భక్తి శ్రద్ధలతో కార్తీక పూజలు

ABN , First Publish Date - 2021-11-20T05:05:42+05:30 IST

ఆధ్యాత్మిక పారవశ్యం మధ్య కార్తీక పౌర్ణమి పూజలు జిల్లాలో శుక్రవారం ఘనంగా జరిగాయి. భక్తులు శివకేశవాలయాల్లో అభిషేక అర్చనల్లో పాల్గొన్నారు. దీపదానాలు, తులసి కోటల వద్ద, ఆలయాల్లో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.

భక్తి శ్రద్ధలతో కార్తీక పూజలు
అయ్యప్ప ఆలయంలో దీపాలు వెలిగిస్తున్న విద్యార్థినులు

 - ఆలయాలకు పోటెత్తిన భక్తులు

- వ్రతాలు, పూజలు, దీపారాధనతో ఆధ్యాత్మిక వాతావరణం

కరీంనగర్‌ కల్చరల్‌, నవంబరు 19: ఆధ్యాత్మిక పారవశ్యం మధ్య కార్తీక పౌర్ణమి పూజలు జిల్లాలో శుక్రవారం ఘనంగా జరిగాయి. భక్తులు శివకేశవాలయాల్లో అభిషేక అర్చనల్లో పాల్గొన్నారు. దీపదానాలు, తులసి కోటల వద్ద, ఆలయాల్లో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కేదారీశ్వర, సత్యనారాయణస్వామి వ్రతాలను ఆచరించారు. కొందరు పొరుగు జిల్లాల్లోని నదుల్లో పుణ్య స్నానాలాచరించారు. కార్తీక పురాణ శ్రవణం చేశారు. రాత్రి పొద్దుపోయే వరకు జ్వాలాతోరణ, ఆకాశదీపపూజలు, దీపాలవెలుగుల మధ్య ఆలయాలు కళకళలాడాయి. భక్తులతో ఆలయాలు పోటెత్తగా అధికారులు, నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. రాంనగర్‌ రమాసత్యనారాయణస్వామి ఆలయంలో మూడు విడతలుగా వ్రతాలు జరుగగా డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణిహరిశంకర్‌లు పట్టువస్త్రాలను సమర్పించి వ్రతంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదానం జరిగింది. చైతన్యపురి మహాశక్తి దేవాలయంలో అర్చకులతో పాటు గర్రెపెల్లి మహేశ్వరశర్మ సామూహిక వ్రతాలను నిర్వహింపజేశారు. రాత్రి వివిధ ఆకృతుల్లో మహిళలు దీపాలను వెలిగించారు. భగత్‌నగర్‌ అయ్యప్ప ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు అయ్యప్ప దీక్షలను స్వీకరించారు. రాత్రి దీపాలను వెలిగించారు. అదనపు కలెక్టర్‌ జీవి శ్యాంప్రసాద్‌లాల్‌,  జడ్పీ డిప్యూటీ సీఈఓ పవన్‌కుమార్‌, ఈఓ కొస్న కాంతారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అశోక్‌నగర్‌ వాసవీకన్యకాపరమేశ్వరి ఆలయం, యజ్ఞవరాహక్షేత్రం, సాయినగర్‌ శ్రీవిజయగణపతి సాయిబాబా దేవాలయం, కమాన్‌రోడ్‌ వీరబ్రహ్మేం ద్రస్వామి ఆలయంలో వ్రతాలు నిర్వహించారు. పాతబజార్‌ శివాలయం, కమాన్‌రోడ్‌ రామేశ్వరాలయం, భగత్‌నగర్‌ భవానీశంకరాలయంతో పాటు రాంనగర్‌, విద్యానగర్‌, కట్టరాంపూర్‌, మార్కెట్‌రోడ్‌ వేంకటేశ్వరాలయాల్లో, సప్తగిరికాలనీ, వావిలాలపల్లి రామాలయాల్లో భాగ్యనగర్‌ సాయి ఆలయంలో భక్తులు అభిషేక అర్చనలు, వ్రతాల్లో పాల్గొన్నారు. నగరంలోని అన్ని ఆలయాల్లో భక్తుల సందడి కనిపించింది.

Updated Date - 2021-11-20T05:05:42+05:30 IST