ఉమ్మడి కుడా

ABN , First Publish Date - 2022-04-06T05:30:00+05:30 IST

జిల్లాల విభజన జరిగినా కొన్ని శాఖలు ఉమ్మడిగా కొనసాగుతున్నాయి.

ఉమ్మడి కుడా
కర్నూలులోని జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయం

  1. ఇప్పట్లో విభజన లేనట్లే..!
  2. కర్నూలు, నంద్యాల పరిధిలో పట్టణాభివృద్ధి సంస్థ
  3. రెండు జిల్లాలకు ఒకే జడ్పీ
  4. కర్నూలు కేంద్రంగా పలు విభాగాలు


    జిల్లాల విభజన జరిగినా కొన్ని శాఖలు ఉమ్మడిగా కొనసాగుతున్నాయి. ఇందులో కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా), జడ్పీ కీలమైనవి. 50 మండలాలతో విస్తరించిన కుడా పరిధిలో కొత్తగా ఏర్పడిన నంద్యాల జిల్లా మండలాలు 26 ఉన్నాయి. జిల్లా పరిషత్‌ (జడ్పీ)ను ఇప్పట్లో విభజించే అవకాశం లేదని పాలకవర్గాలు చెబుతున్నాయి. అంటే.. ఇక కుడా, జడ్పీ సమవేశాలు, సమీక్షలకు రెండు జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కావాల్సి ఉంది. అలాగే.. పలు కీలక శాఖలు ఉమ్మడి జిల్లా కేంద్రంగానే కొనసాగుతున్నాయి. 


కర్నూలు-ఆంధ్రజ్యోతి: ఆంధ్రప్రదేశ్‌ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ యాక్ట్‌-2016 ప్రకారం 2016 నవంబరు 4న కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పట్టణ ప్రణాళిక అమలు చేయడం, అక్రమ లేఅవుట్లు నిరోధించడం ప్రధాన లక్ష్యం. కర్నూలు నరగపాలక సంస్థ, నంద్యాల, డోన్‌ మున్సిపాలిటీలు, గూడూరు, బేతంచెర్ల నగర పంచాయతీలు సహా 9 మండలాల్లోని 123 గ్రామాలతో కుడా ఏర్పాటు చేశారు. ప్రారంభ సమయంలో విస్తీర్ణం 2,599.50 చదరపు కిలోమీటర్లు. 2019 తరువాత వైసీపీ ప్రభుత్వం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 53 మండలాలు ఉండగా. 50 మండలాలను కుడా పరిధిలోకి చేర్చింది. కొత్తపల్లి, గడివేముల, అవుకు మండలాలు మినహా జిల్లా అంతా కుడా పరిధిలోకి వస్తుంది. 


ఇప్పటికి ఉమ్మడిగానే ..

జిల్లాల విభజన తరువాత కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) ఉమ్మడిగా ఉంటుందా..? కొత్తగా నంద్యాల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (నుడా) ఏర్పాటు చేస్తారా..? అన్న ప్రశ్న వ్యక్తమైంది. అయితే.. ప్రస్తుతానికి ఉమ్మడిగానే ఉంటుందని అధికారులు అంటున్నారు. కుడా విభజనపై ఎలాంటి సంకేతాలు లేవని పేర్కొంటున్నారు. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అఽథారిటీకి ప్రభుత్వం నామినేట్‌ చేసే వ్యక్తి చైర్మన్‌గా ఉంటారు. ఐఏఎస్‌ స్థాయి అధికారి వైస్‌ చైర్మన్‌గా కొనసాగుతారు. వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు డైరెక్టర్లుగా ఉంటారు. ప్రస్తుతం కోడుమూరు వైసీపీ ఇన్‌చార్జి కోట్ల హర్షవర్దన్‌రెడ్డి కుడా చైర్మన్‌గా ఉన్నారు. రెండు జిల్లాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, డీడీఆర్‌సీ సమావేశాలకు కుడా చైర్మన్‌గా హాజరు అయ్యే అవకాశం ఉంది. అయితే.. అక్రమ లేఅవుట్లు, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తే.. తమ జిల్లాలో కర్నూలు జిల్లా నాయకుల పెత్తనమేమిటని నంద్యాల జిల్లా నాయకులు ప్రశ్నించే అకాశం లేకపోలేదు. భవిషత్తులో నంద్యాల జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడిని కుడా చైర్మన్‌ చేస్తే.. కర్నూలు జిల్లా పేరుతో ఉన్న కుడా చైర్మన్‌గా నంద్యాల జిల్లా నాయకులకు ఎలా ఇస్తారు..? అని ఇక్కడి నేతలు నిలదీసే పరిస్థితి రావచ్చని పలువురు అంటున్నారు. 


