చికోటి చిట్టాలో ఉమ్మడి జిల్లా నేతలు

ABN , First Publish Date - 2022-08-07T05:38:16+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న చికోటి ప్రవీణ్‌ విదేశాలలో నిర్వహించే క్యాసినో, హవాలా రూపంలో కోట్లలో లావాదేవీలు జరుపుతున్నాడనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నిఘా పెట్టి దర్యాప్తు చేస్తోంది. అయితే చికోటి ప్రవీణ్‌తో దేశవ్యాప్తంగానే కాకుండా తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు, వ్యాపారవేత్తలకు లావాదేవీల్లో సత్ససంబంధాలపై రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే.

చికోటి చిట్టాలో ఉమ్మడి జిల్లా నేతలు

- ఉమ్మడి నిజామాబాద్‌ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధాలు

- నిజామాబాద్‌, కామారెడ్డిలోని పలువురు ముఖ్యనేతలతో లావాదేవీలు

- చికోటి ప్రవీణ్‌ వాట్సాప్‌ చాటింగ్‌లో గుర్తించిన ఈడీ

- సదరు ఎమ్మెల్యేలు, నేతలకు ఈడీ నోటీసులు

- రేపు విచారణకు రావాలంటూ ఆదేశించినట్లు సమాచారం

- చికోటితో జిల్లా నేతల సంబంధాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ

- జల్సాలు, జూదం ఆడేందుకు రూ.కోట్లలోనే లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు

- ఇందుకోసం సదరు నేతలు గోవాతో పాటు విదేశాలకు వెళుతూ వస్తుంటారంటూ ప్రచారం


కామారెడ్డి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న చికోటి ప్రవీణ్‌ విదేశాలలో నిర్వహించే క్యాసినో, హవాలా రూపంలో కోట్లలో లావాదేవీలు జరుపుతున్నాడనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నిఘా పెట్టి దర్యాప్తు చేస్తోంది. అయితే చికోటి ప్రవీణ్‌తో దేశవ్యాప్తంగానే కాకుండా తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు, వ్యాపారవేత్తలకు లావాదేవీల్లో సత్ససంబంధాలపై రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో 12 మంది ఎమ్మెల్యేలతో పాటు కొందరు మంత్రులకు సంబంధాలు ఉన్నట్లు చిట్టాను ఈడీ సిద్ధం చేసింది. చికోటి చిట్టాలో ఉమ్మడి నిజామాబాద్‌ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలకు క్యాసినో నిర్వహణలో ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు ఈడీ ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. ఈ ఇద్దరి ఎమ్మెల్యేలకు ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేయడంతో పాటు సోమవారం విచారణ కోసం ఈడీ కార్యాలయానికి రావాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలే కాకుండా నిజామాబాద్‌ నగరంతో పాటు కామారెడ్డి పట్టణానికి చెందిన పలువురు ద్వితియశ్రేణి ముఖ్యనేతలు చికోటి ప్రవీణ్‌ క్యాసినో లావాదేవీల్లో హవాలా రూపంలో నగదు బదిలీ చేసినట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులు, నేతలతో చికోటి ప్రవీణ్‌తో ఉన్న సంబంధాలపై జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

వాట్సాప్‌ చాటింగ్‌ ద్వారా గుర్తించిన ఈడీ

విదేశాలలో క్యాసినో నిర్వహించే చికోటి ప్రవీణ్‌ కేసు దర్యాప్తు ఈడీ ముమ్మరం చేసింది. సినీ ప్రముఖులతో పాటు పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, బడా వ్యాపారులతో చికోటి ప్రవీణ్‌ విదేశాలలో విందు, వినోదాల పేరుతో క్యాసినో, జూదం లాంటివి నిర్వహిస్తుంటాడు. వీరిని తరచూ విదేశాలకు తీసుకెళ్తు క్యాసినో నిర్వహిస్తూ ఆ ముసుగులో హవాలా రూపంలో కోట్లలో నగదు బదిలీ చేస్తున్నాడనే ఆరోపణలతో ఈడీ చికోటి ప్రవీణ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపడుతుంది. ఇందులో భాగంగానే చికోటి ప్రవీణ్‌తో సత్ససంబంధాలు ఉన్న ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, బడా వ్యాపారులపై ఆరా తీసింది. హవాలా రూపంలో నగదు బదిలీ చేయడంపై చికోటి ప్రవీణ్‌ వాట్సాప్‌ చాటింగ్‌ను ఈడీ సేకరించింది. ఇందులో తెలంగాణలోని 12 మంది ఎమ్మెల్యేలతో పాటు పలువురు మంత్రులు, మరికొందరు బడా వ్యాపారులు క్యాసినో నిర్వహణలో కోట్లలోనే హవాలా రూపంలో చికోటి ప్రవీణ్‌కు నగదు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. చికోటితో వాట్సాప్‌ చాటింగ్‌ చేసిన 12 మంది ఎమ్మెల్యేల్లో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ ఎమ్మెల్యేలు ఎవరనే దానిపై ఉమ్మడి జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది.

క్యాసినో కోసం ఉమ్మడి జిల్లాల నేతలు విదేశాలకు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పేకాటను పూర్తిగా నిర్మూలించింది. పేకాట ఆడేందుకు ఉమ్మడి జిల్లాలకు చెందిన పలువురు జూదరులు, రాజకీయ నేతలు బడా వ్యాపారులు పొరుగు రాష్ట్రాలతో పాటు గోవా లాంటి ప్రాంతాలకు వెళ్తు రూ.లక్షల్లో లావాదేవీలు జరుపుతుంటారు. క్యాసినో లాంటి జూదం దేశంలో అనుమతి లేకపోవడంతో దీనికి అలవాటు పడిన బడా వ్యాపారులు, ప్రజాప్రతినిధులు అప్పుడప్పుడు విదేశాలతో పాటు గోవాకు వెళ్తుంటారు. క్యాసినో ముసుగులో కోట్లలో నగదును హవాలా రూపంలో లావాదేవీలు జరుపుతుంటారు. దేశంలో పర్యాటక స్థలంగా ఉన్న గోవాలో మాత్రమే క్యాసినోకు అనుమతి ఉన్నట్లు తెలుస్తోంది. గోవాతో పాటు శ్రీలంక, సింగపూర్‌, నేపాల్‌ లాంటి దేశాలకు క్యాసినో ఆడేందుకు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి చాలా మంది నేతలు, బడా వ్యాపారులు వెళ్తుంటారు. ప్రధానంగా వీకెండ్‌ సమయంలో క్యాసినో నిర్వహణ కోసం వెళుతూ లక్షలు, కోట్ల రూపాయల్లోనే నగదు లావాదేవీలు జరుపుతున్నట్లు రాజకీయవర్గాల్లోనే కాకుండా బడా వ్యాపారవర్గాల్లోనూ చర్చసాగుతోంది. నిజామాబాద్‌ నగరం కామారెడ్డి, బాన్సువాడ పట్టణానికి చెందిన పలువురు నేతలు బడా వ్యాపారులతో కలిసి తరచూ గోవా, శ్రీలంక, సింగపూర్‌, నేపాల్‌కు వెళ్తు క్యాసినోలో కోట్లలోనే హవాలా రూపంలో లావాదేవీలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్‌కు ఉమ్మడి జిల్లాల నుంచి పలువురు ఏజెంట్లుగా, కస్టమర్లుగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

Updated Date - 2022-08-07T05:38:16+05:30 IST