కండలేరు ఎడమగట్టు కాలువకు గండి

ABN , First Publish Date - 2021-12-06T04:18:25+05:30 IST

కండలేరు ఎడమగట్టు కాలువకు మూడు రోజుల క్రితం గండి పడింది.

కండలేరు ఎడమగట్టు కాలువకు గండి
కండలేరు ఎడమగట్టు కాలువకు పడిన గండి

రైతులు ఇసుక బస్తాలు వేసినా ఆగని నీరు

పట్టించుకోని అధికారులు


పొదలకూరు, డిసెంబరు 5 : కండలేరు ఎడమగట్టు కాలువకు మూడు రోజుల క్రితం  గండి పడింది. మండలంలోని తోడేరు, మరుపూరు మధ్యన ఉన్న కాలువకు గండి పడడంతో కాలువ నీరు మరుపూరు మాగాణి పొలాలపై ప్రవహిస్తోంది. ఫలితంగా రైతులు వరినాట్లు వేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కాలువకు గండి పడిన తర్వాత మరుపూరు రైతులు గండికి రెండు దఫాలుగా ఇసుక బస్తాలు వేశారు. అయినా కాలువ నీరు పొలాల గుండా ప్రవహిస్తుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో గండి పడిన ప్రదేశంలో మరుపూరు రైతులు పైపులు ఏర్పాటు చేసుకుని నీటిని పారించుకునేవారు. తెలుగుగంగ అధికారులు ఆ పైపులను తొలగించి ఒక పైపు అక్కడ నిర్మించడంతో గండి పడినట్లుగా తెలుస్తోంది. గండి పడిన కాలువ నుంచి మరుపూరు చెరువులోకి నీరు చేరితే ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే పొలాల మీదుగా ప్రవహిస్తున్నందువల్ల నాట్లు వేసే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 


Updated Date - 2021-12-06T04:18:25+05:30 IST