‘కంది’పోయింది

ABN , First Publish Date - 2022-01-10T04:26:43+05:30 IST

రైతులకు వానాకాలం సీజన్‌ మెట్ట పంటలు కలిసి రావడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరి తరువాత రెండో స్థానంలో పత్తి, మూడో స్థానంలో కంది పంటలు సాగవుతున్నాయి. గత ఏడాది వరుసగా కురిసిన వర్షాలకు పత్తి పంట దెబ్బతిని ఎకరాకు నాలుగైదు క్వింటాళ్ల దిగుబడే వచ్చింది.

‘కంది’పోయింది
ఆరెగూడెంలో కోయకుండా వదిలేసిన కంది పంట

నవంబరు కురిసిన వర్షాలతో తగ్గిన దిగుబడి

ఎకరాకు క్వింటా కూడ రాని వైనం

కోయకుండానే వదిలేస్తున్న రైతులు

ఈ ఏడాది కలిసిరాని మెట్టపంట



మోత్కూరు, జనవరి 9: రైతులకు వానాకాలం సీజన్‌ మెట్ట పంటలు కలిసి రావడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరి తరువాత రెండో స్థానంలో పత్తి, మూడో స్థానంలో కంది పంటలు సాగవుతున్నాయి. గత ఏడాది వరుసగా కురిసిన వర్షాలకు పత్తి పంట దెబ్బతిని ఎకరాకు నాలుగైదు క్వింటాళ్ల దిగుబడే వచ్చింది. ప్రభుత్వ మద్దుతు ధర క్వింటాకు రూ.6200 ఉండగా, బహిరంగ మార్కెట్లో సుమారు రూ.8,000లకు పైగా పలికింది. దీంతో దిగుబడి తగ్గినా అధిక ధర కారణంగా పత్తి రైతులు కొద్దిపాటి నష్టాలతో బయట పడ్డారు. వర్షాలకు పత్తి దెబ్బతినగా, కంది చేలు ఏపుగా పెరిగాయి. పత్తి పోయినా కంది ఆదుకుంటుందని రైతులు అనుకున్నారు. ప్రస్తుతం కంది చేను కోతలు కొనసాగుతున్నాయి. ఎకరా చేను కోస్తే క్వింటా దిగుబడి కూడా రాకపోవడంతో కంది రైతులు లబోదిబోమంటున్నారు. కోత కూలి కూడా వచ్చేలా లేదని కొందరు రైతులు పంటను కోయకుండానే వదిలేస్తున్నారు.


41,844 ఎకరాల్లో కంది సాగు

వరి సాగును తగ్గించి ఆరుతడి పంటలే సాగుచేయాలని గత ఏడాది నుంచి ప్రభుత్వం ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. దీంతో వానాకాలం సీజన్‌లో యాదాద్రి జిల్లాలో 22,196 ఎకరాల్లో, నల్లగొండ జిల్లాలో 10,419 ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలో 9,229 ఎకరాల్లో కంది సాగైంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 41,844 ఎకరాల్లో కంది పంటను రైతులు సాగు చేశారు.


విశాఖ కార్తెలో వర్షాలతో..

విశాఖ కార్తెలో (నవంబరు) వర్షాలు కురిస్తే కంది పంట రాదని పూర్వం పెద్దలు చెప్పేవారు. ప్రస్తుతం పెరిగిన విజ్ఞానంతో అదేమీకాదని, మందులు పిచికారీ చేస్తే కాత వస్తుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. కానీ వానాకాలం సీజన్‌లో పెద్దలు చెప్పిన మాటలే నిజమయ్యాయి. నవంబరు (విశాఖ కార్తె)లో వర్షాలు కురిశాయి. ఒక్కో కంది రైతు మూడు పర్యాయాలు క్రిమిసంహారక మందు, పూత నిలిచే మందు పిచికారీ చేశారు. అయినా పూత నిలువలేదు. నిలిచిన పూత, కాత కూడా సక్రమంగా లేదు. నవంబరులో వర్షాలు కురియక ముందు పూతకొచ్చి, కాయ గట్టిపడిన చేలు మాత్రం అంతంతగా ఉన్నాయి. నవంబరులో పూతకొచ్చిన చేలల్లో అక్కడోకాయ, ఇక్కడో కాయ కాసింది. కొతకొచ్చే సమయానికి ఆకు రాలి చెట్టుపై కాత మాత్రమే కన్పిస్తుంది. అలాంటిది నవంబరు మాసంలో కురిసిన వర్షాలకు ఇగురు వచ్చి పూత రాక ముందు పంట ఎలా ఉంటుందో అదే విధంగా ప్రస్తుతం పచ్చగా ఉంది. దీంతో కాత కన్పించడం లేదు. కొంతలో కొంతైనా ఆదాయం రాకపోతుందా అని కొందరు రైతులు పంటను కోస్తుండగా, మరి కొందరు రైతులు కోసినా కూలి కూడా వచ్చేలా లేవని అలాగే వదిలేస్తున్నారు. యాదాద్రి జిల్లా ఆరెగూడెం గ్రామంలో కొణతం లింగారెడ్డి 8ఎకరాలు, చేకూరి సైదులు 5, అన్నెపు భిక్షం 4, నాగుల రవి 3, చేకూరి నర్సింహ 3, ఆవుల లింగయ్య 3, ఇలా గ్రామం మొత్తం సుమారు 70 నుంచి 80 ఎకరాల్లో కంది పంటను కోయకుండానే రైతులు అలాగే వదిలేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.


