దుర్గమ్మ సాక్షిగా.. భారీ దోపిడీకి స్కెచ్‌!

ABN , First Publish Date - 2021-04-27T06:27:22+05:30 IST

కరోనా పేరుతో దుర్గమ్మ సాక్షిగా..

దుర్గమ్మ సాక్షిగా.. భారీ దోపిడీకి స్కెచ్‌!

దుర్గగుడికి చెందిన సి.వి.రెడ్డి ఛారిటీస్‌ను కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చేందుకు రంగం సిద్ధం 

ఓ ప్రైవేటు ట్రస్టుకు ఉచితంగా ఇచ్చేందుకు అనుమతి కోరుతూ కమిషనర్‌కు ఈవో లేఖ 

ఆగమేఘాలపై అనుమతులిస్తూ ఉత్తర్వులు విడుదల 

మంత్రి హస్తంపై పలువురి అనుమానాలు


ఆంధ్రజ్యోతి-విజయవాడ: కరోనా పేరుతో దుర్గమ్మ సాక్షిగా మరో భారీ దోపిడీకి రంగం సిద్ధమైంది. కరోనాను అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు దండుకునేందుకు అక్రమార్కులు స్కెచ్‌ వేశారు. ఇప్పటికే ఏసీబీ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడులు.. అడుగడుగునా బయటపడిన భారీ అక్రమాలు.. ఒకేసారి 15మంది ఉద్యోగులపై సస్పెన్షన్‌.. ఉన్నతాధికారిపై బదిలీ వేటు.. ఇలా వరుస పరిణామాలతో దుర్గమ్మ ప్రతిష్ట మసక బారినా దుర్గగుడి అధికారుల పనితీరులో కించిత్‌ మార్పు లేదు. ఇప్పటికీ రాజకీయ నేతల సిఫార్సులకు వత్తాసు పలుకుతూ పవిత్ర ఇంద్రకీలాద్రిపై అక్రమ వ్యవహారాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ విలయతాండవం చేస్తుండటంతో దుర్గమ్మ సాక్షిగా ఓ ప్రైవేటు ట్రస్టు ఆధ్వర్యంలో కరోనా బాధితులకు వైద్యసదుపాయాల పేరుతో రూ.కోట్లలో సొమ్ము దోచుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. దీనికి పవిత్రమైన దుర్గగుడికి చెందిన సి.వి.రెడ్డి ఛారిటీస్‌ను వేదికగా ఎంపిక చేసుకున్నారు.

 

విజయవాడ రైల్వేస్టేషన్‌కు అతి సమీపంలోని సువిశాలమైన విస్తీర్ణంలో ఉన్న సి.వి.రెడ్డి ఛారిటీస్‌ను వచ్చే జూన్‌ 30 వరకు 2 నెలల పాటు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా వినియోగించుకునేందుకు ఉచితంగా ఇవ్వాలని కోరుతూ వన్‌టౌన్‌లోని శ్రీ సంభవ్‌నాథ్‌ రాజేంద్రసూరిజైన్‌ స్వేతాంబర్‌ ట్రస్టు కార్యదర్శి ఈనెల 19న దుర్గగుడి ఈవోకు లేఖ రాశారు. కరోనా బారినపడిన పేద వ్యక్తులకు సేవాభావంతో తమ ట్రస్టు తరపున వైద్య సదుపాయాలు అందించేందుకు ఒక్కొక్కరికి 7 రోజులకు రూ.21 వేలు చొప్పున వసూలు చేస్తామని ట్రస్టు కార్యదర్శి తన లేఖలో పేర్కొన్నారు. అంటే ఒక్కో బాధితుడి నుంచి రోజుకు రూ. 3వేలు చొప్పున వసూలు చేస్తారన్నమాట. ఈ లెక్కన సి.వి.రెడ్డి ఛారిటీస్‌లో పెద్ద హాల్స్‌ 4, ఏసీ డార్మెటరీలు 2, ఒక రిసెప్షన్‌ ఉన్నాయి. ఒక్కొక్క హాలులో దాదాపు 100 బెడ్స్‌ ఏర్పాటుకు వీలుంది. మొత్తం నాలుగు హాల్స్‌లో 400 బెడ్స్‌, ఒక్కో ఏసీ డార్మెటరీలో 50 బెడ్స్‌ చొప్పున మరో 100 బెడ్స్‌ కలిపి మొత్తం 500 బెడ్స్‌ వరకు ఏర్పాటు చేసుకునేందుకు వీలుంది.


మిగిలిన వాటిని ఒక్కొక్క బెడ్‌కు రోజుకు రూ.3వేలు చొప్పున వసూలు చేస్తే రోజుకు రూ.15 లక్షలవుతుంది. ఈ లెక్కన రెండు నెలల్లో దాదాపు రూ.9కోట్ల మేర బాధితుల నుంచి వసూలు చేసేందుకు పక్కా ప్రణాళికను రూపొందించారు. సి.వి.రెడ్డి ఛారిటీస్‌ను తమకు ఉచితంగా ఇవ్వాలని ట్రస్టు కార్యదర్శి లేఖ రాయగానే దుర్గగుడి ఈవో డి.భ్రమరాంబ సానుకూలంగా స్పందిస్తూ తగు ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఈనెల 24న దేవదాయశాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ లేఖపై కమిషనర్‌ ఆగమేఘాల మీద స్పందించి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు అనుమతిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసేశారు. దీని వెనుక మంత్రి చక్రం తిప్పినట్లు సమాచారం. 


దేవస్థానానికి వచ్చే ఆదాయాన్ని వదులుకుని.. 

దుర్గమ్మ దర్శనానికి దూరప్రాంతాల నుంచి వస్తున్న భక్తుల సౌకర్యార్ధం ఈ చారిటీస్‌ను నిర్మించారు. వీరి నుంచి కనీస ఛార్జీలు వసూలు చేస్తుండగా గత 5 నెలల్లో దేవస్థానానికి రూ. 1.64 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈవో భ్రమరాంబ కమిషనర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. భక్తులకు వసతి లేకుండా చేసి నెలవారీగా ఆదాయాన్ని వదులుకుని మరీ సి.వి.రెడ్డి ఛారిటీస్‌ను ప్రైవేటు ట్రస్టుకు ఉచితంగా ఇవ్వడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయనే ప్రశ్నకు అధికారుల నుంచి మౌనమే సమాధానం. పైగా 5 బెడ్లను మాత్రమే సిబ్బందికి ఉచితంగా కేటాయిస్తామని చెబుతుండటం మరీ విడ్డూరం.


ఇప్పటికే ఎంతోమంది అర్చకులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులు వైరస్‌ బారినపడ్డారు. కొంతమంది అర్చకులు కూడా మరణించారు. వీరే మృత్యువుతో పోరాటం చేస్తుంటే వారిని కాపాడుకునేందుకు సి.వి.రెడ్డి ఛారిటీస్‌ను దేవస్థానం తరపునే ఉచిత కొవిడ్‌ కేర్‌ సెంటరుగా నిర్వహిస్తే బాగుండేది. దేవస్థానానికి గాని, ఉద్యోగులు, సిబ్బందికి, భక్తులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా రూ. కోట్లలో సొమ్ము చేసుకునేందుకు ఓ ప్రైవేటు ట్రస్టుకు ఉచితంగా ధారాదత్తం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2021-04-27T06:27:22+05:30 IST