ముగ్గురు మంత్రుల సుడిగాలి పర్యటన

ABN , First Publish Date - 2021-07-25T02:50:23+05:30 IST

కావలి నియోజకవర్గంలో శనివారం ముగ్గురు మంత్రులు సుడిగాలి పర్యటన చేశారు.

ముగ్గురు మంత్రుల సుడిగాలి పర్యటన
దూదేకులపాలెంలో ఉపాధి పనులు పరిశీలిస్తున్న మంత్రులు

హడావుడిగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

తుమ్మల పెంటలో బహిరంగ సభ రద్దు

కావలి, జూలై 24: కావలి నియోజకవర్గంలో శనివారం ముగ్గురు మంత్రులు సుడిగాలి పర్యటన చేశారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జలవనరులశాఖ మంత్రి పీ.అనిల్‌కుమార్‌ యాదవ్‌, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమిరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాను హడావుడిగా కొనసాగించారు. దండాలు పెట్టుకుంటూ, చేతులు ఊపుతూ పోయారే తప్ప ఎక్కడా ప్రజలతో మాట్లాడలేదు. తుమ్మలపెంటలో బహిరంగసభ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేపట్టినా కరోనా భయంతో అర్ధాంతరంగా సభను రద్దు చేయించారు. తొలుత నల్గురు మంత్రులు పర్యటన ఉండగా విద్యుత్‌, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి పర్యటన రద్దు అయింది. ముగ్గురు మంత్రులు ఉదయం 9 గంటలకు కావలి పట్టణం ముసునూరులోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ర్యాలీగా పట్టణంలోని ఎమ్పీడీవో కార్యాలయం వెనుక రూ.86 లక్షలతో నిర్మించిన డాక్టర్‌ వైఎస్సార్‌ అగ్రి టెస్ట్‌ ల్యాబ్‌ భవనం వద్దకు చేరుకుని దానిని ప్రారంభించారు. అనంతరం రూరల్‌ మండలంలోని ఆముదాలదిన్నెలో రూ.15 లక్షలతో నిర్మించిన డ్రైనేజీ కాలువలను ప్రారంభించారు. అక్కడే జగనన్న పచ్చతోరణంలో భాగంగా మొక్కలు నాటారు. దూదేకులపాలెంలో ఉపాధి పనులు పరిశీలించారు. తాళ్లపాలెంలో సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి మంత్రులు పెద్దిరెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌లు బుచ్చిరెడ్డిపాలెం వెళ్లగా మంత్రి మేకపాటి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీద మాస్తాన్‌రావులు కార్యక్రమాలను కొనసాగించారు. తుమ్ములపెంటలో పీఎంజీఎస్‌వై పథకం కిందరూ.10 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డుకు, రూ.64.42 కోట్లతో నిర్మిస్తున్న జలజీవన్‌ తాగునీటి పథకానికి శంకుస్థాపన శిలాఫలకాన్ని మంత్రి మేకపాటి ఆవిష్కరించారు. మధ్యాహ్న భోజనం అనంతరం బట్లదిన్నెలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం దగదర్తి మండలంలో రూ.28 కోట్లతో చేపట్టే దగదర్తి-రాచర్లపాడు సప్లై చానల్‌ పనులను మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, మంత్రి మేకపాటి  గౌతమ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. చెన్నూరులో రూ.22 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబు, జేసీ గణేష్‌కుమార్‌, వ్యవసాయశాఖ జేడీ శివన్నారాయణ, డీడీ శివప్రసాద్‌, డీపీవో ధనలక్ష్మి, డ్వామా పీడీ తిరుపతయ్య, కావలి ఆర్డీవో శీనానాయక్‌, విజయా డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, కావలి ఏఎంసీ చైర్మన్‌ మన్నెమాల సుకుమార్‌రెడ్డి, స్థానిక అధికారులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటునివ్వండి

కావలి నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పాటునందించాలని శనివారం కావలికి వచ్చిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, మేకపాటి గౌతంరెడ్డిలను ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు కోరారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో అభివృద్ధి పనులపై చర్చించారు. పంచాయతీరాజ్‌  శాఖ పరిధిలో చేపట్టాల్సిన పనులను ఆశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తెచ్చారు. నీటిపారుదల శాఖ పనులపై ఆశాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌తో చర్చించారు. పారిశ్రామికాభివృద్ధికి అవసమైన వనరులు కావలిలో ఉన్నాయని ఆశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి దృష్టికి తెచ్చారు. అందరి సహకారంతో త్వరలో కావలి నియోజకవర్గానికి మహర్దశ పట్టనుందని మంత్రులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆఫ్కాబ్‌ చైర్మన్‌ అనిల్‌, విజయా డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ మన్నెమాల సుకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

వచ్చారు .. వెళ్లారు..!

కావలి రూరల్‌ మండలంలోని ఆముదాలదిన్నె, తాళ్లపాళెం, తుమ్మలపెంట పంచాయతీలల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం జరిగిన ముగ్గురు మంత్రుల పర్యటన అలా వచ్చారు.. ఇలా వెళ్లారు అన్న చందంగా సాగింది.  పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొనేందుకు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్‌, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిలు వారి పర్యటనలో ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క హామీ ఇవ్వకుండా హడావుడిగా పర్యటన ముగించుకుని వెళ్లడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు. దూదేకులపాళెంలో ఉపాధి కూలీలతో ముఖాముఖి అనగానే కూలీలు తమ సమస్యలు చెప్పుకోవచ్చు అని ఆశతో ఉండగా మంత్రులు చెరువుకట్ట మీద నుంచి జరుగుతున్న పనులు చూసి కూలీలతో మాట్లాడకుండానే  వెళ్లడంతో వారిలో అసంతృప్తి నెలకొంది. 

దివ్యాంగులను ఆదుకోవాలి

కావలి నియోజకవర్గంలోని దివ్యాంగులను ఆదుకోవాలని కావలి నియోజకవర్గ దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు పోసిన వెంకట్రావ్‌ గౌడ్‌ శనివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశాడు. ముసునూరు జగనన్న కాలనీలో అర్హులైన 100 మంది దివ్యాంగులతో మోడల్‌ కాలనీ ఏర్పాటు చెయ్యాలని కోరారు. అలాగే  కావలిలో మెగా క్యాంపు ఏర్పాటు చేసి దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, బ్యాటరీ బండ్లు, వీల్‌ చైర్ల వంటివి అందజేసి ఆదుకోవాలని కోరారు.

Updated Date - 2021-07-25T02:50:23+05:30 IST