పండుగ సందట్టో కాకానికుంట కబ్జా

ABN , First Publish Date - 2021-01-14T05:48:56+05:30 IST

అద్దంకి పట్టణానికి అత్యంత సమీపంలో ఉన్న కాకానికుంట పరాధీనమయ్యేందుకు రంగం సిద్ధమైంది.

పండుగ సందట్టో  కాకానికుంట కబ్జా
చెట్లను తొలిగిస్తున్న ఎక్స్‌కవేటర్‌



హైకోర్టులో స్టే కొనసాగుతున్నా ఎక్స్‌కవేటర్‌తో పనులు 

సంక్రాంతి, కోర్టు సెలవులతో రంగంలోకి ఆక్రమణదారులు

ముందస్తు సమాచారం ఇచ్చినా పట్టించుకోని అధికారులు

పరాధీనం కానున్న 20ఎకరాలు

రూ.53లక్షల నాడు-నేడు నిధులతో అభివృద్ధి

కట్టపై రూ.10లక్షల నగర 

పంచాయతీ నిధులతో వాకింగ్‌ ట్రాక్‌

ఆక్రమణతో అంతా బూడిదలో పోసిన పన్నీరే

అద్దంకి, జనవరి 13 : అద్దంకి పట్టణానికి అత్యంత సమీపంలో ఉన్న కాకానికుంట పరాధీనమయ్యేందుకు రంగం సిద్ధమైంది. హైకోర్టులో స్టే కొనసాగుతున్నా పట్టించుకోకుండా స్వాధీనం చేసుకునేందుకు కొందరు సిద్ధమయ్యారు. ఉత్తర అద్దంకి రెవెన్యూ పరిధిలోని 955 సర్వే నెంబరులో 20.25 ఎకరాల్లో కాకానికుంట ఉంది. నాలుగు దశాబ్దాల క్రితం నంబూరిపాలెంలోని ఎస్సీ కుటుంబాలకు ఏక్‌సాల్‌ లీజు ద్వారా సాగుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అనంతరం అది చిట్టడవిని తలపించేలా మారింది. ఈక్రమంలో దశాబ్దకాలంగా కాకానిపాలెం రైతులు, నంబూరిపాలెం ఎస్సీల మధ్య కాకానికుంట వివాదం సాగుతోంది. 2015లో కాకానికుంటను నీరు- చెట్టు పథకం ద్వారా రూ.53లక్షలతో పూడికతీత చేపట్టి అభివృద్ధి చేశారు. పలుసార్లు అద్దంకి మేజర్‌ ద్వారా సాగర్‌ నీటితో నింపడంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగేందుకు దోహదపడింది. ప్రస్తుతం పట్టణం అభివృద్ధి చెందుతున్న క్రమంలో కాకానికుంట వరకు ఇళ్లనిర్మాణం జరగటంతో పరిసరప్రాంతాల్లో ప్లాట్లు వేశారు. ఈనేపథ్యంలో నగరపంచాయతీ  ఆధ్వర్యంలో కాకానికుంట కట్టపై చుట్టూ గ్రావెల్‌ తోలి వాకింగ్‌ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గీయులు హైకోర్టును ఆశ్రయించటంతో యథాతథస్థితి కొనసాగించేలా  స్టేటస్‌కో ఇచ్చింది. ఇటీవల కాకానికుంటలో ఎక్స్‌కవేటర్‌తో చిల్లచెట్ల తొలగింపునకు ఉపక్రమించగా కాకానిపాలెం రైతులు రెవెన్యూ, పోలీస్‌ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పనులు నిలిపివేశారు. బుధవారం నుంచి మరలా చిల్లచెట్ల తొలగింపు ప్రారంభించారు. ఇప్పటికే కొంత భూమిని చదును చేశాని, మిగిలిన దాంట్లో చెట్లను  తొలగిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈవిషయమై మంగళవారం తహసీల్దార్‌కు కూడా ఫిర్యాదుచేసినట్లు  రైతులు తెలిపారు. సంక్రాంతి సెలవులు, కోర్టులకు సెలవులు రావడంతో యంత్రాల ద్వారా కుంటను స్వాధీనపర్చుకునేందుకు ఆక్రమణదారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారని రైతులు అంటున్నారు. చెరువు ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టించుకోకుండా మిన్నకున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని తహసీల్దార్‌ ప్రభాకరరావు దృష్టికి తీసుకుపోగా కాకానికుంటన పరిశీలించి ఆక్రమణ జరురుగుతుంటే వెంటనే పనులను నిలిపివేయిస్తానని తెలిపారు. 




Updated Date - 2021-01-14T05:48:56+05:30 IST