దయనీయంగా కౌలు రైతుల పరిస్థితి

కౌలు రైతు ఎకరాకు రూ.మూడు వేలు కౌలు చెల్లించాల్సి వస్తోంది. ఎకరాకు కంది నాలుగు క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, ఈ సారి క్వింటా మాత్రమే వచ్చాయి. కందులు ఇంకా మార్కెట్‌కు రాక ధర ఎంత పలుకుందనేది స్పష్టం కావడం లేదు. క్వింటా కందులు ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించినా ఎకరాకు రూ.6300 వస్తాయి. సొంత భూమి ఉన్న రైతుకు రూ.14,975 పెట్టుబడి ఖర్చు అవుతుండగా, రూ.6300 ఆదాయం వస్తే ఎకరాకు రూ.8,675 చొప్పున నష్టం వస్తుంది. ఇక కౌలు రైతు అయితే ఎకరాకు రూ.11675 నష్టం భరించాల్సిందే.అకాల వర్షాలతో దెబ్బతిన్న కంది పంటలను ప్రభుత్వం సర్వే చేయించి పరిహారం చెల్లించి ఆదుకోవాలని కంది రైతులు కోరుతున్నారు.



15ఎకరాల్లో కంది వేశా : కొణతం అంజమ్మ

మోత్కూరు మునిసిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామం మాది. వానాకాలంలో సొంత భూమి 5ఎకరాలు, మరో 10ఎకరాలు కౌలుకు తీసుకుని మొత్తం 15ఎకరాల్ల్లో కంది సాగుచేశా. ఎకరాకు రూ.15,425 చొప్పున రూ.2,31,375 పెట్టుబడి పెట్టా. ఎకరాకు రూ.3వేల చొప్పున 10ఎకరాలకు రూ.30వేలు కౌలు ఇచ్చా. కంది పంట కోస్తే సుమారు 15క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇంకా విక్రయించలేదు. ప్రభుత్వ మద్దతు ధర రూ.6300గా ఉంది. మద్దతు ధరకు విక్రయిస్తే 15క్వింటాళ్లకు రూ.94,500లే వస్తాయి. కౌలుతో కలిపి మొత్తం రూ.2,61,375 చేనుకు పెట్టుబడి ఖర్చు రాగా, కందులు విక్రయించిన డబ్బు పోగా, రూ.1,66,875 నష్టపోతున్నా. ఏం చేయాలో, పెట్టుబడి కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలో తోచడం లేదు.



కంది పంట కోయకుండా వదిలేశా: కొణతం లింగారెడ్డి, ఆరెగూడెం, కంది రైతు

వానాకాలం సీజన్‌లో 8ఎకరాల్లో కంది పంట వేశా. నవంబరులో కురిసిన వర్షాలకు పూత రాలింది. అక్కడక్కడ మిగిలిన పూత కాతగా మారగా, అందులో గింజలే లేవు. కోసిన కూలి కూడా వచ్చేలా లేదని కోయకుండానే వదిలేశా. గొర్రెలను మేపేందుకు పంటను ఇచ్చా. అకాల వర్షాలను కూడా ప్రకృతి వైపరీత్యంగా భావించి కంది చేను దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలి.


ఎకరా కంది సాగుకు ఖర్చు ఇలా..

దున్నకం (ఇరువాలు) రూ.1200

విత్తనం రెండు కిలోలు రూ.500

దున్నుతూ విత్తనం వేసినందుకు రూ.700

విత్తనం వేసే వ్యక్తి కూలి రూ.100

ఒక బస్తా కాంప్లెక్స్‌ ఎరువు రూ.1475

గుంటుక నాలుగు సార్లు రూ.2800

గుంటుకతో ఎరువు వేసేందుకు కూలి రూ.100

కలుపు తీతమూడు సార్లు పురుగులమందు రూ.3000

పిచికారీ, కూలితో కలిపి రూ.3600

కోత కూలి రూ.1500

మొత్తం రూ.14975


Updated Date - 2022-01-10T04:26:43+05:30 IST