కలిసిరాని కాలం..

ABN , First Publish Date - 2020-11-30T05:40:39+05:30 IST

ఈ ఏడాది అన్నదాతకు ఏమాత్రం కలిసిరాలేదు. ఓవైపు వాతావరణం.. మరోవైపు దళారుల దెబ్బకు కుదేలయ్యాడు.

కలిసిరాని కాలం..
తోటపల్లిగూడూరులో నీట మునిగిన వరినాట్లను పరిశీలిస్తున్న ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు

ఏడాదంతా రైతన్నకు అపారనష్టం

రెండోపంట సాగులో ఎన్నో కష్టాలు

రబీ ప్రారంభంలోనే  ‘నివర్‌’ దెబ్బ

కోలుకోలేకున్న అన్నదాత


నెల్లూరు(వ్యవసాయం), నవంబరు 29 : ఈ ఏడాది అన్నదాతకు ఏమాత్రం కలిసిరాలేదు. ఓవైపు వాతావరణం.. మరోవైపు దళారుల దెబ్బకు కుదేలయ్యాడు. మొత్తం మీద రైతన్నకు ఈ సంవత్సరం అపారనష్టం వాటిల్లిందనేది వాస్తవం. ఈ క్రమంలో ప్రభుత్వం మాటలకు మాత్రమే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో రైతన్నల ఇబ్బందులు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. పాలకులే దళారుల అవతారమెత్తి అన్నదాతను నిలువునా ముంచేస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయస్థితిలోకి రైతు వెళ్లిపోయాడు. అయినా తనకు చేతనైన వ్యవసాయం తిరిగి చేపడితే అకాల వర్షాలతో కోలుకోలేని దెబ్బ తగిలింది. 

 దిగుబడి విక్రయంలో ఇక్కట్లు

జిల్లాలో గతేడాది మొదటి పంటను అమ్ముకోవడంలో రైతన్న ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఓవైపు అకాల వర్షాలతో ఇబ్బందులు పడినప్పటికి పంటను జాగ్రత్తగా పండిస్తే అమ్ముకునేందుకు సరైన వసతులు లేక జిల్లా రైతులు ఎన్నో అవస్థలు పడ్డారు. అయినప్పటికి నీరు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో రెండోపంటకు సిద్ధమయ్యాడు. జిల్లాలో రెండో పంట సాదారణంగా లక్ష ఎకారలకు మించి సాగుచేయని పరిస్థితి. అయితే ఈఏడాది రికార్డు స్థాయిలో దాదాపు 3లక్షల ఎకరాల్లో అన్నదాత సాగు చేపట్టాడు. అయినా వాతావరణం అనుకూలించని పరిస్థితి. సరిగ్గా పంట చేతికందే సమయంలో అకాల వర్షాలతో పంటలు దెబ్బతి న్నాయి. పంటలకు చీడపీడలు అధికమయ్యాయి. అయినప్ప టికి చెమటోడ్చి పంటను పండించాడు. ఖర్చులు అధికం కావడంతో పంటనమ్ముకుని వచ్చే నగదుతో అప్పులు తీర్చుకుందామనుకునే సమయంలో దళారులు రంగప్రవేశం చేశారు. తేమశాతం అధికంగా ఉందని, గింజ పాడైందనే కారణాలు చూపుతూ దాదాపు రూ.15వేలు పలికే పుట్టి ధాన్యాన్ని కేవలం రూ.7వేల నుంచి రూ.10వేల లోపు కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వల్ల అసలైన పేద రైతుకు పూర్తిస్థాయిలో ఉపయోగపడలేదు. అదే సమయంలో తిరిగి వర్షాలు కురుస్తాయన్న భయంతోపాటు ధాన్యం దాచుకునేందుకు సరైన వసతులు లేక వచ్చినకాడికి అమ్ముకుని అప్పులపాల య్యాడు. అందరికీ అన్నం పెట్టే అన్నదాత పస్తులు పడుకునే పరిస్థితికి చేరుకున్నాడు. ప్రభుత్వం మాత్రం ఎన్నడూలేని విధంగా జిల్లాలో రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు జరిగింద ని ప్రకటనలు చేస్తూ కాలం గడిపేసింది. అయితే క్షేత్రస్థాయిలో రైతన్నలు అప్పులపాలయ్యారు. ఉద్యాన రైతులు, పూలసాగు రైతులు దాదాపు నూరుశాతం నష్టపోయారు.


రబీ ఆరంభంలోనే ఎదురుదెబ్బ

ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా రబీకి సమాయత్తమ య్యాడు రైతన్న. జిల్లాలో ప్రధాన పంట సీజను కావడంతో పాటు నీరు అందుబాటులో ఉండడంతో సాగుకు సిద్ధమయ్యా డు. అయితే ప్రారంభంలోనే వాతావరణం రైతన్నపై ఆగ్రహం చూపింది. అకాల వర్షాలతో ఎదురుదెబ్బ తగిలింది. అయినప్పటికి తిరిగి సాగుకు సమాయత్తమైతే ఈసారి నివర్‌ తుఫాను రైతులను కోలుకోలేని విధంగా వర్షంతో ముంచెత్తింది. వరినారుతోపాటునాట్లు మొత్తం జలమయమ య్యాయి. వర్షం తగ్గితే పంట తిరిగి చేతికొస్తుందని పంటను రక్షించుకునేందుకు తనకు చేతనైన పనులన్నీ చేపట్టాడు. అయినా వరుణుడు ముందు ఓడిపోయాడు. జిల్లాలో దాదాపుగా 6వేల హెక్టార్లలో పంటనష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. సుమారు రూ.5.2కోట్లమే ర పెట్టుబడి నష్టం అయినట్లు ప్రాధమిక అంచనా.ఈ నేప థ్యంలో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది.

Updated Date - 2020-11-30T05:40:39+05:30 IST