చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ

ABN , First Publish Date - 2021-04-25T08:07:40+05:30 IST

తెలుగు నాట పుట్టి, న్యాయవాదిగా ఎదిగి, న్యాయమూర్తిగా వెలుగుతున్న జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో అతి నిరాడంబరంగా, అతికొద్దిమంది ముఖ్య అతిథుల సమక్షంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌... జస్టిస్‌ ఎన్వీ రమణతో ప్రమాణ స్వీకారం చేయించారు...

చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ

  • సర్వోన్నత న్యాయపీఠంపై తెలుగు తేజం.. 
  • 48వ చీఫ్‌ జస్టి్‌సగా ప్రమాణ స్వీకారం
  • ఆ వెంటనే బాధ్యతల స్వీకరణ


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): తెలుగు నాట పుట్టి, న్యాయవాదిగా ఎదిగి, న్యాయమూర్తిగా వెలుగుతున్న జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో అతి నిరాడంబరంగా, అతికొద్దిమంది ముఖ్య అతిథుల సమక్షంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌... జస్టిస్‌ ఎన్వీ రమణతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ బిర్లా, న్యాయ శాఖా మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, పలువురు న్యాయమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శనివారం ఉదయం సరిగ్గా 11 గంటలకు ఈ కార్యక్రమం మొదలైంది. తొలుత జాతీయ గీతం వినిపించారు. ఆ తర్వాత... రాష్ట్రపతి అనుమతితో ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. జస్టిస్‌ రమణ దేవుడి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం... అధికారిక రిజిస్టర్‌లో సంతకం చేశారు. దీంతో 55 సంవత్సరాల తర్వాత... మరోసారి ఒక తెలుగు తేజం సర్వోన్నత న్యాయపీఠాన్ని అధిష్టించినట్లయింది. భారత దేశ 48వ ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్‌ రమణ... రాష్ట్రపతికి, ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులందరికీ చేతులు జోడించి నమస్కరించారు. రాష్ట్రపతి ఆయనకు అభినందనలు తెలిపారు. విజయవంతంగా విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఆ వెంటనే మరోమారు జాతీయ గీతాలాపనతో ఈ అధికారిక కార్యక్రమం ముగిసింది. కరోనా నేపథ్యంలో అత్యంత నిరాడంబరంగా నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవం... ఆరు నిమిషాల్లోపే ముగిసింది. ఈ కార్యక్రమానికి జస్టిస్‌ రమణ కుటుంబ సభ్యులు భార్య శివమాల, కూతుళ్లు తనూజ, భువన, అల్లుళ్లు త్రిలోక్‌, రితేశ్‌ కూడా హాజరయ్యారు.  


మొదటి రోజే పని.. 

ప్రమాణ స్వీకారం కాగానే ఆయన నేరుగా కుటుంబ సభ్యులతో సుప్రీంకోర్టులో తన చాంబర్‌కు వెళ్లి పదవీ బాధ్యతలు చేపట్టారు. అందుబాటులో ఉన్న అధికారులతో కొవిడ్‌ పరిస్థితులపై చర్చించారు. ఆ తర్వాత ఏడుగురు సీనియర్‌ న్యాయమూర్తులతో కూడిన కమిటీతో సమావేశమై భవిష్యత్తులో కోర్టు కార్యకలాపాల నిర్వహణ గురించి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌, జస్టిస్‌ యుయు లలిత్‌, జస్టిస్‌ ఎఎం ఖాన్‌విల్కర్‌,  జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భాను, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు పాల్గొన్నారు.  ఆదివారం సాయంత్రం 4 గంటలకు మరోమారు భేటీ కావాలని నిర్ణయించారు.


కృష్ణా జిల్లాలో పుట్టి... 

ఎన్వీ రమణ 1957 ఆగస్టు 27వ తేదీన కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలో జన్మించారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన యాదృచ్ఛికంగానే న్యాయవాద విద్యను అభ్యసించి... న్యాయవాదిగా, ఆ తర్వాత న్యాయమూర్తిగా ఎదిగారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా దాదాపు 13 సంవత్సరాలు పని చేశారు. గత ఏడేళ్లుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. జస్టిస్‌ బోబ్డే పదవీ విరమణ అనంతరం... అత్యంత సీనియర్‌ అయిన జస్టిస్‌ రమణకు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం లభించింది. ఆయన వచ్చే ఏడాది ఆగస్టు 26వ తేదీ వరకు సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టి్‌సగా వ్యవహరిస్తారు. అత్యున్నత  న్యాయపీఠం అధిష్టించే క్రమంలో ఆయన పలు అడ్డంకులను అధిగమించాల్సి వచ్చింది.


ఆశీర్వచనాల తర్వాతే..

రాష్ట్రపతి భవన్‌కు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బయలుదేరే ముందు జస్టిస్‌ రమణకు తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం దైవస్థానం పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు పలికారు. జస్టిస్‌ రమణ దంపతులు గోపూజ కూడా చేశారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌ రెడ్డి, డాలర్‌ శేషాద్రితోపాటు అర్చకులు జస్టిస్‌ రమణను కలుసుకున్నారు. అంజనాద్రిపై ఆంజనేయుడి జన్మస్థానానికి సంబంధించిన ఆధారాలను వారు జస్టిస్‌ రమణకు సమర్పించారు.




సొంతూరిలో అంబరాన్నంటిన సంబరాలు

సుప్రీం కోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ సొంతూరు కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరంలో సంబరాలు అంబరాన్నంటాయి. శనివారం సీజేఐగా ఆయన ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని గ్రామంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద బంధువులు, గ్రామస్తులు కేక్‌ కట్‌ చేశారు. బాణసంచా కాల్చారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. సీజేఐగా నియమితులైన జస్టిస్‌ ఎన్‌వీ రమణకు ఆంధ్రప్రదేశ్‌ విశ్రాంత న్యాయమూర్తుల సంఘం అభినందనలు తెలిపింది. ప్రజల ముంగిట సత్వర న్యాయం, ఉచిత న్యాయ సహాయం, సరళమైన భాషలో చట్టాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా కృషిచేయాలని సంఘం ప్రధాన కార్యదర్శి మోర్త రామదాసు పేర్కొన్నారు. ఒంగోలు న్యాయవాదులు జిల్లా కోర్టు వద్ద జస్టిస్‌ రమణ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు హరి తాడోజు పెన్సిల్‌తో జస్టిస్‌ రమణ చిత్రాన్ని రూపొందించి శుభాకాంక్షలు తెలిపారు. 


Updated Date - 2021-04-25T08:07:40+05:30 IST