అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రానికి జస్టిస్‌ లావు నేతృత్వం!

ABN , First Publish Date - 2022-05-21T08:28:21+05:30 IST

హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రానికి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నేతృత్వం వహించనున్నారు.

అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రానికి జస్టిస్‌ లావు నేతృత్వం!

జూన్‌ 7న జస్టిస్‌ నాగేశ్వరరావు పదవీ విరమణ.. చివరిసారి ధర్మాసనంలో కూర్చున్న న్యాయమూర్తి’

కనీసం 7-8 ఏళ్లు పనిచేసే అవకాశం ఉండాలి: జస్టిస్‌ నాగేశ్వరరావు

న్యూఢిల్లీ, మే 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రానికి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నేతృత్వం వహించనున్నారు. జూన్‌ 7న ఆయన సుప్రీం న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందనున్నారు. అనంతరం మధ్యవర్తిత్వ కేంద్రం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. జస్టిస్‌ నాగేశ్వరరావు గౌరవార్థం సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ శుక్రవారం  వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమణ మాట్లాడుతూ.. న్యాయమూర్తిగా జస్టిస్‌ లావు నాగేశ్వరరావు అనేక చరిత్రాత్మక తీర్పులు వెలువరించారని అన్నారు. రాజ్యాంగ చట్టాల్ని, న్యాయసూత్రాల్ని విశ్లేషించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. న్యాయవ్యవస్థలో అంచెలంచెలుగా ఆయన ఎదిగిన తీరు న్యాయవాదులకు, న్యాయమూర్తులకు ఆదర్శమని చెప్పారు. అసాధారణ ప్రతిభ వల్లే జస్టిస్‌ నాగేశ్వరరావు జాతీయస్థాయిలో గుర్తింపు పొందారన్నారు. తన మాదిరే ఆయన రైతు కుటుంబంలో జన్మించారని తెలిపారు. విజయవాడ బార్‌ అసోసియేషన్‌లో ఒకేసారి కెరీర్‌ ప్రారంభించామన్నారు. జస్టిస్‌ నాగేశ్వరరావు గుంటూరు జిల్లా కోర్టు నుంచి ప్రాక్టీసు మొదలుపెట్టి... క్రమంగా ఏపీ హైకో ర్టు, సుప్రీంకోర్టుల్లో ప్రాక్టీసు చేశారని తెలిపారు. రెండుసార్లు అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా అనేక ముఖ్యమైన కేసుల్లో వాదించారని గుర్తుచేశారు. దేశంలో ప్రతి ముఖ్యమైన కేసులోనూ ఆయన వాదించారని, బీసీసీఐ అవినీతిపై ఏర్పాటుచేసిన ముద్గల్‌ కమిటీలో ఆయన ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా జస్టిస్‌ నాగేశ్వరరావు ఇచ్చిన అనేక ముఖ్యమైన తీర్పులను జస్టిస్‌ రమణ గుర్తుచేశారు. జస్టిస్‌ నాగేశ్వరరావు రంజీ ట్రోఫీ క్రికెటర్‌ అని, మంచి గోల్ఫ్‌ క్రీడాకారుడనీ వెల్లడించారు. ‘‘ఈరోజు చాలా భావోద్వేగం నిండిన రోజు. త్వరలోనే నేను కూడా రిటైర్‌ కాబోతున్నాను. మేమిద్దరం కలిసి ఒకేచోట కెరీర్‌ ప్రారంభించాం. ఆయన నాకు చాలా అండగా ఉన్నారు’’ అని జస్టిస్‌ రమణ అన్నారు. పదవీ విరమణ తర్వాత జస్టిస్‌ నాగేశ్వరరావు హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రానికి నాయకత్వం వహించనున్నార ని జస్టిస్‌ రమణ సూచనప్రాయంగా చెప్పారు.  కాగా.. పదవీ విరమణ అనంతరం జస్టిస్‌ నాగేశ్వరరావు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రానికి నాయకత్వం వహిస్తారని బార్‌ అండ్‌ బెంచ్‌ వెబ్‌సైట్‌ స్పష్టంచేసింది.


