మంత్రి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

ABN , First Publish Date - 2022-04-14T17:49:17+05:30 IST

రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఈశ్వరప్ప చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్య రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.

మంత్రి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

- సంతోష్‌ ఆత్మహత్యపై కాంగ్రెస్‌ సీరియస్‌  

- మంత్రి రాజీనామా, అరెస్టుకు డిమాండ్‌ 

- గవర్నర్‌కు ఫిర్యాదు

- ఐదు రోజులు రాష్ట్రమంతటా నిరసనలు 


బెంగళూరు: రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఈశ్వరప్ప చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్య రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేయాలని తొలుత డిమాండ్‌ చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు ఆయనపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఆందోళనకు దిగాయి. సంతోష్‌ కుటుంబీకులు కూడా ఈశ్వరప్పపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కాంట్రాక్టర్‌ ఆత్మహత్యకు ముందు మంత్రి ఈశ్వరప్ప పేరు ప్రస్తావించినందున ఆయనపై కేసులు నమోదు చేయాలని, వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. కాంట్రాక్టర్‌ ఆత్మహత్య సంఘటనను కాంగ్రెస్‌ పార్టీ సీరియ్‌సగా తీసుకుంది. బుధవారం ఉదయం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌, ప్రతిపక్షనేత సిద్దరామయ్యతోపాటు ప్రముఖులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను భేటీ అయ్యారు. మంత్రి ఈశ్వరప్ప వేధింపులతో ఓ కాంట్రాక్టర్‌ బలవన్మరణానికి పాల్పడ్డారని, వెంటనే మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈమేరకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. మంత్రి ఈశ్వరప్ప రాజీనామా డిమాండ్‌ చేస్తూ సీఎం అధికారిక నివాసం కృష్ణను ముట్టడించాలని కాంగ్రెస్‌ పార్టీ తీర్మానించింది. క్వీన్స్‌రోడ్డులోని కేపీసీసీలో రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌, ప్రతిపక్షనేత సిద్దరామయ్య, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ సుర్జేవాలా మీడియాతో మాట్లాడారు. సంతోష్ పాటిల్‌ కుటుంబీకులను కలసి ధైర్యం చెబుతామన్నారు. గురువారం సీఎం నివాసాన్ని ముట్టడిస్తామన్నారు. ఐదు రోజులపాటు రాష్ట్రమంతటా మంత్రి ఈశ్వరప్పకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తామన్నారు. కేపీసీసీ నుంచి నేరుగా కాంగ్రెస్‌ బృందం విమానంలో బెళగావికి చేరుకున్నారు. కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఉడుపి నగరంలోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న సంతోష్ పాటిల్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేఎంసీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో సోదరుడి మృతదేహాన్ని చూసిన ప్రశాంత్‌ పాటిల్‌ ప్రభుత్వంపై ఆక్రోశం వ్యక్తం చేశారు. మంత్రి ఈశ్వరప్పపై చర్యలు తీసుకునే దాకా మృతదేహాన్ని తీసుకునేది లేదని హెచ్చరించారు. మంత్రి ఈశ్వరప్ప చర్యలు తీసుకోవాలని మరోవైపు ఆమ్‌ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున నిరసనకు దిగింది. మంత్రిని వెంటనే అరెస్టు చేయాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. 


ప్రధాని మోదీ ఆరా... 

మంత్రి ఈశ్వరప్ప 40 శాతం కమీషన్‌ డిమాండ్‌ చేయడంతోనే కాంట్రాక్టర్‌ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం దేశవ్యాప్తంగా చర్చకు కారణం కావడంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. బీజేపీ జాతీయ సంఘటనా ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్ పాటిల్‌ను వెంటనే భేటీ కావాలని ఆదేశించారు. దీంతో బుధవారం మధ్యాహ్నం బీఎల్‌ సంతోష్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలసి కాంట్రాక్టర్‌ ఆత్మహత్య, మంత్రిపై వచ్చిన ఆరోపణలను వివరించారు. కాగా దక్షిణకన్నడ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం బసవరాజ్‌ బొమ్మై ఆచితూచి స్పందించారు. మంత్రి ఈశ్వరప్పను ఫోన్‌లో ఆరా తీశానని, మరోసారి నేరుగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. బెళగావి పర్యటనలో ఉన్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ అరుణ్‌సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ప్రతీదీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. పార్టీ కార్యకలాపాలలో భాగంగా మూడు జిల్లాల ముఖ్యనాయకుల సమావేశంలోనూ అర్థాంతరంగా అరుణ్‌సింగ్‌ నిష్క్రమించారు. 


రాజీనామా ప్రసక్తే లేదు : మంత్రి ఈశ్వరప్ప 

కాంట్రాక్టర్‌ నుంచి తాను 40 శాతం కమీషన్‌ డిమాండ్‌ చేశానంటూ పథకం ప్రకారం సాగుతున్న కుట్ర అని మంత్రి ఈశ్వరప్ప ఆరోపించారు. తాను మంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం తీవ్రస్థాయిలో దుమారం లేపిన తరుణంలో శివమొగ్గలో బుధవారం మధ్యాహ్నం మంత్రి ఈశ్వరప్ప స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ డెత్‌నోట్‌ అనేది లేకుండానే తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను కమీషన్‌ డిమాండ్‌ చేయలేదన్నారు. పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలకు కట్టుబడతానన్నారు. మంత్రి ఈశ్వరప్ప మీడియాతో మాట్లాడి బయటకు వెళుతున్న సమయంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ముట్టడించే యత్నం చేశారు. అందుకు ధీటుగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.  ఒకానొక దశలో పోలీసు వాహనంపై రాళ్లు, చెప్పులు విసిరారు. పెద్దఎత్తున పోలీసు బలగాలు చేరుకుని ఇరువర్గాలను వారించాయి. దీంతో మంత్రి ఈశ్వరప్ప నివాసానికే పరిమితమయ్యారు. 


సంతోష్‌ ఆత్మహత్యపై అనుమానాలు: బీజేపీ 

కాంట్రాక్టర్‌ సంతోష్ పాటిల్‌ ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని బీజేపీ వరుస ట్వీట్లు చేసింది. కాంగ్రెస్‌ పార్టీ నేతలపై అనుమానం వ్యక్తం చేసింది. రాహుల్‌గాంధీ సంతకం సంతోష్‌ ఫోర్జరీ చేసింది నిజమేనా..? ఇదే కారణానికే అతడిని కాంగ్రెస్‌ నుంచి తొలగించారా..? అని ప్రశ్నించారు. సంతోష్‌ ఘటన కాంగ్రెస్‌ టూల్‌కిట్‌లో భాగమా..? అంటూ ప్రశ్నించారు. సంతోష్ పాటిల్‌ వాస్తవంగా కాంగ్రెస్‌ కార్యకర్త అని కొన్ని కారణాలతో పార్టీ నుంచి తొలగించాక బీజేపీలో చేరారన్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ కూడా ట్విట్టర్‌ వేదికగా పలు ప్రశ్నలు సంధించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నటుల కిచెన్‌ గార్డెన్‌ గురించి తెలుసుకుంటారని, కానీ ఓ కాంట్రాక్టర్‌ మీ పార్టీ మంత్రి నుంచి కమీషన్‌ వేధింపులు ఎదుర్కొంటున్నానని రాసిన లేఖను చదివే సమయం లేదా..? అంటూ ప్రశ్నించింది. కర్ణాటకలో 40 శాతం కమీషన్‌లో భాగస్వామ్యం ఉందా..? అంటూ ప్రశ్నించింది. 




Updated Date - 2022-04-14T17:49:17+05:30 IST