అక్రమ లేఅవుట్లపై దృష్టి సారిస్తారా?

కుడా పరిధిలో కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ.. వంటి ప్రధాన పట్టణాలు సహా జిల్లా అంతటా 1,000 పైగా అక్రమ లేఅవుట్లు గుర్తించారు. వీటిలో రిజిస్ట్రేషన్లు చేయవద్దని డైరెక్టరు ఆఫ్‌ టౌన్‌ ప్లాంనిగ్‌ అధికారులు.. పట్టణాలు, లేఅవుట్లు, సర్వే నంబర్లు, విస్తీర్ణం తదితర వివరాలతో జిల్లా రిజిస్ట్రేషన్‌ శాఖకు లేఖ రాశారు. ఈ అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరిస్తే కుడా, స్థానిక మున్సిపాలిటీలకు సుమారు రూ.100 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. కొత్తగా ఏర్పడిన నంద్యాల జిల్లాలోనే అక్రమ లే అవుట్లు అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిపై కుడా చైర్మన్‌ గానీ, అధికారులుగానీ దృష్టి సారిస్తారో లేదో తెలియాలి. ఎక్కువ శాతం అక్రమ అలేవుట్లు ముఖ్య ప్రజాప్రతినిధులు, వారి బంధువులు, అనుచరులకు చెందినవే ఉన్నాయి. కుడా చైర్మన్‌ వాటిపై చర్యలకు ఉపక్రమిస్తే నంద్యాల జిల్లా ప్రజాప్రతినిధులు సహకరిస్తారా..? అన్నది ప్రశ్నార్థకమే. 


జడ్పీ విభజన లేనట్లే..

జిల్లాలు విభజన జరిగినా జిల్లా పరిషత్‌ (జడ్పీ) విభజన లేనట్లే అని అధికారులు అంటున్నారు. కర్నూలు జడ్పీ పాలకవర్గంలో 53 మంది జడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. జడ్పీ చైర్మన్‌ నంద్యాల జిల్లాకు చెందిన కొలిమిగుండ్ల జడ్పీటీసీ సభ్యుడు ఎర్రబోతుల పాపిరెడ్డి, శిరివెళ్ల మండలం జడ్పీటీసీ దిల్‌షాద్‌నాయక్‌, హొళగుంద జడ్పీటీసీ సభ్యురాలు కె.బుజ్జమ్మ వైస్‌ చైర్మన్లుగా ఉన్నారు. చైర్మన్‌, ఒక వైస్‌ చైర్మన్‌ నంద్యాల జిల్లాకు చెందిన వారే. జడ్పీకి ఏటా 15వ ఆర్థిక సంఘం నిఽధులు రూ.12.05 కోట్లు వస్తున్నాయి. 57 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్‌) నిర్వహణ బాధ్యత జడ్పీదే. సీఈవో, డిప్యూటీ సీఈవో సహా వివిధ హోదాల్లో 80 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. రెండు జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో జడ్పీ పని చేయాల్సి ఉంటుంది. ప్రొటోకాల్‌ ప్రకారం రెండు జిల్లాల్లో ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా జడ్పీ చైర్మన్‌ అధికారికంగా హాజరు అవుతారు.  


ప్రస్తుతానికి ఉమ్మడిగానే: వెంట్రామిరెడ్డి, కుడా వైస్‌ చైర్మన్‌, కర్నూలు

జిల్లా విభజన జరిగినా ప్రస్తుతానికి కుడా ఉమ్మడిగా ఉంటుంది. భవిషత్తులో ప్రభుత్వం నంద్యాల అర్బన్‌ డవలప్‌మెంట్‌ అథారిటీ చేస్తుందేమో..! మాకు సమాచారం లేదు. కుడా పరిధిలో వెయ్యికి పైగా అక్రమ లేఅవుట్లు గుర్తించాం. వాటిని క్రమబద్ధీకరిస్తే రూ.100 కోట్లు వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 


Updated Date - 2022-04-06T05:30:00+05:30 IST