Randeep Singh Surjewala: ఎన్నికల వ్యూహాలకు కాంగ్రెస్‌ పదును

ABN , First Publish Date - 2022-08-18T18:16:16+05:30 IST

శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తుండడంతో కాంగ్రెస్‌ శిబిరంలో కోలాహలం ప్రారంభమైంది. బెంగళూరులోని కేపీసీసీ

Randeep Singh Surjewala: ఎన్నికల వ్యూహాలకు కాంగ్రెస్‌ పదును

- ముఖ్యనేతలతో రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా సుదీర్ఘ చర్చ 

- రేపటి నుంచి ఎంబీ పాటిల్‌ రాష్ట్ర పర్యటన 


బెంగళూరు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తుండడంతో కాంగ్రెస్‌ శిబిరంలో కోలాహలం ప్రారంభమైంది. బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీప్‌ సింగ్‌ సుర్జేవా లా అధ్యక్షతన మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు వ్యూహాల రూపకల్పన, బ్లూప్రింట్‌పై సుదీర్ఘ చర్చ జరిగింది. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌(KPCC President DK Sivakumar), ప్రతిపక్షనేత సిద్దరామయ్యతోపాటు పార్టీ సీనియర్‌ నేతలంతా సమావేశానికి హాజరయ్యారు. దావణగెరెలో జరిగిన సిద్దరామోత్సవ భారీగా విజయవంతం కావడం, పంద్రాగస్టున బెంగళూరు బసవనగుడిలో జరిగిన ర్యాలీకి పెద్దఎత్తున జనం హాజరు కావడంపై సుర్జేవాలా హర్షం వ్యక్తం చేశారు. ఇదే ఊపును కొనసాగించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బహిరంగంగా ఎలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయవద్దని నేతలను హెచ్చరించారు. గెలుపు కాంగ్రెస్‌ ముంగిట ఉందని, ప్రస్తుత సమయంలో ఏ చిన్నపొరపాటు చేసినా ప్రతికూల పరిణామాలు ఉంటాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. జిల్లా, తాలూకా స్థాయిలో పార్టీ శ్రేణులను ఉత్తేజ పరచాలని నేతలందరినీ విశ్వాసంలోకి తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఎలాంటి ప్రకటన చేయవద్దని కూడా సూచించారు. ఏ అంశాలైనా పార్టీ వేదికలోనే జరగాలని తేల్చి చెప్పారు. బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగిందని కేపీసీసీ కార్యాధ్యక్షుడు ఆర్‌ రామలింగారెడ్డి(R Ramalinga Reddy) బుధవారం మీడియాకు చెప్పారు. సమష్టి నాయకత్వంలోనే ఎన్నికలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నామన్నారు. బీజేపీ మతతత్వ అజెండాను ఎండగట్టడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జిల్లాలవారీగా ఎన్నికల ప్రణాళికలకు రూపకల్పన చేయాలని సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.  


ఎంబీ పాటిల్‌ రాష్ట్ర పర్యటన ఖరారు

కేపీసీసీ ప్రచార సమితి అధ్యక్షుడు ఎంబీ పాటిల్‌ ఈనెల 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన జరపనున్నారు. ఇది కేపీసీసీ రూపొందించిన తొలి పర్యటన కావడం గమనార్హం. కలబురగిలో ఈనెల 19న పర్యటన ప్రారంభించనున్న ఎంబీ పాటిల్‌, 20న హుబ్బళ్లి-ధారవాడ, 23న చిత్రదుర్గ, 24న శివమొగ్గ, 26న మైసూరు, 27న చామరాజనగర్‌లో పర్యటిస్తారు. సెప్టెంబరు 1న మంగళూరు, 2న ఉడుపి, 3న తుమకూరు, 5న కొప్పళ, 6న బళ్లారి, విజయనగర, 7న రాయచూరు, యాదగిరి, బీదర్‌ జిల్లాల్లో పర్యటిస్తారు. కాగా సెప్టెంబరు 27 నుంచి పార్టీ అధిష్టానం పిలుపు మేరకు భారత్‌ జోడో యాత్రలను విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. సెప్టెంబరు నుంచి ముఖ్య నేతలంతా ప్రజల్లోనే ఉండాలని పార్టీ తీర్మానించింది. 

Updated Date - 2022-08-18T18:16:16+05:30 IST