మద్యమేవ జయతే..!

ABN , First Publish Date - 2020-09-27T12:39:18+05:30 IST

మద్యం ధరలు అమాంతం పెంచి అందుబాటులో లేకుండా చేసి నిషా బలహీనత నుంచి మద్యం ప్రియులను బయట పడేస్తాం.. దశలవారీ చర్యలతో ఐదేళ్లలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లోకి తెస్తామని సీఎం జగన్‌ నుంచి

మద్యమేవ జయతే..!

 పాత విధానంతో మద్యం కొత్తపాలసీ

 జిల్లాలో 173 షాపులు కొనసాగింప

 ఇప్పటికే తెరుచుకున్న 26 బార్లు

 అదనంగా రానున్న వాక్‌ ఇన్‌ షాప్స్‌

తూచ్‌..దిశగా సంపూర్ణ మద్యపాన నిషేధం


కడప (సిటి), సెప్టెంబరు 26: మద్యం ధరలు అమాంతం పెంచి అందుబాటులో లేకుండా చేసి నిషా బలహీనత నుంచి మద్యం ప్రియులను బయట పడేస్తాం.. దశలవారీ చర్యలతో ఐదేళ్లలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లోకి తెస్తామని సీఎం జగన్‌ నుంచి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఊదరగొట్టిన ఉపన్యాసాలు అటకెక్కాయి. ధరలు పెంచడంలో విజ యవంతమైన సర్కారు దుకాణాలను తగ్గించడంలో వెనుకడుగు వేసింది.


పాత విధానాన్నే అమలు చేస్తూ కొత్త పాలసీని వెలువరించింది. ఇప్పటికే బార్లకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో బార్లా తెరు చుకున్నాయి. దీంతో జిల్లాలో 173 మద్యం దుకాణాలు కొనసాగనుండగా 26 బార్లలో వ్యాపారాలు మొదలయ్యాయి. మరో అడుగు ముందుకు వేసి ‘వాక్‌ ఇన్‌ షాపు’ పేరుతో విలాస వంతమైన మద్యం మాల్స్‌ ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అంటే.. మద్య పాన నిషేధంపై తూచ్‌ చెప్పనుందా అన్న సందేహాలు వెలువెత్తనున్నాయి.


మద్యం ఆదాయం లేకుండానే సుపరిపాలన అందిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రజలకు భరోసా ఇచ్చారు. బెల్టుషాపులు లేకుండా చేసి ఏపీ బ్రేవరీస్‌ కార్పొరే షన్‌ లిమిటెడ్‌ (ఏపీబీసీఎల్‌) ద్వారా దుకాణాలు నిర్వహిస్తూ సంవత్సరానికి 20 శాతం చొప్పున తగ్గిస్తూ వస్తామని చెప్పుకొచ్చారు. ఐదేళ్లలో మద్యం దుకాణాలు లేకుండా చేస్తామని స్పష్టం చేశారు.


అందులో భాగంగా జగన్‌ సర్కారు మద్యం తొలి ఆర్థిక సంవత్సరం 2019-20కి సంబంధించి గత సంవత్సరం అక్టోబరు 1 నుంచి మొదలైంది. చెప్పినట్లుగానే 20 శాతం దుకాణాలకు కోత పెట్టింది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఈ సంవత్సరం మే 9న 13 శాతం దుకాణాలను తగ్గిస్తూ అమ్మకాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నెల 30వ తేదీ గత పాలసీ ముగియనుంది. కొత్తపాలసీని ప్రకటించారు. అయితే మిగిలిపోయిన 7 శాతం దుకాణాల తొలగింపు అంశాన్ని పక్కనబెట్టేశారు. ఇదిలా ఉంటే పది శాతం ధరలు పెంచి బార్లకు వారం క్రితమే అనుమతిం చింది. అంటే.. మద్యం వ్యాపారం తగ్గకూడదన్న ప్రభుత్వ ఆలోచన స్పష్టమైంది.


జిల్లాలో 173 దుకాణాలు.. 26 బార్లు

జగన్‌ సర్కారు ఏర్పడక ముందు జిల్లాలో 256 మద్యం దుకాణాలు ఉండేవి. రెండు సార్లు దుకాణాలు కుదించడంతో 173కు చేరుకున్నాయి. కొత్త పాలసీ నిబంధనల మేర ఆ దుకా ణాలన్నీ యదావిధిగా కొనసాగనున్నాయి. జిల్లాలో ఉన్న 30 బార్లకు ఈ సంవత్సరం జూన్‌ నెలతో రెండో ఆర్థిక సంవత్సరం పూర్తయింది. అయితే కరోనా లాక్‌డౌన్‌ కారణంగా 5 శాతం కూడా రెన్యువల్‌ కాలేదు. వారం క్రితం బార్లకు అనుమతివ్వడంతో 24 బార్లు, 2 హరిత రెస్టారెంట్లలోని బార్లు, మొత్తం 26 తెరుచుకున్నాయి.


ప్రజల ముంగిట మద్యం మాల్స్‌

దుకాణాలు, బార్ల పరిస్థితి అలా ఉంటే, ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వాక్‌ ఇన్‌ షాప్స్‌ పేరుతో మద్యంమాల్స్‌ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. విలాసవంతమైన భవ నంలో ఉండే ఈ మాల్స్‌లో అన్ని బ్రాండ్ల మద్యం అందుబాటులో ఉంటుంది. అంటే.. ధరలతో సంబంధం లేకుండా ఏదైనా దొరుకుతుందన్న మాట.


ఇలాంటి మాల్స్‌ జిల్లాలో 5 వరకు ఏర్పాటయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి ఏ వైపు చూసినా మద్యం అందుబాటులో ఉండేలా వ్యూహ రచన దాగి ఉందని చెప్పుకొస్తున్నారు. రాష్ట్రంలో మద్యమేవ జయతే సంపూర్ణంగా అమలవుతోంది. 

Updated Date - 2020-09-27T12:39:18+05:30 IST