ఎలా బతకాలి..?

ABN , First Publish Date - 2022-01-29T05:45:06+05:30 IST

‘‘అకస్మాత్తుగా ఉన్నట్టుండి జూట్‌ మిల్లు మూసి వేస్తే మేము, మా కుటుంబాలు ఎలా బతకాలి ? మూడు తరాలుగా ఈ జూట్‌ మిల్లునే నమ్ముకుని బతుకు తున్నాం.

ఎలా బతకాలి..?

జూట్‌ కార్మికుల ఆవేదన

మూసివేస్తే మనుగడ కష్టం


ఏలూరు టూటౌన్‌, జనవరి 28 : ‘‘అకస్మాత్తుగా ఉన్నట్టుండి జూట్‌ మిల్లు మూసి వేస్తే మేము, మా కుటుంబాలు ఎలా బతకాలి ? మూడు తరాలుగా  ఈ జూట్‌ మిల్లునే నమ్ముకుని బతుకు తున్నాం. వేరే పనులు, వృత్తులు చేతకావు. మేము చేయగలిగిందల్లా ఈ పని ఒక్కటే. యాజమాన్యం ఇచ్చే అరకొర జీతాలతో కుటుంబాలను నెట్టుకొ స్తున్నాం. ఆస్తులు ఏమీ సంపాదించ లేదు. ఇప్పుడు ఈ పని కూడా లేకపోతే భార్య, పిల్లలను ఎలా బతికించుకోవాలి..’’ అంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకృష్ణా జూట్‌మిల్లు 118 సంవత్సరాల నుంచి ఏలూరు వాసులకు అండగా నిలబడింది. ముడి సరుకైన జూట్‌ నార ధర పెరిగినందువల్ల నష్టాలు వస్తున్నాయని యాజమాన్యం చెప్పడం పూర్తి అవాస్తవం. కార్మికుల జీతాల కన్నా కార్మి కేతర జీతాలను ఎక్కువగా చూపిస్తూ తప్పుడు లెక్కలతో నష్టాలు వస్తున్నాయని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధి కారులు కలుగజేసుకుని జూట్‌మిల్లు తెరిపించే ప్రయత్నం చేయాలి. ప్రైవేటు యాజమాన్యం నిర్వహించలేకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని జూట్‌మిల్లును నడపాలంటూ కార్మికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

శ్రమదోపిడీ చేశారు : వేగి ప్రసాద్‌, టీఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు

జూట్‌ మిల్లు యాజమాన్యం కార్మికుల శ్రమను దోపిడీ చేశారు. 30, 40 సంవత్సరాలు మిల్లులో పనిచేసిన తరువాత ఇప్పుడు బయటకు వెళ్లి కార్మికులు ఎలా బతుకుతారు. జీవితాంతం వారి శ్రమను దోచుకుని ఇప్పుడు మిల్లును మూసి వేస్తామనడం దారుణం. కార్మిక కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు జోక్యం చేసుకుని జూట్‌మిల్లు తెరిపించే ప్రయత్నాలు చేయాలి. కార్మిక సంఘాలన్నింటినీ ఏకం చేసి జూట్‌మిల్లు తెరిపించేందుకు మా వంతు కృషి చేస్తాం.


30 ఏళ్లుగా పనిచేస్తున్నా 

సీహెచ్‌ దుర్గారావు, కార్మికుడు

30 ఏళ్ళుగా జూట్‌మిల్లులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఇప్పుడు అకస్మాత్తుగా మిల్లు మూతపడుతుందంటే దిక్కుతోచడంలేదు. నా వయస్సు అయిపోయిన తరువాత ఎవరూ పనిలో పెట్టుకోరు. జూట్‌మిల్లు తెరిచేలా చర్యలు తీసుకోవాలి.


ఏం పనిచేసుకుని బతకాలి 

పి.సిద్ధార్ధ, కార్మికుడు

మా తండ్రి జూట్‌మిల్లులోనే పనిచేశారు. మా అన్న దమ్ములం ఈ మిల్లులోనే పని చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నట్టుండి మూసివేస్తే ఏం పనిచేసుకుని బతకాలి. ఇప్పుడు మాకు ఎవరు ఉద్యోగాలు ఇస్తారు.  ప్రభుత్వం మిల్లును తెరిపించే చర్యలు చేపట్టాలి.


ప్రభుత్వమే నడపాలి 

శ్రీనివాస్‌, కార్మికుడు

ప్రైవేటు యాజమాన్యానికి జూట్‌మిల్లు నడపడం కుదరకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. వేలాది మంది ఉపాధి కోల్పోకుండా చర్యలు చేపట్టాలి. జూట్‌మిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకపోతే వేలాది కుటుంబాలు పస్తులతో ఉండాల్సిన పరిస్థితి.


Updated Date - 2022-01-29T05:45:06+05:30 IST