టీవీ కోసం తాళి తాకట్టు పెట్టిన తల్లి! పిల్లల భవిష్యత్తు బాగుండాలని..

ABN , First Publish Date - 2020-08-01T17:59:51+05:30 IST

కరోనా దెబ్బకు స్కూళ్లు బంద్.. దీంతో పిల్లల చదువాగిపోయింది.. దూరదర్శన్‌ చానల్‌లో ప్రసారమయ్యే పాఠాలే ప్రస్తుతం ఆ పిల్లలకు దిక్కు. కానీ ఇంట్లో టీవీలేదు. పిల్లలో ఇరుగు పొరుగు వారిళ్లలోనే టీవీ చూస్తున్నారు.

టీవీ కోసం తాళి తాకట్టు పెట్టిన తల్లి! పిల్లల భవిష్యత్తు బాగుండాలని..

బెంగళూరు: కరోనా దెబ్బకు స్కూళ్లు బంద్.. దీంతో పిల్లల చదువాగిపోయింది.. దూరదర్శన్‌ చానల్‌లో ప్రసారమయ్యే పాఠాలే ప్రస్తుతం ఆ పిల్లలకు దిక్కు. కానీ ఇంట్లో టీవీలేదు. ఇరుగు పొరుగు వారిళ్లలోనే ప్రస్తుతం ఆ చిన్నారులు టీవీ చూస్తున్నారు. మరోవైపు.. టీవీ పాఠాలు తప్పనిసరి అని టీచర్లు తల్లికి తేల్చి చెప్పారు. అప్పు చేద్దామనుకుంటే.. ఎవరూ సహాయం చేయలేదు.. ఎక్కడా చిల్లిగవ్వ కూడా పుట్టలేదు. పిల్లల పరిస్థితి చూసి ఆమె గుండె తరుక్కపోయింది. పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని అర్థమైంది. భర్తేమో రోజు కూలీ. కరోనా కరాణంగా భర్తకు కూడా పని దొరకని పరిస్థితి. దీంతో చిన్నారుల భవిష్యత్తు కోసం ఆ తల్లి ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. మెడలోని 12 గ్రాముల మంగళసూత్రాన్ని మరో ఆలోచన లేకుండా తాకట్టు పెట్టి టీవీ కొనిచ్చింది.


ఆ మాతృమూర్తి పేరు కస్తూరి చెలవాడి. ఆమెది కర్ణాటకలోని గడగ్ జిల్లాలోగల రాడేర్ నగనూర్ గ్రామం. అయితే ఈ విషయం అందరికీ తెలియడంతో ఆమె పరిస్థితికి స్థానికులు చలించిపోయారు. కొందరు రాజకీయ నాయకులతో కలసి వారు కొంత మొత్తం పోగేసి ఆ మహిళ కుటుంబానికి అందించారు.  అదే సమయంలో..కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ రూ. 50 వేలు, రాష్ట్రానికి చెందిన మరో మంత్రి రూ. 20 వేల చప్పును ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. ఈలోపు.. విషయం తెలియడంతో షావుకారు కూడా ఆమెకు మంగళసూత్రాన్ని తిరిగిచ్చేశారు. వీలున్నప్పుడే అప్పు తీర్చమంటూ ఆ కుంటుబానికి స్వాంతన చేకూర్చాడు.


కాగా.. ఈ ఘటనపై ఆ మహిళ ఇలా స్పందించింది..‘విద్యార్థుల కోసం దూరదర్శన్‌లో పాఠాలు ప్రసారమవుతున్నాయి. కానీ మా ఇంట్లో టీవీలేదు. ఇరుగుపొరుగిళ్లలో వారు టీవీ చూసేవారు. అయతే పాఠాల కోసం టీవీ చూడాలని ఇటీవల టీచర్లు మాకు చెప్పారు. పిల్లల భవిష్యత్తుపై నాకు అప్పుడు ఆందోళన మొదలైంది. టీవీ కొనేందుకు ఎంతమందిని అప్పు అడిగానా లాభం లేకపోయింది. దీంతో నేను టీవీ కొనేందుకు మంగళసూత్రం తాకట్టు పెట్టా’ అని ఆమె తన దీనావస్థ గురించి చెప్పుకొచ్చారు. ఆమెకు నలుగురు పిల్లలు. ముగ్గురేమో 7,8 తరగతులు చదువుతుండగా.. పెద్దకూతరుకు గతంలోనే పెళ్లైంది. 

Updated Date - 2020-08-01T17:59:51+05:30 IST