జర్నలిస్ట్ రానా అయ్యుబ్ ట్విటర్ ఖాతా భారత్‌లో నిలిపివేత

ABN , First Publish Date - 2022-06-27T19:08:22+05:30 IST

ప్రముఖ జర్నలిస్టు రానా అయ్యుబ్ ట్విటర్ ఖాతాను భారత

జర్నలిస్ట్ రానా అయ్యుబ్ ట్విటర్ ఖాతా భారత్‌లో నిలిపివేత

న్యూఢిల్లీ : ప్రముఖ జర్నలిస్టు రానా అయ్యుబ్ ట్విటర్ ఖాతాను భారత దేశంలో నిలిపేస్తున్నట్లు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ తెలిపింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 నిబంధనలకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్లు వివరించింది. ఈ విషయాన్ని రానా తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘‘హలో ట్విటర్, ఏమిటి ఇదంతా?’’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. 


ట్విటర్ నుంచి రానాకు వచ్చిన నోటీసులో, భారత దేశంలోని స్థానిక చట్టాలను పాటించవలసిన బాధ్యత తమకు ఉందని తెలిపింది. దీనిలో భాగంగానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 నిబంధనలకు అనుగుణంగా ఈ ఖాతాను భారత దేశంలో నిలిపేస్తున్నట్లు తెలిపింది. ఈ ఖాతాలోని కంటెంట్ మిగిలిన ప్రాంతాల్లో యథావిథిగా అందుబాటులో ఉంటుందని వివరించింది. 


తమ సేవలను వినియోగించుకునేవారి గళాన్ని తాము గౌరవిస్తామని, మద్దతు పలుకుతామని ట్విటర్ ఈ నోటీసులో తెలిపింది. అయితే వారి ఖాతాలలోని కంటెంట్‌ను తొలగించాలని ఏదైనా అధికారిక వ్యవస్థ (దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలు) చట్టపరంగా కోరినపుడు, ఆ విషయాన్ని సంబంధిత అకౌంట్ హోల్డర్స్‌కు తెలియజేయడం తమ విధానమని పేర్కొంది. ఈ విజ్ఞప్తి ఏ దేశం నుంచి వచ్చిందో, ఆ దేశంలో సంబంధిత అకౌంట్ హోల్డర్ నివసిస్తున్నా, నివసించకపోయినా, తాము ఈ విధానాన్ని పాటిస్తామని పేర్కొంది. 


ఇది చాలా ఘోరం : మార్టినా నవ్రతిలోవా

రానా ట్వీట్‌పై టెన్నిస్ లెజెండ్ మార్టినా నవ్రతిలోవా స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, ఇక తర్వాత ఎవరి వంతు అని ప్రశ్నించారు. ఇది చాలా ఘోరమని వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్‌ను రానాకు, ట్విటర్‌కు జత చేశారు. 


ఇది ఓ బగ్ అయ్యుండొచ్చు

ప్రసార భారతి మాజీ సీఈఓ శశి శేఖర్ వెంపటి ఇచ్చిన ట్వీట్‌లో, భారత ప్రభుత్వం ట్విటర్ ఇండియా ద్వారా చేస్తోందని చెప్తున్న  ఆన్‌లైన్ సెన్సార్‌షిప్ గురించి చాలా ఆవేశపూరితమైన ట్వీట్లను గమనించానని తెలిపారు. రానా ఖాతాకు వచ్చిన నోటీసు ఓ బగ్ మాదిరిగా కనిపిస్తోందని, లేదంటే గతంలో జరిగిన సంఘటనలకు ఆలస్యంగా వచ్చిన స్పందన అయి ఉండవచ్చునని తెలిపారు. తనకు కూడా గత సంవత్సరం జరిగిన సంఘటనకు ఇప్పుడు ఇటువంటి ఈ-మెయిల్ వచ్చిందని చెప్పారు. ఆ నోటీసును కూడా తన ట్వీట్‌కు జత చేశారు. ట్విటర్ ఇండియా, ట్విటర్ నుంచి వచ్చిన అకౌంట్ విత్‌హెల్డ్ మెసేజ్‌తో బహుశా ‘సెలబ్రిటీ ఇస్లామోఫోబియా యాక్టివిస్ట్’ మాటలు తగ్గించి, తాను బాధితురాలినని చెప్పుకోవడం ఆపేయవచ్చునన్నారు. 


వెంపటి ట్విటర్ ఖాతా గత ఏడాది నిలిపివేతకు గురైంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరోధించడం కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలు కోరిన మీదట ట్విటర్ ఆయన ఖాతాను నిలిపేసింది. 


మనీలాండరింగ్ కేసులో రానా 

ఇదిలావుండగా, ‘వాషింగ్టన్ పోస్ట్’ కాలమిస్ట్ రానా అయ్యుబ్ మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్నారు. ఫిబ్రవరిలో ఆమె నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ.1.77 కోట్లు జప్తు చేసింది. రకరకాల ఉద్యమాల కోసం ఆమె స్వీకరించిన విరాళాలను సక్రమంగా ఖర్చు చేయలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలిపారు. ఆ విరాళాలను ఆమె తన సొంతానికి ఖర్చు చేసుకున్నారని ఆరోపించారు. 




Updated Date - 2022-06-27T19:08:22+05:30 IST