సంతోష్ ఆత్మహత్యా యత్నంపై డీకే సంచలన వ్యాఖ్యలు...

ABN , First Publish Date - 2020-11-29T01:28:12+05:30 IST

కర్నాటక సీఎం యడియూరప్ప రాజకీయ కార్యదర్శి, సమీప బంధువు ఎన్ఆర్ సంతోష్ ఆత్మహత్యా యత్నంపై విచారణ జరిపించాలని ...

సంతోష్ ఆత్మహత్యా యత్నంపై డీకే సంచలన వ్యాఖ్యలు...

బెంగళూరు: కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప రాజకీయ కార్యదర్శి, సమీప బంధువు ఎన్ఆర్ సంతోష్ ఆత్మహత్యా యత్నంపై విచారణ జరిపించాలని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ డిమాండ్ చేశారు. ‘‘నాకు తెలిసిన, నేను విన్న సమాచారం ప్రకారం.. సీఎం రాజకీయ కార్యదర్శి ఎన్ఆర్ సంతోష్ ఓ రహస్య వీడియోను ఓ మంత్రి, ఓ ఎమ్మెల్సీకి పంపించారు. తర్వాత అది బీజేపీ అధిష్టానంలోని అగ్రనేతలకు కూడా వెళ్లింది...’’ అని శివకుమార్ పేర్కొన్నారు. దీంతో సదరు ఎమ్మెల్సీ, మంత్రి ఇద్దరూ సీఎంతో పాటు ప్రభుత్వంలోని మరికొందరు నేతలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారనీ.. కొన్ని నెలలుగా ఈ వ్యవహారం సాగుతోందని డేకే ఆరోపించారు. ‘‘ఓ ముఖ్యమంత్రికి చెందిన రాజకీయ కార్యదర్శి ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం చిన్న విషయమేమీ కాదు. దీనిపై సరైన విచారణ జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని విచారించకూడదు..’’ అని డీకే పేర్కొన్నారు.


శుక్రవారం తన నివాసంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నం చేసిన సంతోష్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను బెంగళూరులోని రామయ్య మెమోరియల్ ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న యడియూరప్ప హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి సంతోష్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంతోష్ కోలుకున్న తర్వాత ఆయనతోనూ, ఆయన కుటుంబ సభ్యులతోనూ మాట్లాడతానని సీఎం చెప్పారని సంతోష్ కుటుంబ సభ్యుడొకరు వెల్లడించారు. 

Updated Date - 2020-11-29T01:28:12+05:30 IST