మరో రెండు రోజులే...

ABN , First Publish Date - 2022-06-16T04:18:41+05:30 IST

మరో రెండు రోజులే...

మరో రెండు రోజులే...


  •   సమీపిస్తున్న ధాన్యం సేకరణ గడువు
  •  లక్ష్యం 80 వేల మెట్రిక్‌ టన్నులు 
  •  60,251 మెట్రిక్‌ టన్నుల సేకరణ
  •  ధాన్యం బకాయిలు 103.53 కోట్లు

వికారాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : వికారాబాద్‌ జిల్లాలో మరో  రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు ముగియనున్నాయి. ధాన్యం సేకరణ తగ్గడంతో ఇప్పటికే చాలా వరకు ఽకొనుగోలు కేంద్రాలు మూసివేశారు. పౌరసరఫరాల శాఖ నిర్దేశించుకుకున్న లక్ష్యం మేరకు జిల్లాలో ధాన్యం సేకరణ కొనసాగలేదు. ఇప్పటికే ధాన్యం రాక తగ్గిన నేపథ్యంలో మరోరెండు  రోజుల వరకే కొనుగోలు చేయాలని నిర్ణయించారు. మరో ఐదారు వేల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం ఽసేకరణకు అవకాశం ఉంది. యాసంగిలో జిల్లాలో 45 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఈసారి 80 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌, మార్కెట్‌ కమిటీలు, ఎఫ్‌పీవోల ఆధ్వర్యంలో 112 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా 108 కేంద్రాల్లో ప్రారంభించారు. మిగతా నాలుగు కేంద్రాలకు రైతులు తీసుకు వచ్చే ధాన్యాన్ని సమీపంలో ఉన్న కేంద్రాలకు అనుసంధానం చేశారు. జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యం 80 వేల మెట్రిక్‌ టన్నులు ఉండగా, మంగళవారం వరకు 12,319 మంది రైతుల నుంచి 60,251 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించగలిగారు. జిల్లాలో ధాన్యం సేకరణ మరో రెండు రోజుల్లో 10 వేల మెట్రిక్‌ టన్నులు సేకరణ లక్ష్యంతో ఆ శాఖ అధికారులు ఉన్నారు. 

  • ధాన్యం డబ్బుల కోసం ఎదురుచూపులు

జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 12,319 మంది రైతులు 60,251 మెట్రిక్‌ టన్నులు ధాన్యం విక్రయించారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యానికి సంబంధించి రైతులకు రూ.118.09 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 1700 మంది రైతుల ఖాతాల్లో 14.91 కోట్లు మాత్రమే జమ చేశారు. ఇంకా 10,619 మంది రైతులకు రూ.103.18 కోట్లు చెల్లించాల్సి ఉంది. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా... ఆ విధంగా జరగడం లేదు. తమకు రావాల్సిన ధాన్యం బకాయిల కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు.  

Updated Date - 2022-06-16T04:18:41+05:30 IST