నగరంలో భారీ వర్షం

ABN , First Publish Date - 2020-09-27T11:10:13+05:30 IST

అల్పపీడన ద్రోణి ప్రభావంతో నగరంలో భారీ వర్షం కురిసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం 11 గంటల వరకు

నగరంలో భారీ వర్షం

- లోతట్టు ప్రాంతాలు జలమయం 

- రాంనగర్‌, శ్రీహరినగర్‌కాలనీ ఇళ్లలోకి చేరిన వరద నీరు 

- మేయర్‌ వై.సునీల్‌రావు, కమిషనర్‌ క్రాంతి సుడిగాలి పర్యటన 


కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 26: అల్పపీడన ద్రోణి ప్రభావంతో నగరంలో భారీ వర్షం కురిసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం 11 గంటల వరకు పలుమార్లు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు, శివారుకాలనీలు జలమయమయ్యాయి. రాంనగర్‌, శ్రీహ రినగర్‌ తదితర కాలనీల్లో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల మురుగునీరు కాలువలు పొంగిపొర్లి రోడ్లపైకి చేరడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందిపడ్డారు. నగర మేయర్‌ వై.సునీల్‌రావు, కమిషనర్‌ వల్లూరి క్రాంతి వరద పీడిత ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల కార్పొరేటర్లు, అధికారులతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. తాత్కాలిక చర్యల్లో భాగంగా ముందుగా వర్షపునీటిని మురుగునీటి కాలువల్లోకి మళ్లించాలని, మురుగునీరు కాలువలు లేని ప్రాంతాల్లో కచ్చాకాలువలు తవ్వి నీటిని తొలగించాలని ఆదేశించారు. అదే విధంగా వర్షాకాలం తర్వాత శాశ్వత పరిష్కారం చూపే విధంగా ప్రతిపాదనలను తయారు చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదే శించారు. ఓ మోస్తరు వర్షం కురిస్తేనే మంకమ్మతోటలోని కొన్ని ఇళ్ళలోకి వరద నీరు వచ్చి చేరగా భారీ వర్షాలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 15వ డివిజన్‌ రాంనగర్‌లో వర్షపునీరు రోడ్డుపైకి చేరడంతో ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఆర్‌అండ్‌బీశాఖ నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేని కారణంగానే వర్షపునీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మున్సిపల్‌ విపత్తు నిర్వహణ బృందంతో తాత్కాలికంగా నీటిని మళ్లి స్తామని, శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. 58,59 డివిజన్‌ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లోని వరద ముంపు ప్రాంతాలను కార్పొరేటర్లు రాపర్తి విజయ, గందె మాధవిమహేశ్‌తో కలిసి సందర్శించి నీటిని మళ్లింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. త్వరలోనే నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున అందుకు అనుగుణంగా డ్రైనేజీలను, వరద నీటి కాలువలను నిర్మిస్తామని చెప్పారు. శాతవాహన యూనివర్శిటీ సమీపంలోని పోలీసు శిక్షణ కేంద్రంలోని వేయి మంది రోజు వినియోగించే నీటితోపాటు వరద నీరు కలిసి రావడంతో ప్రహారీ  కూలిపోయి శ్రీహరినగర్‌, రాంనగర్‌ కాలనీల్లోని పలు ఇళ్లలోకి వరద నీరు వచ్చింది. ఈ విషయాన్ని కార్పొరేటర్‌ కచ్చు రవి మేయర్‌ సునీల్‌రావు దృష్టికి తీసుకెళ్లడంతో కమిషనర్‌తో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించి వరద నీటిని మళ్ళించేందుకు కల్వర్టుల నిర్మాణాలను చేప ట్టేందుకు ప్రతిపాదనలు చేయాలని అధికారులను ఆదేశించారు.  

Updated Date - 2020-09-27T11:10:13+05:30 IST