వంతెన నిర్మాణ పనులను పరిశీలిసున్న ఎమ్మెల్యే తదితరులు
కావలి, మే28: కావలి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే తన లక్ష్యమని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కావలి ట్రంకురోడ్డు విస్తరణలో భాగంగా ముసునూరు వద్ద జరుగుతున్న బాక్స్‌టైప్ బ్రిడ్జి నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కావలి ట్రంకు రోడ్డు విస్తరణ, రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం, దగదర్తి విమానశ్రయం ఏర్పాటు తదితరు పనులు పూర్తయితే కావలి నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. ట్రంకురోడ్డు విస్తరణ పనులు ముసు నూరు బైపాస్ నుంచి మద్దూరుపాడు బైపాస్ వరకు సుమారు 8 కి.మీ మేరకు చేపడుతున్నామన్నారు. తొలి విడతగా కావలి ఆర్టీసీ బస్టాండ్ నుంచి ముసునూరు బైపాస్ వరకు పనులు చేపట్టామన్నారు. రెండో విడతగా జండాచెట్టు నుంచి మద్దూరుపాడు బైపాస్ వరకు పనులు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్‌రెడ్డి, వైసీపీ నేతలు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, కనమర్లపూడి వెంకటనారాయణ, వడ్లమూడి వెంకటేశ్వర్లు, కుందుర్తి సోదరులు తదితరులు పాల్గొన్నారు.