దాతృత్వానికి కేరాఫ్.. రోజుకు 700 మంది ఆకలి తీరుస్తున్న స్కూల్

ABN , First Publish Date - 2020-04-10T23:54:58+05:30 IST

కరోనా వైరస్ కారణంగా అష్టకష్టాలు పడుతున్న వేళ ముంబై జుహు ప్రాంతంలోని ఓ పాఠశాల అన్నార్తుల పాలిట

దాతృత్వానికి కేరాఫ్.. రోజుకు 700 మంది ఆకలి తీరుస్తున్న స్కూల్

ముంబై: కరోనా వైరస్ కారణంగా ప్రజలు అష్టకష్టాలు పడుతున్న వేళ ముంబై జుహు ప్రాంతంలోని ఓ పాఠశాల అన్నార్తుల పాలిట ఆశాదీపంగా మారింది. నగరంలోని పేదలు, ఓల్డేజ్ హోం‌లు, బిచ్చగాళ్లు, అనాథలు, ట్రాన్స్‌జెండర్ల ఆకలి తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. రోజుకు ఏకంగా 700 మంది క్షుద్బాధ తీరుస్తున్న ఆ స్కూలు పేరు జమునాబాయ్ నర్సీ స్కూలు. దీనిని నర్సీ మొంజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. స్కూలు పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ (పీటీఏ) భాగస్వామ్యంతో గత నెల 31 నుంచి ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 6 వేల మంది ఆకలి తీర్చింది. 


తమ స్కూల్లోని కిచెన్‌లోనే వంటలు చేస్తున్నామని, తమ ఇంట్లోని వంటవాళ్లే వండుతున్నారని స్కూలు ట్రస్టీ జైరాజ్ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆహారాన్ని పంపిణీ చేయడంలో సరఫరా చేయడంలో సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. 


దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కుక్‌లు తమ స్కూల్లో పనిచేస్తున్నారని, లాక్‌డౌన్ నేపథ్యంలో వారు స్వగ్రామలకు వెళ్లే వీలు లేకపోయిందని స్కూలు వైస్ చైర్మన్ మనాన్ దోషి తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అనుకున్నామని పేర్కొన్నారు. వృద్ధాశ్రమాలు తదితర వాటిలో పనిచేసే కుక్‌లు వారి ఇళ్లకు వెళ్లిపోవడంతో తమ కుక్‌లను అక్కడికి పంపించామని వివరించారు.  విద్యార్థుల తల్లిదండ్రులు వారి స్థోమతను బట్టి మాస్కులు, కుకీలు, ఇతర అత్యవసర వస్తువులను పంపిణీ చేస్తున్నారని ఆయన తెలిపారు. సామాజిక దూరంపై అవగాహన పెంచేలా తమ స్కూలు లోగోను కూడా రీ డిజైన్ చేసినట్టు జైరాజ్ వివరించారు. 

Updated Date - 2020-04-10T23:54:58+05:30 IST