Advertisement
Advertisement
Abn logo
Advertisement

కార్తీక స్నానాలకు వెళ్లి..

చంపావతి నదిలో మునికి బాలిక మృతి

మరో బాలిక గల్లంతు 

ముగ్గురిని రక్షించిన స్థానిక యువకులు 

 విలపిస్తున్న కుటుంబ సభ్యులు 


కార్తీక సోమవారం పూజల కోసం వేకువనే లేచిన ఆ బాలికలు పుణ్య స్నానాలకు వెళ్లారు. చంపావతి నదిలో దిగిన కొద్దిసేపటికి... ప్రవాహం చూసి కలవర పడ్డారు. వేరొక వైపు వెళ్దామని కాస్తా ముందుకు జరుగుతుండగానే ఒక్కొక్కరూ గల్లంతయ్యారు. ఆ సమయంలో వారి ఆర్తనాథాలు విన్న సమీప యవకులు వెంటనే రక్షించేందుకు ప్రయత్నించారు. ముగ్గురిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఒక బాలికను గుర్తించినప్పటికీ అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది. మరో బాలిక ఆచూకీ తెలియలేదు. డెంకాడ సమీప చంపావతి తీరంలో సోమవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. 


డెంకాడ, నవంబరు 22: 

పుణ్యస్నానాలు ఆచరించడానికి వెళ్లిన ఆ బాలికలను చంపావతి నది పొట్టన పెట్టుకుంది. కార్తీక సోమవారం కావడంతో డెంకాడ, గుణుపూరు గ్రామాలకు చెందిన కొందరు బాలికలు సోమవారం ఉదయం నదీ స్నానాలకు బయలుదేరారు. గుణుపూరుకు చెందిన అలమండ శిరీష(14), పోతుబార్కి భార్గవి (16)తో పాటు కోరాడ రమణి, కోరాడ లావణ్యకుమారి, పోతుబార్కి రూప డెంకాడ సమీపంలోని చంపావతి నదిలో స్నానానికి దిగారు. ప్రవాహం అధికంగా ఉండడంతో స్నానాలకు దిగిన కొద్దిసేపటికే ఒక్కొక్కరూ గల్లంతయ్యారు. కొంతదూరం కొట్టుకుపోతుండగా వారి కేకలు విన్న యువకులు వెంటనే వెళ్లి కోరాడ రమణి, కోరాడ లావణ్యకుమారి, పోతుబార్కి రూపలను   రక్షించారు. మిగతా ఇద్దరి కోసం గాలించగా ఆచూకీ లేకపోవడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌టీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బందిని సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. అంతలో పోతుబార్కి భార్గవి మృతదేహం గుర్తించారు. రాత్రి 7 గంటల వరకు సహాయక చర్యలు చేపట్టినా అలమండ శిరీష ఆచూకీ తెలియరాలేదు. చీకటి పడడంతో సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. డెంకాడ, గుణుపూరు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకుని దుఖఃసంద్రంలో మునిగిపోయారు. సహాయక చర్యల్లో దిశ డీఎస్‌పీ త్రినాథ్‌, భోగాపురం సీఐ విజయానంద్‌, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.  

 గల్లంతైన గుణుపూరు గ్రామానికి చెందిన అలమండ శిరీష(14) డెంకాడ జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు నరసింగరావు, విజయలక్ష్మి స్వగ్రామం  రెల్లివలస. చిన్నప్పటి నుంచి గుణుపూరు గ్రామంలోని అమ్మమ్మ, తాతయ్యల దగ్గర ఉంటూ డెంకాడ పాఠశాలలో చదువుతోంది. నరసింగరావు, విజయలక్ష్మి విశాఖపట్టణంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. వీరికి శిరీషతో పాటు మరో అబ్బాయి ఉన్నాడు. 

 పోతుబార్కి భార్గవి డెంకాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులు విశాఖపట్టణం జిల్లా ఆనందపురంలో పనిచేస్తూ పిల్లలను నాన్నమ్మ, తాతయ్యల దగ్గర ఉంచి చదివిస్తున్నారు. పెద్ద అమ్మాయి సౌజన్య నర్సింగ్‌ కోర్స్‌ ేస్తోంది. రెండో అమ్మాయి త్రివేణి డిగ్రీ చదువుతోంది. మూడో అమ్మాయి భార్గవి. ఈ విషాద ఘటనతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. ఎంపీపీ బి.వాసుదేవరావు, వైస్‌ ఎంపీపీ తమ్మినాయుడు, మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్‌రావు బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

ఇసుక తవ్వకాలతోనే ప్రమాదం

డెంకాడ మండల కేంద్రానికి ఆనుకుని ఉన్న చంపావతి నది నుంచి చుట్టుపక్కల గ్రామాలైన డెంకాడ, బంటుపల్లి, పోతియ్యపాలెం, సింగవరం, నాతవలస స్థానికులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. ఇందు కోసం నదిలో భారీగా గుంతలు తవ్వేశారు. సుమారు 10, 15 అడుగుల లోతున తవ్వారు. ఇప్పుడు అవే మృత్యు కేంద్రాలవుతున్నాయి. నదీ ప్రవాహ సమయంలో వాటిని గుర్తించే అవకాశం ఉండదు. దీంతో ప్రాణాపాయంలో పడుతున్నారు.  Advertisement
Advertisement