‘పెట్రో’ యోగం ఎన్నాళ్లకో...!

ABN , First Publish Date - 2021-06-15T05:25:11+05:30 IST

కాకినాడ సెజ్‌లో రూ.32 వేల కోట్లతో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు కలగానే మారింది. ఏళ్లు దాటుతున్నా ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. విభజన హామీల్లో భాగంగా సెజ్‌లో ఈ భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించినా ఆ తర్వాత దీనిపై కనీసం కన్నెత్తి చూడడం లేదు. అటు రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా పట్టాలెక్కని ప్రాజెక్టు విషయంలో కనీసం కేంద్రంపై ఒత్తిడి తేలేనే పరిస్థితి. దీంతో సెజ్‌లో

‘పెట్రో’ యోగం ఎన్నాళ్లకో...!

కాకినాడ సెజ్‌లో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు కలేనా?

ఏళ్లు గడుస్తున్నా ఒక్క అడుగూ ముందుకు పడని వైనం

విభజన హామీల్లో భాగంగా రూ.32 వేల కోట్లతో ప్రాజెక్టు ప్రతిపాదన

గత ప్రభుత్వ హయాంలో ఒప్పందం కూడా పూర్తి

తీరా వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ విషయంలో 

ఏళ్ల తరబడి కొనసాగుతున్న వివాదం

ప్రస్తుత ప్రభుత్వం కేంద్రంపై గట్టిగా ఒత్తిడి 

తేలేకపోవడంతో కాగితాలపైనే ప్రాజెక్టు

మరోపక్క ఇప్పటికే చేతులు మారిపోయిన సెజ్‌


కాకినాడ సెజ్‌లో రూ.32 వేల కోట్లతో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు  కలగానే మారింది. ఏళ్లు దాటుతున్నా ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. విభజన హామీల్లో భాగంగా సెజ్‌లో ఈ భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించినా ఆ తర్వాత దీనిపై కనీసం కన్నెత్తి చూడడం లేదు. అటు రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా పట్టాలెక్కని ప్రాజెక్టు విషయంలో కనీసం కేంద్రంపై ఒత్తిడి తేలేనే పరిస్థితి. దీంతో సెజ్‌లో అసలు ఈ ప్రాజెక్టు వస్తుందా? రాదా? అనేది అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. పైగా ఇటీవల సెజ్‌ సైతం ఏకంగా చేతులు మారి అరబిందోకు చిక్కింది. ఈ ప్రాజెక్టు ఏర్పాటుపై కేంద్రం చొరవ తీసుకోవాలని సీఎం జగన్‌ ఇటీవల కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్‌ను కోరిన నేపథ్యంలో త్వరలో ఓ కమిటీ  వేస్తామన్న  కంటితుడుపు హామీ ఇవ్వడంతో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు ఇప్పట్లో అసాధ్యమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఒక్కో జిల్లాకు ఒక్కో హామీ ఇవ్వగా కాకినాడ సెజ్‌లో హెచ్‌పీసీఎల్‌-గెయిల్‌ ద్వారా పెట్రో కాంప్లెక్స్‌ ఏర్పాటుచేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. రూ.30 వేల కోట్ల ఈ ప్రాజెక్టు వస్తే కాకినాడ రూపురేఖలు మారిపోవడంతోపాటు ప్రత్యక్షంగా వెయ్యి మందికి ఉద్యో గాలు వస్తాయని ఆశలు కల్పించారు. అటు ప్రాజెక్టును వేగంగా పట్టాలు ఎక్కించడానికి కాకినాడ           సెజ్‌లో రెండు వేల ఎకరాలను కూడా కేటాయించారు. మట్టి నమూనాలు పరిశీలించి ప్రాజెక్టు ఏర్పా టుకు అనువుగా ఉందని తేల్చారు. దీంతో పనులు వేగంగా మొదలవుతాయని అంతా అనుకున్నారు. తీరా గత టీడీపీ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించడంతో కాకినాడకు ప్రాజెక్టు వేగంగా వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే 2017లో కాకినాడలో పెట్రో కాంప్లెక్స్‌ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌పీసీఎల్‌-గెయిల్‌తో 2017 జనవరిలో విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి. కానీ తర్వాత ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ-టీడీపీకి నడుమ విబేధాలు పొడచూపడంతో రాష్ట్రం- కేంద్రం మధ్య స్నేహపూర్వక వాతావరణం దెబ్బతింది. దీంతో కాకినాడ పెట్రోకాంప్లెక్స్‌ ఏర్పాటుపై దీని ప్రభావం పడింది. ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి కార్పొరేట్‌తోపాటు ఇతర పన్నుల కింద వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కింద రాష్ట్రం కేంద్రం మధ్య మడతపేచి మొదలైంది. ఏటా రూ.975 కోట్లు వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కింద కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాలని అప్పటి సీఎం చంద్రబాబు అనేకసార్లు కేంద్రాన్ని కోరారు. కానీ దీనిపై కేంద్రం నోరుమెదపడం లేదు. దీంతో 2017 నుంచి ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు.


