నిస్తేజం నుంచి ఉత్తేజం వైపు కావలి టీడీపీ

ABN , First Publish Date - 2021-10-12T05:21:53+05:30 IST

కావలి టీడీపీకి పెద్ద దిక్కు లేక కేడర్‌ ఎవరికి వారుగా నిస్తేజంలో ఉండేవారు. అయితే పార్టీ సంస్థాగత ఎన్నికలతో వారు ఉత్తేజం వైపు అడుగులు వేస్తున్నారు.

నిస్తేజం నుంచి ఉత్తేజం వైపు కావలి టీడీపీ

కేడర్‌కు పార్టీ పదవుల అప్పగింత

సంస్థాగత ఎన్నికలతో పటిష్టమవుతున్న ‘దేశం‘


కావలి, అక్టోబరు11: కావలి టీడీపీకి పెద్ద దిక్కు లేక కేడర్‌ ఎవరికి వారుగా నిస్తేజంలో ఉండేవారు. అయితే పార్టీ సంస్థాగత ఎన్నికలతో వారు ఉత్తేజం వైపు అడుగులు వేస్తున్నారు. కావలి టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వైసీపీలోకి  వెళ్లారు. ఇక అప్పటి నుంచి టీడీపీని నడిపించి, ఆర్థికంగా  ఆదుకోగలిగిన నా యకుడు లేక పార్టీ క్యాడర్‌ అంతా చెల్లాచెదురయ్యారు.  పార్టీలో గ్రూపులు ఉండటంతో  మరింత విభేదాలు పొడచూపాయి. అయితే కావలి నియోజకవర్గానికి  నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ను ఇన్‌చార్జిగా నియమించటంతో ఆయన నేతృత్వంలో పార్టీ  కార్యకలా పాలు సాగుతున్నాయి. రెండు, మూడు గ్రూపులుగా ఉన్న నేతలంతా ఒక తాటిపైకి వస్తుండటంతో పార్టీలో నూతనోత్తజం కనిపిస్తోంది. పార్టీలో వివిధ స్థాయిలలో ఉన్న నాయకులలో ఒకరు మినహా అందరికీ  పార్టీ పదవులు అప్పగించటంతో వారిలో ఉత్సాహం పెరిగింది. 

రెండేళ్లుగా కావలి పట్టణానికి కమిటీ లేకపోవటంతో పార్టీ దిక్కులేనిదిగా ఉండిపోయింది. పట్టణ అధ్యక్ష పదవికోసం పలువురు ప్రయత్నాలు చేపట్టడంతో ఇబ్బందులు లేకుండా చేసేందుకు పట్టణ కమిటీ ఏర్పాటుకు ముందే అధ్యక్షపదవిని కోరుకునేవారికి జిల్లా, రాష్ట్ర కమిటీలలో బాధ్యతలు అప్పగించారు. దీంతో పట్టణ కమిటీకి ఉన్న పోటీని తగ్గించి అందరికీ ఆమోద యోగ్యుడైన నేతను నియమించేందుకు అనువుగా అఽధిష్ఠానం పావులు కదుపుతోంది. ప్రస్తుతం పార్టీ పట్టణ  అడ్‌హాక్‌ కమిటీ కన్వీనర్‌గా గుత్తికొండ కిషోర్‌ను నియమించారు. పరిశీలకులుగా చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, సురేంద్రబాబులను నియమించారు. నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులుగా గ్రంధి యానాదిశెట్టిని, మాలేపాటి సుబ్బానాయుడిని, కోడూరు వెంకటేశ్వర్లురెడ్డిని నియమించారు. వారి ఆధ్వర్యంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. కావలిలో ఆరు వార్డులకు  సమావేశం ఏర్పాటు చేసి, కమిటీల నియామకం చేపట్టారు. ఇలా పట్టణంలోని అన్ని వార్డులకు వార్డు కమిటీలు, మండలాల్లోని అన్ని గ్రామాలకు గ్రామ కమిటీల నియామకం పూర్తి చేసిన తర్వాత మండల. పట్టణ కమిటీల నియామకం చేపట్టనున్నారు. ఇవన్నీ పూర్తి అయ్యాక కావలికి సమర్ధవంతమైన నియోజకవర్గ ఇన్‌చార్జిని కూడా నియమిస్తామని పార్టీ అధిష్ఠానం చెబుతోంది. ప్రస్తుతం ఉత్సాహవంతులైన నేతలకు పార్టీ బాధ్యతలు అప్పగించి సంస్థాగత ఎన్నికల ద్వారా పార్టీని కింది స్థాయి నుంచి పటిష్టం చేసేందుకు సిద్ధమవుతుండటంతో కావలి టీడీపీ కస్టాలలో నుంచి గట్టెక్కనుంది.  

Updated Date - 2021-10-12T05:21:53+05:30 IST