బరువు తగ్గించే జొన్నాస్‌ కిచెన్

ABN , First Publish Date - 2022-04-23T17:33:49+05:30 IST

బరువు తగ్గడానికి ఏం తినాలో చెప్తే సరిపోదు. ఎలా తినాలో చెప్పాలి, ఏ వంటకాలను ఎలా వండుకోవచ్చో చూపించాలి. అదే పని చేస్తోంది హైదరాబాద్‌కు చెందిన

బరువు తగ్గించే జొన్నాస్‌ కిచెన్

ఆంధ్రజ్యోతి(23-04-2022)

బరువు తగ్గడానికి ఏం తినాలో చెప్తే సరిపోదు. ఎలా తినాలో చెప్పాలి, ఏ వంటకాలను ఎలా వండుకోవచ్చో చూపించాలి. అదే పని చేస్తోంది హైదరాబాద్‌కు చెందిన న్యూట్రిషనిస్ట్‌ ప్రియాంక జొన్న. జొన్నాస్‌ కిచెన్‌ ఆన్‌లైన్‌ న్యూట్రిషన్‌ వేదికగా సామాజిక మాధ్యమాల ద్వారా గత మూడేళ్లుగా బరువు తగ్గించే వంటకాలను రుచి చూపిస్తోంది. విదేశాల నుంచి సైతం వేలకొద్దీ క్లయింట్లను సంపాదించుకున్న ప్రియాంక నవ్యతో పంచుకున్న అనుభవాలివి.


చిన్నతనం నుంచీ నాకు వంట చేయడమంటే ఇష్టం. ఏడో తరగతి నుంచే వంటింట్లో గరిట తిప్పడం మొదలుపెట్టాను. తర్వాత చదువు, ఉద్యోగం, పెళ్లి. కానీ పెళ్లి తర్వాతే న్యూట్రిషన్‌తో కూడిన వంటకాల వైపు అడుగు పడింది. అందుకు కారణం నా అధిక బరువే. పెళ్లై ఎనిమిదేళ్లు గడిచినా పిల్లలు పుట్టకపోవడానికి నా స్థూలకాయమే అడ్డుపడుతోందని తెలుసుకుని, న్యూట్రిషన్‌ మీద దృష్టి పెట్టాను. ఆ ఆసక్తితో, అమెరికన్‌ ఫిట్‌నెస్‌ ప్రొఫెషనల్స్‌ అండ్‌ అసోసియేట్స్‌ డిప్లొమా చేశాను. తర్వాత వెయిట్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలిస్ట్‌ సర్టిఫికేషన్‌ కూడా చేసి, అంతర్జాతీయ వెయిట్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలి్‌స్టగా కూడా గుర్తింపు పొందాను. ప్రస్తుతం అడ్వాన్స్‌డ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌లో పిజి డిప్లొమా చేస్తున్నాను. 


వెయిట్‌లాస్‌ ప్లాన్‌ ఇలా...

బరువు తగ్గే క్రమంలో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు తక్కువగా ఉండే ఆరోగ్యకరమైన వంటకాలను స్వయంగా రూపొందించడంతో పాటు, వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడం మొదలుపెట్టాను. అలా నా వంటకాలకు ఎంతో మంది అభిమానులు ఏర్పడ్డారు, క్రమేపీ ఫాలోవర్ల సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు లక్ష మంది ఫాలోవర్లు ఉన్నారు. సాధారణంగా ఏ న్యూట్రిషనిస్ట్‌ అయినా బరువు తగ్గడానికి ఏం తినాలో, ఏం తినకూడదో సూచిస్తూ డైట్‌ చార్ట్‌ అందిస్తారు. కానీ వంటకాలను ఎలా వండుకుని తినాలో వివరించే విధానం ఎక్కడా ఉండదు. ఈ కోణంలో ఆలోచించి, వెయిట్‌లాస్‌ ప్లాన్‌ డిజైన్‌ చేశాను. నా ప్లాన్‌లో వంటకాలను వండే విధానం గురించిన వివరణ కూడా ఉంటుంది.  


దేశ విదేశాల క్లయింట్లు...

నా క్లయింట్లలో మన దేశంతో పాటు దుబాయి, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, జపాన్‌, సౌదీ అరేబియా... ఇలా వేర్వేరు విదేశాల్లో స్థిరపడిన తెలుగువాళ్లున్నారు. ఇలా ఇప్పటివరకూ 800 మంది క్లయింట్లు వెయిట్‌ లాస్‌ అయ్యారు. ఎత్తు, బరువు, వయసు, ఆరోగ్య సమస్యలు... ఈ వివరాల ఆధారంగా వెయిట్‌లాస్‌ ప్లాన్‌ తయారుచేసి, అందిస్తాను. నేను అందించే ప్లాన్‌ కచ్చితంగా అనుసరిస్తే, వారంలోగా మార్పు మొదలవుతుంది. సంతృప్తికరమైన ఫలితం దక్కాలంటే కనీసం మూడు నెలల పాటైనా నా ప్లాన్‌ అనుసరించాలి. అధిక బరువు కారణంగా గర్భం దాల్చలేని వాళ్లు, నేను సూచించిన ప్లాన్‌తో బరువు తగ్గి, గర్భం దాల్చిన సందర్భాలూ ఉన్నాయి. 


