కాసుల ఆసుపత్రి

ABN , First Publish Date - 2022-10-08T04:28:58+05:30 IST

కోసిగి ప్రభుత్వ ఆసుపత్రి కాసుల ఆసుపత్రిగా మారింది. కాన్పు నుంచి బర్త్‌ సర్టిఫికెట్‌ మంజూరు వరకు రూ.3 వేలు సమర్పించుకోవాల్సిందే.

కాసుల ఆసుపత్రి
కోసిగి ప్రభుత్వ ఆసుపత్రి

  1. కాన్పు చేసి రూ.వెయ్యి అడుగుతున్న స్టాఫ్‌ నర్సులు 
  2. ఆశా వర్కర్లు, ఆయాలకూ సమర్పించుకోవాల్సిందే
  3. వసూళ్లపై స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు 


కోసిగి, అక్టోబరు 7: కోసిగి ప్రభుత్వ ఆసుపత్రి కాసుల ఆసుపత్రిగా మారింది. కాన్పు నుంచి బర్త్‌ సర్టిఫికెట్‌ మంజూరు వరకు రూ.3 వేలు సమర్పించుకోవాల్సిందే. కోసిగి ఆసుపత్రిలోని డబ్బుల వసూళ్లపై మండల పరిధిలోని చింతకుంటకు చెందిన మలిగ పరశురాం అనే బాధితుడు స్పందనలో కలెక్టర్‌ ఫిర్యాదు చేశాడు. ఈ నెల 2వ తేదీ చింతకుంట గ్రామానికి చెందిన మలిగ సుజాతకు పురిటి నొప్పులు రావడంతో కాన్పు కోసం రాత్రి 9 గంటల సమయంలో ఆసుపత్రికి వచ్చింది. 12 గంటలకు కాన్పు అయిన తర్వాత స్టాఫ్‌ నర్సు బాలింత బంధువుల దగ్గరకు వచ్చి కాన్పు చేసినందుకు తనకు రూ.వెయ్యి ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. అలాగే పక్కనే ఉన్న ఆయా తనకు రూ.300 ఇవ్వాలని, ఆసుపత్రికి తీసుకొచ్చిన ఆశా వర్కర్‌కు రూ.500 ఇవ్వాలని పట్టుబట్టి వసూలు చేశారు. ఈ ఘటనపై సుజాత భర్త పరశురాం స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. స్పందనలో ఫిర్యాదు చేసినందుకు వైద్య సిబ్బంది తనకు ఫోన చేసి బెదిరిస్తున్నారని బాధితుడు తెలిపాడు. ఇదిలా ఉండగా మండల పరిధిలోని ఆర్లబండ గ్రామానికి చెందిన తలారి ఈరన్న తన కుమార్తె శ్రీకళను రెండో కాన్పుకు కోసిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కాన్పు అయిన వెంటనే స్టాఫ్‌ నర్సు రూ.వెయ్యి, ఆశా వర్కర్‌ రూ.800, ఆయాలు రూ.300 వసూలు చేశారని, ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా డబ్బులు వసూలు చేయడమేమిటని ఈరన్న ఆవేదన వ్యక్తం చేశాడు. ఆసుపత్రిలో కాన్పులు చేసే స్టాఫ్‌ నర్సులు ఇద్దరు పదేళ్లుగా ఇక్కడే తిష్ట వేశారని, ఆసుపత్రిలో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైందని తోటి ఉద్యోగులే బహిరంగంగా విమర్శిస్తున్నారు. కాన్పుకు డబ్బులు వసూలుపై మెడికల్‌ ఆఫీసర్‌ డా.మనోజ్‌కుమార్‌ను వివరణ కోరగా స్టాఫ్‌ నర్సులపై జిల్లా డీఎంహెచవోకు ఫిర్యాదు చేస్తామని, వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని  తెలిపారు.

    

Updated Date - 2022-10-08T04:28:58+05:30 IST