ప్రముఖ నేత హత్య కేసు విచారణ... ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్న జడ్జి...

ABN , First Publish Date - 2021-02-23T21:07:25+05:30 IST

కాంగ్రెస్ నేత దేవేంద్ర చౌరాసియా హత్య కేసుపై విచారణ జరుపుతున్న

ప్రముఖ నేత హత్య కేసు విచారణ... ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్న జడ్జి...

భోపాల్ : కాంగ్రెస్ నేత దేవేంద్ర చౌరాసియా హత్య కేసుపై విచారణ జరుపుతున్న జడ్జి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తనపై దామోహ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్, ఇతర పోలీసులు మితిమీరిన ఒత్తిడి తెస్తున్నారని వాపోతున్నారు. తనకు జరగరానిదేమైనా జరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు.


దామోహ్ జిల్లాలోని హట్టా అదనపు జిల్లా జడ్జి (ఏడీజే-2) ఆర్‌పీ సోన్‌కర్ ఇటీవల రాసిన ఆర్డర్‌లో, తనను అపఖ్యాతిపాలు చేయడానికి పోలీసులు నిందితులతో కలిసి కుట్ర పన్నుతున్నట్లు తెలిపారు. పోలీసు సూపరింటెండెంట్ ఆయన సబార్డినేట్లతో కుమ్మక్కయి తనపై తీవ్రమైన నేరారోపణలను మోపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ హత్య కేసు విచారణను వేరొక న్యాయస్థానానికి బదిలీ చేయాలని కోరారు. ఈ మేరకు దామోహ్ జిల్లా, సెషన్ జడ్జికి కూడా లేఖ రాశారు. 


మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ నేత దేవేంద్ర చౌరాసియా 2019 మార్చి 15న హత్యకు గురయ్యారు. ఆయన బీఎస్‌పీని వదిలిపెట్టి, కాంగ్రెస్‌లో చేరినందుకు ఈ దారుణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.  ఈ కేసులో బీఎస్‌పీ ఎమ్మెల్యే రాంబాయ్ ఠాకూర్ భర్త గోవింద్ సింగ్, వారి సన్నిహిత బంధువులు నిందితులు. కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ గోవింద్ సింగ్‌కు జారీ చేసిన అరెస్టు వారంట్ అమలు కోసం తీసుకున్న చర్యలకు సంబంధించి పోలీసుల స్టేట్‌మెంట్‌ను ఈ నెల 8న ఆర్‌పీ సోన్‌కర్ రికార్డు చేశారు. అరెస్టు వారంట్‌ను అమలు చేయడానికి తగిన విధానాన్ని పోలీసులు పాటించలేదని జడ్జి సోన్‌కర్ పేర్కొన్నారు. తనపై జరగరానిదేమైనా జరిగే అవకాశం ఉందని తాను నమ్ముతున్నానని, ఈ కేసును వేరొక కోర్టుకు బదిలీ చేయాలని కోరరు.


గోవింద్ సింగ్‌ పలుకుబడిగల రాజకీయ నేత. ఆయనపై ఇప్పటి వరకు 28 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మూడు హత్య కేసుల్లో జీవిత ఖైదు పడింది. వీటన్నిటిలోనూ ఆయన బెయిలుపై విడుదల కాగలిగారు. 


Updated Date - 2021-02-23T21:07:25+05:30 IST