పాశ్చాత్య పదార్థాలకు బదులుగా....

ఇన్‌స్టాగ్రామ్‌లో నేను పోస్ట్‌ చేసే వంటకాలన్నీ ఆరోగ్యం ప్రధానంగా రూపొందించినవే! ప్రధానంగా నేను వంటకాలను ఆవిరి మీద ఉడికించే పద్ధతిని అనుసరిస్తాను. ఉడకబెట్టినా, వండినా, వేయించినా పదార్థాల్లోని పోషకాలను నష్టపోతాం. అలా జరగకుండా ఉండడం కోసం అరటి ఆకులు మొదలైన వాటిలో పదార్థాలను ఉంచి ఆవిరి మీద ఉడికించే పద్ధతిని అనుసరిస్తాను. డైట్‌ అనగానే ఎవరికైనా ఓట్లు, పండ్లు లాంటివే గుర్తొస్తాయి. బిరియానీల్లాంటి వాటిని పూర్తిగా మానేయాలి అని అనుకుంటారు. కానీ బరువు తగ్గడం కోసం ఇష్టమైన వాటన్నిటినీ వదులుకోవలసిన అవసరం లేదు. తాత్కాలిక వెయిట్‌ లాస్‌ లక్ష్యంగా కాకుండా తగ్గిన బరువుతో జీవితాంతం కొనసాగడానికి వీలుగా ఆహారశైలిని ఎంచుకోవాలి. నేను రూపొందించే వంటకాలన్నీ ఆ కోవకు చెందినవే! 


నా డైట్‌లో చపాతీలు, పండ్ల రసాలు, బియ్యం.. ఇలా అన్నీ ఉంటాయి. అలాగే నేను మనవి కాని పాశ్చాత్య ఆహారానికి బదులుగా స్థానికంగా పండే పండ్లు, కూరగాయలు, ధాన్యాలకు ప్రాధాన్యం ఇస్తాను. అలాగే సాస్‌, డ్రస్సింగ్స్‌ కోసం కూడా ఇంట్లో తయారుచేసుకోగలిగే వాటినే నేను ప్రోత్సహిస్తాను. సాధారణంగా ఓట్లు తింటే బరువు తగ్గుతాం అనుకుంటారు.కానీ అంతే సమానమైన ప్రభావాన్నిచ్చే రాగులు, జొన్నలు, అటుకులు మన దగ్గర ఉన్నాయి. పైగా ఈ మధ్య మనకు జొన్న, బ్రౌన్‌ రైస్‌ అటుకులు దొరుకుతున్నాయి. అలాగే జొన్న రెట్టెల తయారీ రాకపోతే సర్వపిండి మాదిరిగా వాడుకోవచ్చు. పిండితో ఇడ్లీ, దోశల్లాంటివి చేసుకోవచ్చు. ఇలా తేలికగా, రుచికరంగా వండుకోగలిగే వంటకాలను నేను సూచిస్తాను. 


ఇంటి పనులతో వ్యాయామం..

వంటకాల్లోనే కాదు వ్యాయామంలో కూడా పాత కాలం పద్ధతులను అనుసరించవచ్చు. బరువు తగ్గడం కోసం జిమ్‌లో చేరేవాళ్లుంటారు. అయితే అదే వ్యాయామ ఫలితాన్ని మనం ఇంటి పనులతో కూడా పొందే వీలుంది. నడక, జాగింగ్‌, ఇంటి పనులతో బరువు తగ్గవచ్చు. క్రాష్‌ డైట్లు, కీటో డైట్లు లాంటివన్నీ తాత్కాలిక ఫలితాన్నిస్తాయి. అలా కాకుండా తరతరాలుగా వస్తున్న మనవైన పాత పద్ధతుల్లోనే ఆహారాన్ని తింటూ, మన ఇంటిపనులను మనమే చేసుకుంటూ కూడా అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఇలాంటి జీవనవిధానంతో బరువు అదుపులో ఉండడంతో పాటు అనారోగ్యాలూ దరి చేరకుండా ఉంటాయి.


గోగుమళ్ల కవిత


మాది నిజామాబాద్‌. అక్కడే పుట్టి పెరిగాను. గత ఆరేళ్లుగా హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. నాకెంతో ఇష్టమైన న్యూట్రిషన్‌ రంగంలోకి అడుగు పెట్టక ముందు, ఐటి రంగంలో ఉన్నాను. ఇప్పటికీ ఒక పక్క ఎమ్‌ఎన్‌సి కంపెనీలో కన్సల్టెంట్‌గా పని చేస్తూనే, ఇంకో పక్క ఆన్‌లైన్‌ వేదికగాన్యూట్రిషని్‌స్టగా కూడా కొనసాగుతున్నాను. నాకు ఏడాదిన్నర వయసున్న బాబు ఉన్నాడు. పేరు ధృవ. మా వారు భైరవ ప్రసాద్‌. ఆయన ప్రోత్సాహం, సహాయసహకారాలు ఉండబట్టే నేనిదంతా చేయగలుగుతున్నాను. ఆయన కూడా ఎమ్‌ఎన్‌సిలో పని చేస్తున్నారు. 

Updated Date - 2022-04-23T17:33:49+05:30 IST