కాశీబుగ్గ బస్టాండ్‌.. అష్ట దిగ్బంధం

ABN , First Publish Date - 2022-08-02T05:32:30+05:30 IST

నిత్యం వందలాది వాహనాలు, వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే కాశీబుగ్గ బస్టాండ్‌లో కనీస నిబంధనలు అమలుకాకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.

కాశీబుగ్గ బస్టాండ్‌.. అష్ట దిగ్బంధం
కాశీబుగ్గ బస్టాండ్‌ ప్రాంగణంలో ద్విచక్ర వాహనాల పార్కింగ్‌

ప్రాంగణమంతా ఫుట్‌పాత్‌ వ్యాపారులు
ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్‌
పశువుల స్వైరవిహారం
బస్సులు తప్పుకునేందుకు వీలులేని వైనం
ప్రయాణికులకు తప్పని అసౌకర్యం
(పలాస)

నిత్యం వందలాది వాహనాలు, వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే కాశీబుగ్గ బస్టాండ్‌లో కనీస నిబంధనలు అమలుకాకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. పలాస-కాశీబుగ్గ మునిసిపాల్టీ తొలి పాలకవర్గం.. అప్పటివరకూ అస్తవ్యస్తంగా ఉన్న బస్టాండ్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇరుకు సందుల్లో ఉండే బస్టాండ్‌ను ఆధునీకరించి సువిశాల ప్రాంగణంలో రూపొందించింది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా మునిసిపాల్టీ ఆధ్వర్యంలో కాంప్లెక్స్‌ నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. కానీ ఇటీవల బస్టాండ్‌ స్వరూపమే మారిపోయింది. ఒకవైపు ఫుట్‌పాత్‌ దుకాణాలు, తోపుడు బండ్లు, తాత్కాలిక షాపులు ఏర్పాటుచేస్తున్నారు. మరోవైపు ద్విచక్ర వాహనాలను ఇష్టారాజ్యంగా పార్కింగ్‌ చేస్తున్నారు. మరోవైపు కూరగాయలు, నిత్యావసరాల విక్రయాలు చేపడుతున్నారు. దీంతో బస్సులు తప్పించుకునేందుకు కూడా వీలుండదు. రోజుకు సగటును 300కుపైగా బస్సులు బస్టాండ్‌ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. కనీసం బస్సులు తప్పుకునేందుకు వీలులేని విధంగా ఇక్కడ ఫుట్‌పాత్‌ వ్యాపారాలు పెరుగుతున్నాయి. మరోవైపు వివిధ అవసరాలకు జంట పట్టణాలకు వచ్చిన వారు బస్టాండ్‌ ప్రాంగణంలోనే వాహనాలను పార్కింగ్‌ చేసి వెళుతున్నారు. ఆటోలు కూడా ఇష్టారాజ్యంగా నిలిపివేస్తున్నారు. దీనికితోడు పశువులు బస్టాండ్‌ లోపలికి ప్రవేశించి అపరిశుభ్ర వాతావరణానికి గురిచేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. చివరకు బస్టాండ్‌ లోపల సైతం ఫుట్‌పాత్‌ దుకాణాలు వెలుస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.



Updated Date - 2022-08-02T05:32:30+05:30 IST