పెళ్లివేడుకలకు వస్తుండగా.. తీవ్ర విషాదం

ABN , First Publish Date - 2020-08-15T20:03:49+05:30 IST

బంధువులు, రక్త సంబంధీకులు వారి రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో..

పెళ్లివేడుకలకు వస్తుండగా.. తీవ్ర విషాదం

కనిగిరి(ప్రకాశం): బంధువులు, రక్త సంబంధీకులు వారి రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో వారు గమ్యానికి చేరుకోబోతుండగా మృత్యువు లారీ రూపంలో వచ్చి ఇద్దరిని కాటేసింది. ఒక వ్యక్తి మృతి పెళ్లింట విషాదం నింపగా... డ్రైవర్‌ మృతితో ఆ పేద కుటుంబం రోడ్డున పడింది. కనిగిరి నగర పంచాయతీ సమీపంలోని మాచవరం వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. పూర్తి వివరాల్లోకెళ్తే...


పామూరు మండలం తిరగలదిన్నె గ్రామంలో జరగనున్న ఓ వివాహ వేడుకకు తెలంగాణా రాష్ట్రం నిజామాబాద్‌లో ఉంటున్న బంధువులను తీసుకువచ్చేందుకు బాడుగ వాహనం నడుపుకునే డ్రైవర్‌ నజీర్‌బయలుదేరివెళ్లాడు. గురువారం మధ్యాహ్నం అక్కడ్నుంచి తిరుగుప్రయాణమయ్యాడు. మండ్లా మాల్యాద్రి(45), మండ్లా మల్లికార్జునలు వివాహ వేడుకకు వస్తుండగా, డ్రైవర్‌ నజీర్‌(42), అతని బంధువులైన ఎస్‌కే సుభాని, బీబీజాన్‌, మూడేళ్ల పాపను కూడా వాహనంలో ఎక్కించుకుని తీసుకొస్తున్నాడు. మాచవరం వద్దకు వచ్చే సరికి డ్రైవర్‌ కునుకుతీయడంతో లారీని ఢీకొట్టారు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన మాల్యాద్రిని వైద్యశాలకు తీసుకొచ్చేలోపే చనిపోగా.. డ్రైవర్‌ నజీర్‌ను ఒంగోలు తరలించగా కరోనా నేపథ్యంలో చికిత్స అందక శుక్రవారం వేకువజామున మరణించినట్లు బంధువులు తెలిపారు.


నజీర్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. లాక్‌డౌన్‌ కావడంతో కారు ఫైనాన్స్‌ కిస్తీలు కట్టలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో రోజూ ప్రయాణికులను తరలిస్తూ బతుకీడుస్తున్న సమయంలో మృత్యువు కబళించింది. ప్రధాన పోషణ వ్యక్తి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. అదేవిధంగా మృతి చెందిన మాల్యాద్రి శుక్రవారం జరగనున్న దగ్గరి బంధువుల వివాహ వేడుకకు వస్తున్నాడు. ఇతని మృతితోపాటు మల్లికార్జున గాయపడడంతో పెళ్లింట విషాదం నెలకొంది. ఇదే ప్రమాదంలో సుభానీ, మల్లికార్జున, బీబీ జాన్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. మూడేళ్ల పాప మాత్రం ప్రమాద ఘటనకు భీతిల్లి మాట పలుకు లేకుండా ఉండటంతో ఒంగోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం పాప క్షేమంగానే ఉన్నట్లు బంధువులు తెలిపారు. ఎంతో వైభవంగా జరగాల్సిన పెళ్లి వేడుకలో ఈ దుర్ఘటన బంధువులను శోకసముద్రంలో ముంచేసింది. ఏఎంసీ మాజీ చైర్మన్‌ దారపనేని చంద్రశేఖర్‌ అతని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 


Updated Date - 2020-08-15T20:03:49+05:30 IST