ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 


తెలంగాణ వస్తే వికారాబాద్‌ జిల్లా చేస్తామని మాట ఇచ్చి నిలబెట్టుకున్నాను. తెలంగాణ రాకపోతే వికారాబాద్‌ జిల్లా అయ్యేదా ? మెడికల్‌ కాలేజీ, డిగ్రీ కాలేజీ వచ్చేదా..?. తెలంగాణ ఉద్యమ సమయంలో జిల్లా కార్యాలయాలు వికారాబాద్‌లో ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఉండేది. ఇప్పుడు అన్ని జిల్లా కార్యాలయాలు ఒకేచోట ఉండేలా నిర్మించిన కలెక్టరేట్‌ భవనం ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. వికారాబాద్‌కు ఓగొప్ప చరిత్ర ఉంది.. అనంతగిరి అడవి, వికారాబాద్‌ కా హవా లాకో మరీజోంకా దవా అన్నట్లు అనంతగిరి కొండల్లో ఉన్న ఔషధ మొక్కల గాలి ఆరోగ్యానికెంతో మంచిది. భూముల ధరలు పడిపోతాయనే అపోహతో రంగారెడ్డి జిల్లాకు చెందిన నాటి సమైక్య వాదులు తెలంగాణ రాకుండా అడ్డు పడ్డారు. కానీ తెలంగాణ వచ్చిన తరువాత ఇక్కడి భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని మాకున్నా.. దానిపై కేసులు వేసి పనులు ఆపింది ఎవరో ప్రజలకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం తెలివి తక్కువతనం వల్ల పాలమూరు - రంగారెడ్డి ఆలస్యమవుతోంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వికారాబాద్‌, పరిగి, తాండూరు, చేవెళ్ల నియోజకవర్గాల్లోని నాలుగు లక్షల ఎకరాలకు కృష్ణా నీటిని అందజేసే బాధ్యత నాదే. - సీఎం కేసీఆర్‌


వికారాబాద్‌, ఆగస్టు16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పాటైతే వికారాబాద్‌ జిల్లా చేస్తానన్న తాను ఇచ్చిన హామీ ప్రకారం వికారాబాద్‌ జిల్లా చేసి మాట నిలబెట్టుకున్నానని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్‌ భవనం, టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యా లయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌ పక్కన ఏర్పాటుచేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడారు. వికారాబాద్‌ ప్రజలు చాలా చైతన్యవంతులని, భవిష్యత్తులో ఉజ్వల భారతదేశం నిర్మాణం దిశగా మనం కంకణబద్దులం కావాలని ఆయన పిలుపు నిచ్చారు.  మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, వికారాబాద్‌ జిల్లా అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. జిల్లా అభివృద్ధికి ఇటీవల భూకేటాయింపులు చేసిన సీఎం కేసీఆర్‌కు జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ మాట్లాడుతూ, కొత్తగా నిర్మించిన కలెక్టరేట్‌, టీఆర్‌ఎస్‌ భవనం ప్రారంభించుకోవడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్‌ జిల్లా ఏర్పాటు చేశారని, జోగులాంబ జోన్‌లో ఉన్న వికారాబాద్‌ జిల్లాను ప్రజల కోరిక మేరకు చార్మినార్‌ జోన్‌లోకి మార్చారని గుర్తు చేశారు. వికారాబాద్‌, పరిగిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశారని చెప్పారు. అనంతగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాలని, అనంతగిరి దేవాలయానికి 50 ఎకరాల స్థలం కేటాయించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. శిథిలావస్థకు చేరిన వికారాబాద్‌ బ్రిడ్జికి బదులుగా కొత్త బ్రిడ్జి మంజూరు చేయాలని కోరారు. వికారాబాద్‌ చుట్టూ రింగ్‌ రోడ్డు మంజూరు చేయాలని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు వేగంగా పూర్తి చేసి జిల్లాకు సాగునీరు అందించాలని సీఎంను కోరారు.