శక్తిమంతమైన తీర్పులిచ్చారు: ఏజీ

అత్యంత శక్తిమంతమైన తీర్పులు ఇచ్చే జస్టిస్‌ లావు నాగేశ్వరరావు వంటి న్యాయమూర్తిని కోర్టు కోల్పోతుందని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ అన్నారు. రాజీవ్‌ గాంధీ హత్య కేసులో నిందితుడైన పెరరివాలన్‌ను విడుదల చేస్తూ జస్టిస్‌ నాగేశ్వరరావు ఇచ్చిన తీర్పు ఆయన కెరీర్‌లోనే తలమానికమని ప్రశంసించారు. బాగా డబ్బు గడించే ప్రాక్టీసును వదిలిపెట్టి ఆయన న్యాయమూర్తి అయ్యారని గుర్తుచేశారు. జస్టిస్‌ నాగేశ్వరావు మానవీయ విలువలున్న మంచి మనిషి అని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ప్రశంసించారు. కాగా.. జస్టిస్‌ నాగేశ్వరరావు న్యాయవాద వృత్తిలోకి రాకముందు కానూన్‌ అప్నా అప్నా అనే హిందీ సినిమాలో ఖాదర్‌ఖాన్‌తో కలిసి నటించారని బార్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రదీప్‌ రాయ్‌ చెప్పారు. 


న్యాయమూర్తులకూ ఒత్తిడి ఉంటుంది: జస్టిస్‌ నాగేశ్వరరావు

తనకు అవకాశం ఇస్తే చివరి వర కూ న్యాయవాదిగానే పనిచేయాలని అనుకుంటున్నానని జస్టిస్‌ నాగేశ్వరరావు అన్నారు. తనకు న్యాయమూర్తిగా తొలిసారి అవకాశం వచ్చినప్పుడు తిరస్కరించానని, కానీ ఆ తర్వాత మళ్లీ అవకాశం వచ్చినప్పుడు కాదనలేకపోయానని చెప్పారు. ఒక హిందీ సినిమాలో తాను చిన్న పాత్రలో నటించిన మాట నిజమేనని, అయితే నటన అనేది న్యాయవాదులు, న్యాయమూర్తుల వృత్తిలో కూడా భాగమని ఆయన చమత్కరించారు. న్యాయమూర్తిగా అలవాటు పడేందుకు రెండు మూడేళ్లు పడుతుందని, అంతలోనే రిటైర్‌మెంట్‌ వస్తుందని జస్టిస్‌ నాగేశ్వరరావు అన్నారు. న్యాయమూర్తికి కనీసం 7-8 సంవత్సరాలు పనిచేసే అవకాశం ఉండాలని, అప్పుడే ఉత్తమ న్యాయమూర్తిగా గుర్తింపు పొందగలరని అభిప్రాయపడ్డారు. ‘‘22 ఏళ్లుగా బార్‌ అసోసియేషన్‌లో ఉన్నాను. మీ అందరి ప్రేమాభిమానాలతో కెరీర్‌ సాఫీగా సాగింది. అందరికీ ఽకృతజ్ఞతలు. కోర్టులో న్యాయమూర్తిగా కొన్ని సందర్భాల్లో లాయర్లపై కోప్పడి బాధ కలిగించి ఉండొచ్చు. దానికి క్షమాపణలు కోరుకుంటున్నాను. కోర్టుకు వచ్చే ఇద్దరిలో ఒకరికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. మన నిర్ణయంతో ఇద్దరిలో ఒకరు అసంతృప్తి చెందుతారు. మన వృత్తి స్వభావం అలాంటిది. న్యాయమూర్తులకూ ఒత్తిడి ఉంటుంది. దయతో అర్థం చేసుకోగలరు’’ అని సహచరులను ఉద్దేశించి జస్టిస్‌ నాగేశ్వరరావు అన్నారు. కాగా... శుక్రవారం జస్టిస్‌ రమణ, జస్టిస్‌ హిమా కోహ్లిలతో కలిసి ఆయన లాంఛనంగా బెంచ్‌లో చివరిసారి న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

Updated Date - 2022-05-21T08:28:21+05:30 IST