గేమ్‌ చేంజర్‌ టీకా..

ABN , First Publish Date - 2021-03-01T06:58:31+05:30 IST

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా టీకా అత్యవసర వినియోగానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీయే అనుమతి వచ్చేసింది. కరోనా కట్టడిలో గేమ్‌ చేంజర్‌ అవుతుందని పలువురు నిపుణులు చెబుతున్న ఈ వ్యాక్సిన్‌ ప్రత్యేక ఏమిటి? ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫైజర్‌, మోడెర్నా, ఆక్స్‌ఫర్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలకు దీనికి తేడా ఏమిటి? తదితర అంశాలను పరిశీలిస్తే...

గేమ్‌ చేంజర్‌ టీకా..

  • జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాపై నిపుణుల అభిప్రాయం.. 
  • ఒక్క డోసుతో వైరస్‌ ప్రభావానికి అడ్డుకట్ట
  • మొండి స్ట్రెయిన్లు ఉన్న ప్రాంతాల్లో ట్రయల్స్‌
  • 66శాతం ప్రభావం చూపిన వ్యాక్సిన్‌
  • సాధారణ ఫ్రీజర్లలో భద్రపరచుకునే చాన్స్‌

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా టీకా అత్యవసర వినియోగానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీయే అనుమతి వచ్చేసింది. కరోనా కట్టడిలో గేమ్‌ చేంజర్‌ అవుతుందని పలువురు నిపుణులు చెబుతున్న ఈ వ్యాక్సిన్‌ ప్రత్యేక ఏమిటి? ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫైజర్‌, మోడెర్నా, ఆక్స్‌ఫర్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలకు దీనికి తేడా ఏమిటి? తదితర అంశాలను పరిశీలిస్తే..


అరుదైన వైరస్‌తో..

ఇది కూడా ఆక్స్‌ఫర్డ్‌ టీకాలాగానే వెక్టర్‌ వ్యాక్సిన్‌. అంటే.. ఏదో ఒక నిర్వీర్యం చేసిన వైర్‌సను వాహకంగా చేసుకుని, కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ను శరీరంలోకి పంపుతారన్నమాట. ఆక్స్‌ఫర్డ్‌ టీకా తయారీలో చింపాంజీలకు జలుబు కలిగేలా చేసే ఎడినోవైర్‌సను వినియోగించారు. చైనాకు చెందిన క్యాన్‌సినో సంస్థ ‘ఎడినో వైరస్‌ 5 (ఏడీ5)’ రకాన్ని వినియోగించగా.. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ తన టీకా తయారీలో అత్యంత అరుదైన ‘ఎడినోవైరస్‌ 26 (ఏడీ26)’ రకాన్ని వినియోగించింది. ప్రపంచవ్యాప్తంగా.. ‘ఎడినోవైరస్‌ 5’ బారిన పడేవారు చాలా మందే ఉంటారు. వ్యాక్సిన్‌ వాహకంగా ఆ వైర్‌సను వినియోగిస్తే.. అప్పటికే శరీరానికి దాన్ని ఎదుర్కొనే శక్తి ఉంటుంది కాబట్టి వ్యాక్సిన్‌ పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ ఈ వైర్‌సను ఎంచుకుంది. రష్యా తయారు చేసిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ రెండు డోసుల్లో తొలి డోసుగా ఏడీ 26 రకంతో తయారు చేసిందే ఇస్తున్నారు. ఏడీ5 రకాన్ని వినియోగించి చేసిన వ్యాక్సిన్‌ను రెండో డోసుగా ఇస్తున్నారు. 


ఎలా పనిచేస్తుందంటే..

నిర్వీర్యం చేసిన ఎడినోవైరస్‌ 26లో కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ డీఎన్‌ఏను పెట్టి ఇంజెక్షన్‌ ద్వారా శరీరంలోకి పంపుతారు. లోపలికి వెళ్లిన వైరస్‌ ఆ డీఎన్‌ఏను కణాల్లోకి ప్రవేశపెడుతుంది. అప్పుడు, స్పైక్‌ ప్రొటీన్‌ డీఎన్‌ఏ.. దాని నకిలీలను తయారుచేసేలా కణాలను ప్రేరేపిస్తుంది. అలా తయారైన స్పైక్‌ ప్రొటీన్లను పసిగట్టిన మన రోగనిరోధక వ్యవస్థ అప్రమత్తమై.. వాటిని నిర్వీర్యం చేసే యాంటీ బాడీలను తయారుచేస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైనా మన శరీరంలోకి నిజంగా కరోనా వైరస్‌ ప్రవేశిస్తే.. దాని స్పైక్‌ ప్రొటీన్‌ను అప్పటికే గుర్తుపెట్టుకుని ఉన్న రోగనిరోధక వ్యవస్థ.. వైర్‌సపై దాడి చేసి చంపేస్తుంది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ ఈ వైర్‌సనే వాహకంగా చేసుకుని ఎబోలా వైర్‌సకు వ్యాక్సిన్‌ను రూపొందించింది. 2019 నుంచి కాంగో దేశంలో ఎబోలాకు ఆ వ్యాక్సిన్‌నే వినియోగిస్తున్నారు. 