అట్టహాసంగా కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం

వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో 35 ఎకరాల విస్తీర్ణంలో రూ.60.70 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. మంగళవారం ప్రగతి భవన్‌ నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్‌ హెలీకాప్టర్‌లో జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. లాలాగూడ వద్ద ఎకరా స్థలంలో నిర్మించిన జిల్లా టీఆర్‌ఎస్‌ భవన్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం అక్కడ పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం కార్యాలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ను పార్టీ కార్యాలయంలో ఆయన కుర్చీలో కూర్చోబెట్టి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత అక్కడి నుంచి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయమైన కలెక్టరేట్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌ అక్కడ సాయుధ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సమీకృత కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన సర్వమత ప్రార్థనల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాంబర్‌లో కలెక్టర్‌ నిఖిలను కలెక్టర్‌ కుర్చీలో కూర్చోబెట్టి ఆమెను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులకు సీఎం కేసీఆర్‌ కండువాలు కప్పి సన్మానించారు. అనంతరం జిల్లా కొత్తగా మంజూరైన మెడికల్‌ కళాశాల భవన నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో సీఎం వెంట మంత్రులు సబితాఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, సురభి వాణీదేవి, కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి, దయానంద్‌, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, కాలె యాదయ్య, కొప్పుల మహే్‌షరెడ్డి, పైలెట్‌ రోహిత్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, ఎ.జీవన్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతారెడ్డి, యువనేత పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు ఉప్పల శ్రీనివాస్‌, సాయిచంద్‌, బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద్‌ పటేల్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ విజయకుమార్‌ ఉన్నారు. సీఎం పర్యటనలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, సీఎంవో కార్యదర్శి స్మితాసభర్వాల్‌, కలెక్టర్‌ నిఖిల, ఐజీ కమలాసన్‌రెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి, ఈఎన్‌సీ గణపతిరెడ్డి, నిర్మాణసలహాదారు సుద్దాల సుధాకర్‌రెడ్డి, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు మనోహర్‌రెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. 


సీఎం సభ విజయవంతం 

 జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ విజయవంతమైంది. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, జిల్లా టీఆర్‌ఎస్‌ భవన్‌ ప్రారంభోత్సవం, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల భవన నిర్మాణం పనులకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభకు వికారాబాద్‌ నియోజకవర్గంతో పాటు పరిగి, తాండూరు, కొడంగల్‌, చేవెళ్ల (నవాబ్‌పేట మండలం) నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. సీఎం పర్యటన ఖరారైనప్పటి నుంచి మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించి కార్యక్రమం విజయవంతమయ్యేలా ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూ వచ్చారు. సభ కు జన సమీకరణ చేయడంలో ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, కొప్పుల మహేష్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, పైలెట్‌ రోహిత్‌రెడ్డి, కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి సఫలీకృతులయ్యారు. ఉదయం 11 గంటల నుంచే సభ జరిగే స్థలానికి నియోజకవర్గాల నుంచి ప్రజలు, పార్టీ శ్రేణులు చేరుకోవడం ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉండగా, సాయంత్రం 5 గంటలకు వేదిక పైకి చేరుకున్నారు. బహిరంగ సభ ప్రారంభం కావాల్సిన సమయం కంటే గంట ఆలస్యంగా ప్రారంభమైనా ప్రజలు వేచి ఉన్నారు. సీఎం వచ్చే సమయానికి  సభలో వేసిన కుర్చీలన్నీ నిండిపోవడంతో ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఎన్‌టీఆర్‌ చౌరస్తా నుంచి ఎన్నేపల్లిలో సభ జరిగే స్థలం వరకు రోడ్లు వాహనాలతో నిండిపోయాయి. ట్రాఫిక్‌ క్లియరెన్స్‌ చేయడానికి పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సీఎం సభ ముగిసిన తరువాత వాహనాలు సాఫీగా సాగేందుకు రెండు గంటల సమయం పట్టింది. ఇదిలా ఉంటే, సీఎం ప్రసంగం చప్పగా కొనసాగుతున్న సమయంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఎవరూ చప్పట్లు కొట్టడం లేదు, ఏమమ్మా మీకు రైతు బీమా అందట్లేదా, అందితే చప్పట్లు కొట్టండని అనడంతో సభా వేదిక చప్పట్లతో మార్మోగింది. సాయంత్ర 5.04 గంటలకు ప్రారంభమైన సీఎం ప్రసంగం 5.34 గంటల వరకు కొనసాగింది. కాగా సీఎం కేసీఆర్‌ రాకతో జిల్లా కేంద్రం వికారాబాద్‌ పట్టణమంతా గులాబీమయంగా మారింది. ప్రఽధాన కూడళ్లలో పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు, కటౌట్లు పోటాపోటీగా ఏర్పాటు చేశారు. ఎన్‌టీఆర్‌ చౌరస్తా నుంచి ఎన్నెపల్లి మీదుగా  సభావేదిక వరకు, ఎన్టీఆర్‌చౌరస్తా నుంచి ఎమ్మెల్యే నివాసం వరకు ఎటుచూసినా గులాబీ ఫ్లెక్సీలు, కటౌట్లతో నింపేశారు.




Updated Date - 2022-08-16T05:30:00+05:30 IST