కనిమొళి ట్వీట్‌తో తమిళ భాషకు మరింత ప్రాభవం

ABN , First Publish Date - 2020-08-13T02:39:56+05:30 IST

డీఎంకే ఎంపీ కనిమొళి ఈ నెల 9న చేసిన ఓ ట్వీట్ సంచలనం సృష్టించింది. తనకు హిందీ

కనిమొళి ట్వీట్‌తో తమిళ భాషకు మరింత ప్రాభవం

న్యూఢిల్లీ : డీఎంకే ఎంపీ కనిమొళి ఈ నెల 9న చేసిన ఓ ట్వీట్ సంచలనం సృష్టించింది. తనకు హిందీ తెలియకపోవడంతో తన భారతీయతను విమానాశ్రయం అధికారి ఒకరు ప్రశ్నించారని ఆమె ట్వీట్ చేశారు. దీంతో స్థానిక భాషలకు మరింత ప్రాధాన్యం ఇస్తామని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) ప్రకటించింది. తద్వారా కనిమొళి తన మాతృభాష తమిళం మరింత అభివృద్ధి చెందేందుకు దోహదపడ్డారు. 


కనిమొళి ఆగస్టు 9న ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘నేడు (చెన్నై) విమానాశ్రయంలో, నాకు హిందీ తెలియకపోవడంతో, నాతో తమిళం లేదా ఇంగ్లిష్‌లో మాట్లాడాలని నేను కోరినపుడు, ఓ సీఐఎస్ఎఫ్ అధికారి నేను భారతీయురాలినేనా అని అడిగారు. భారతీయులుగా ఉండటం హిందీ తెలియడంతో సమానం ఎప్పటి నుంచి అయిందో తెలుసుకోవాలనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ‘హిందీఇంపోజిషన్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో దీనిని పోస్ట్ చేశారు. 


కనిమొళి ఆరోపణలపై సీఐఎస్ఎఫ్ తక్షణమే స్పందించి, విచారణ జరిపింది. ఈ విచారణ గురించి సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కనిమొళితో చెన్నై విమానాశ్రయంలో మాట్లాడిన మహిళా అధికారి ఓ దక్షిణాది రాష్ట్రానికి చెందినవారు. ఆమెను ప్రశ్నించినపుడు తాను కనిమొళి ఆరోపించినట్లుగా మాట్లాడలేదని చెప్పారు. హిందీ తెలియకపోవడం వల్ల మీరు భారతీయురాలేనా? అని తాను కనిమొళిని ప్రశ్నించలేదని చెప్పారు. అయితే హిందీ కూడా భారతీయ భాషేనని, అధికారిక భాషేనని మాత్రమే తాను అన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆ మహిళా అధికారికి ప్రయాణికులతో మాట్లాడవలసిన సంప్రదాయాలు, మర్యాదల గురించి అధికారులు వివరించారు. 


సీఐఎస్ఎఫ్ ఇచ్చిన ఓ ట్వీట్‌లో, ‘‘ప్రత్యేకంగా ఏదో ఓ భాష గురించి పట్టుబట్టడం సీఐఎస్ఎఫ్ విధానం కాదు’’ అని ప్రకటించింది. 


సీఐఎస్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, పరిపాలన, కార్యకలాపాల నిర్వహణ దృష్ట్యా విమానాశ్రయాల్లో పని చేసే సిబ్బంది, అధికారుల్లో ఎక్కువ మంది స్థానిక భాష తెలిసిన వారు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. 


మొత్తం మీద కనిమొళి గళమెత్తడంతో తమిళానికి మరోసారి పెద్ద పీట పడింది.


Updated Date - 2020-08-13T02:39:56+05:30 IST