శివోహం.. శివోహం!

ABN , First Publish Date - 2020-11-30T05:42:08+05:30 IST

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని ప్రజలు ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పలు ఆలయాల్లో వేడుకలు, దీపోత్సవం, అఖంఢజ్యోతి సందర్శనం, ఉత్సవాలు నిర్వహించారు.

శివోహం.. శివోహం!
స్వర్ణాల చెరువులో దీపాలు వదులుతున్న మహిళలు

భక్తిశ్రద్ధలతో కార్తీక పున్నమి

నెల్లూరు(సాంస్కృతికం), నవంబరు 29 : కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని ప్రజలు ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పలు ఆలయాల్లో వేడుకలు, దీపోత్సవం, అఖంఢజ్యోతి సందర్శనం, ఉత్సవాలు నిర్వహించారు. ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద స్వర్ణాల చెరువు ఘాట్‌లో పెద్ద సంఖ్యలో భక్తులు దీపాలు వదిలి కార్తీక దామోదరుడిని ప్రార్థించారు. ఈ దీపోత్సవంతో స్వర్ణాల చెరువు కళకళలాడింది. మిడతల రమేష్‌, ఇందుపూరు రమేష్‌ ఆచారి, తదితరులు పాల్గొన్నారు. శబరిశ్రీరామ క్షేత్రంలో సాయంత్రం సీతారాముల కల్యాణం కనుల పండువగా జరిగింది. సహస్ర దీపారాధన, కృతికా దీపారాధన జరిగాయి. ఆలయ చైర్మన్‌ కిషోర్‌రెడ్డి, వ్యవస్థాపక చైర్మన్‌ చెన్నూరు వెంకటేశ్వరరెడ్డి, ధర్మకర్తలు పాల్గొన్నారు.  ఉస్మాన్‌సాహెబ్‌పేట అన్నపూర్ణ సమేత కాశీవిశ్వనాథ ఆలయంలో కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారికి పాలాభిషేకాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు జరిగాయి. అలాగే,  తల్పగిరి రంగనాథస్వామి ఆలయంతోపాటు పలు క్షేత్రాల్లో సోమవారం కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆయా ఆలయాల నిర్వాహకులు తెలిపారు.



Updated Date - 2020-11-30T05:42:08+05:30 IST