దుష్ప్రభావాలు తక్కువే!

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌తో దుష్ప్రభావాలు తక్కువగానే ఉన్నట్టు ట్రయల్స్‌లో తేలింది. ఇంజెక్షన్‌ చేసిన చోట నొప్పి, అలసట, తలనొప్పి వంటివి మాత్రమే కనిపించాయి. వేలాది మందితో ట్రయల్స్‌ నిర్వహించగా.. ఒక్కరికి మాత్రమే ఎలర్జిక్‌ రియాక్షన్‌ వచ్చింది. 2ు మందికి జ్వరం రాగా.. 0.2ు మందికి మాత్రమే తీవ్ర జ్వరం వచ్చింది.


ఒక్కటే డోసు..

ఇప్పటిదాకా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లన్నీ రెండు డోసులు తీసుకోవాల్సిందే. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌ మాత్రం ఒక్కటే డోసు తీసుకుంటే సరిపోతుంది. ఇది అందరినీ ఎక్కువగా ఆకర్షిస్తున్న అంశం. 


ఇంట్లో ఉండే ఫ్రిజ్‌ చాలు!

ఫైజర్‌, మోడెర్నా కంపెనీలు రూపొందించిన ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లను భద్రపరచడానికి మైనస్‌ 70, మైనస్‌ 20 డిగ్రీల అత్యంత శీతల వాతావరణం కావాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే దేశాల్లో వాటిని భద్రపరచడం, రవాణాకుఆ స్థాయి రిఫ్రిజిరేటెడ్‌ వాహనాలు వినియోగించడం కష్టం. అదే.. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌ను భద్రపరచడానికైతే 1 నుంచి 7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు సరిపోతాయి. అంటే.. మనం ఇంట్లో వాడే ఫ్రిజ్‌లు చాలు. ఆ ఫ్రిజ్‌లో ఈ వ్యాక్సిన్‌ను మూడు నెలల దాకా ఉంచి, వాడుకోవచ్చు. అందుకే.. యూనివర్సిటీ ఆఫ్‌ షికాగోకు చెందిన ఇమ్యూనాలజీ పరిశోధకురాలు జెన్నా జె గుత్‌మిల్లర్‌ దీన్ని ‘గేమ్‌ చేంజర్‌’గా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా గ్రామీణప్రాంతాల వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నార.




మనదేశంలో తయారీ..

ఇది అన్నింటికన్నా శుభవార్త. ఆక్స్‌ఫర్డ్‌ టీకాను మన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తయారుచేసినట్టే.. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ అభివృద్ధి చేసిన ఈ టీకాను భారతదేశంలో ఉత్పత్తి చేయడానికి మన హైదరాబాద్‌లో ఉన్న ‘బయొలాజికల్‌-ఈ’తో 2020 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా.. ఏడాదిలోగా 60 కోట్ల డోసులను ‘బయో-ఈ’ సంస్థ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. అమెరికా ప్రభుత్వం.. 10 కోట్ల డోసులను బిలియన్‌ డాలర్లు (రూ.7359 కోట్లు) చెల్లించి కొనేందుకు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. అంటే.. ఒక్కో డోసు దాదాపుగా రూ.736 పడుతుంది. అయితే.. మనదేశంలోనే తయారవడం వల్ల ఇది మనకు తక్కువ ఖర్చుకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.



ఎంతమందిపై ట్రయల్స్‌?

ప్రపంచవ్యాప్తంగా 44 వేల మందిపై చేసిన ట్రయల్స్‌లో.. వ్యాక్సిన్‌ 66శాతం సమర్థంగా పనిచేస్తున్నట్టు తేలింది. ఫైజర్‌, మోడెర్నాతో పోలిస్తే ఇది తక్కువగా అనిపించొచ్చు. కానీ.. మొండి రకం స్ట్రెయిన్‌గా పేరొందిన బి1351 రకం వైరస్‌ ఎక్కువగా వ్యాపించిన దక్షిణాఫ్రికాలో ఈ వ్యాక్సిన్‌ 64శాతం ప్రభావం చూపింది. అమెరికాలో 72శాతం ప్రభావం.. లాటిన్‌ అమెరికా దేశాల్లో 66శాతం ప్రభావం చూపింది. అంతేకాదు.. ఈ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో పాల్గొన్నవారిలో 34శాతం.. 60 ఏళ్లు పైబడినవారే. ట్రయల్స్‌లో పాల్గొన్నవారిలో 17.2శాతం మంది ఆఫ్రికన్లు కాగా.. 8.3శాతం మంది అమెరికన్లు, 2.5శాతం మంది ఆసియన్లు, 45శాతం మంది లాటినోలు. 


- సెంట్రల్‌ డెస్క్‌


Updated Date - 2021-03-01T06:58:31+05:30 IST