చివరకు ఈ అంశానికి సంబంధించి గతేడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ప్రత్యేక కమిటీ రూపంలో పలు దఫాలుగా చర్చలు జరిపారు. కానీ అవేవీ ఫలించలేదు. మళ్లీ ఏడాది తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మేల్కొని వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కింద ఏడాదికి రూ.975 కోట్ల చొప్పున 15 ఏళ్లపాటు కేంద్రం సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కోరింది. అవసరమైతే ఈ అంశంతో సంబంధం లేకుండా ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలని కోరుతోంది. అయితే కేంద్రమంత్రి నుంచి మాత్రం పెద్దగా స్పందన లేదు. త్వరలో రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్రపెట్రోలియంశాఖ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారంతే. దీంతో వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ అంశం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఫలితంగా కాకినాడసెజ్‌లో పెట్రోకాంప్లెక్స్‌ ఇప్పట్లో రావడం అసాధ్యంగా మారింది. మరోపక్క ప్రాజెక్టు ఏర్పాటుకు అప్పట్లో సిద్ధం చేసిన అంచనాలు ఇప్పుడు భారీగా పెరిగిపోయాయి.

ఇన్ని చిక్కుల మధ్య కాకినాడకు పెట్రోకాంప్లెక్స్‌ యోగం పట్టడం కనుచూపుమేరలో కనిపించడం లేదని పారిశ్రామికరంగం నిపుణులు చెబుతున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడప్పుడు మాత్రమే ఈ పెండింగ్‌ సమస్యను కేంద్రం వద్ద ప్రస్తావిస్తుండడంతో సెజ్‌లో దీని ఏర్పాటు సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోపక్క ఇటీవల కాకినాడ సెజ్‌ సైతం చేతులు మారిపోయి అరబిందో పర మైంది. దీంతో పాతసెజ్‌లో ప్రతిపాదనలకు ఇప్పడు మోక్షం కలుగుతాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇదేకాదు కాకినాడలో విభజన హామీల్లో భాగంగా ఐఐ ఎఫ్‌టీ, ఐఐపీ ఏర్పాటుకు కూడా అప్పట్లో కేంద్రం ముందుకు వచ్చింది. ఈ రెండు విద్యాసంస్థలకు కాకినాడ సెజ్‌లో భూములు కూడా కేటాయించారు. కానీ అవీ ఖాళీగా వెక్కిరిస్తున్నాయి. అటు పెట్రోకాంప్లెక్స్‌పై అడుగులు పడక, ఇటు ఉన్నత విద్యా సంస్థలు రాక కాకినాడ అభివృద్ధి కాగితాలపై వెక్కిరిస్తోంది.

Updated Date - 2021-06-15T05:25:11+05:30 IST