మతాచారాల విషయంలో ఇదెక్కడి వివక్ష ?

ABN , First Publish Date - 2022-02-17T17:41:37+05:30 IST

హిజాబ్‌కు అనుమతి ఇవ్వాలంటూ ఉడిపికి చెందిన ఆరుగురు విద్యార్ధులు దాఖలు చేసుకున్న పిటీషన్‌పై హైకోర్టులో బుధవారం ఆసక్తికరమైన వాదన జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రితురాజ్‌ అవస్తి నాయకత్వంలోని ధర్మాసనం

మతాచారాల విషయంలో ఇదెక్కడి వివక్ష ?

                                - హైకోర్టులో ఆసక్తికర వాదన


బెంగళూరు: హిజాబ్‌కు అనుమతి ఇవ్వాలంటూ ఉడిపికి చెందిన ఆరుగురు విద్యార్ధులు దాఖలు చేసుకున్న పిటీషన్‌పై హైకోర్టులో బుధవారం ఆసక్తికరమైన వాదన జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రితురాజ్‌ అవస్తి నాయకత్వంలోని ధర్మాసనం దాదాపు రెండు గంటపాటు వాదలను ఆలకించింది. ముస్లిం విద్యార్థినులు యూనిఫాం రంగులోని హిజాబ్‌ ధరించేందుకు అనుమతి మంజూరు చేయాలని మంగళవారం ధర్మాసనానికి విజ్ఞప్తి చేసిన పిటీషనర్ల తరుపు న్యాయవాదులు రాజ్యాంగం ప్రసాదించించిన మతపరమైన హక్కులు అమలయ్యేలా ధర్మాసనం చొరవ తీసుకోవాలని కోరింది. పిటీషనర్ల తరుపు న్యాయవాదులు బుధవారం తమ వాదనలను కాస్త సీరియ్‌సగా వినిపించారని తెలుస్తోంది. ప్రముఖ న్యాయవాది రవివర్మకుమార్‌ వాదిస్తూ వేలాది మ తాల గుర్తులను, సంకేతాలను వారి మతాలను వ్యక్తపరిచే చిహ్నాలను ధరించి వస్తుండగా లేని అభ్యంతరం ముస్లిం విద్యార్థినుల హిజాబ్‌ను మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. దుపట్టాలు, గాజులు, టర్బన్‌లు, శిలువలు, నుదుట బొట్లు, రకరకాల నామాలను ధరించే వారిని ఎంచక్కా తరగతి గదులకు అనుమతిస్తున్నపుడు సంప్రదాయ బద్ధంగా హిజాబ్‌తో వస్తున్న చిన్నారులను ఎందుకు అడ్డుకుంటున్నారని, హిజాబ్‌ను మాత్రమే ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. విశాలమైన సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన మతపరమైన సంకేతాల విషయంలో లేని అభ్యంతరాలు హిజాబ్‌ విషయంలో మాత్రం ఎందుకని ఆయన వాదించారు. హిజాబ్‌ ఒక్క దాన్నే వద్దనడం వివక్ష కాదా అని ఆయన ప్రశ్నించారు. విద్యా సంస్థల్లో ఇంతవరకు మత పరమైన చిహ్నాల విషయంలో ఎక్కడా ఎప్పుడూ అభ్యంతరాలు వ్యక్తం కాలేదని, మైనార్టీలు ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తంచేయలేదని అయితే ముస్లిం విద్యార్థినులనే టార్గెట్‌ చేస్తూ హిజాబ్‌ విషయంలో రాద్దాంతం చేయడం పసి మనసులను గాయపర్చడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు. ఇతర మతాల చిహ్నాలు ఉన్న వారిని తరగతి గదుల్లోకి అనుమతించి హిజాబ్‌ ధరించిన విద్యార్థినులను బయటకు పంపేయడం రాజ్యాంగంలోని 15 అధికరణను ఉల్లంఘించడమేనని ఆయన వాదించారు. కర్ణాటక విద్యాచట్టంలో యూనిఫాంలో దేన్నీ నిషేధించినట్లు లేదని, అలాంటపుడు కేవలం హిజాబ్‌ను ఎలా నిషేధిస్తారని ప్రశ్నించారు. ఒక యూనిఫాంను మార్చాలనుకుంటే ఏడాది ముందుగానే విద్యార్థుల తలిదండ్రులకు ఈ విషయం తెలియజేయాల్సి ఉంటుందన్నారు. కాగా కాలేజీ డెవెల్‌పమెంట్‌ కమిటీ (సీడీసీ)లో ఒక మతానికి చెందిన భావజాలం కలిగిన ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలను అప్పగించడం సరికాదన్నారు. హిజాబ్‌ వివాదంపై న్యాయవాది దేవదత్‌ వాదిస్తూ రాజ్యాంగానికి లోబడి మతాచారాలకు లోబడి యూనిఫాం ధరించేందుకు ముస్లిం విద్యార్థినులకు అనుమతి మంజూరు చేయాలని ధర్మాసనానికి విజ్ఞప్తిచేశారు. పిటీషనర్ల వాదన దాదాపు ముగిసిందని గురువారం ప్రభుత్వ తరపు న్యాయవాదులు ధర్మాసనం ముందు తమ వాదన వినిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Updated Date - 2022-02-17T17:41:37+05:30 IST